ins virat
-
విశాఖలో ముగిసిన ‘విరాట్’ పర్వం!
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమాన వాహక నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్ఎస్ విరాట్ నేవీ సేవల నుంచి 2016 అక్టోబర్‌లో నిష్క్రమించింది. అప్పట్లో దీన్ని మ్యూజియం, స్టార్ హోటల్‌గా మార్చాలని భావించారు. కేంద్ర ప్రభుత్వం విరాట్‌ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ఏపీకి అందించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలి మండలం మూలకుద్దులో విరాట్‌ను మ్యూజియం, స్టార్ హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు నివేదికను రూపొందించాలని చెన్నైకి చెందిన నాటెక్స్ మేరీటైమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు గత టీడీపీ ప్రభుత్వం రూ.1.50 లక్షలు కేటాయించింది. అయితే సుమారు రూ.700 కోట్ల ఈ ప్రాజెక్టు వ్యయ భారాన్ని భరించలేమంటూ టీడీపీ సర్కార్ చివరకు చేతులెత్తేసింది. దీంతో మహారాష్ట్ర తెరపైకి వచ్చి మ్యూజియంని తాము ఏర్పాటు చేసుకుంటామంటూ విరాట్‌ని ముంబై నావల్ డాక్ యార్డుకి తరలించింది. చివరికి ఈ నౌకని గుజరాత్‌కు చెందిన శ్రీరామ్ గ్రూప్ రూ.38.54 కోట్లకు వేలంలో దక్కించుకుంది. విరాట్ ప్రాజెక్టు వివరాలివీ.. ► యుద్ధ నౌకలోని 1,500 గదులను ఫైవ్ స్టార్ హంగులతో పర్యాటక హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు. ► 500 మందికిపైగా కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతోపాటు మిగిలిన భాగాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ► వీటితోపాటు స్పోర్ట్స్, యాకింగ్, సెయిలింగ్, గ్లైడింగ్, క్రూయిజింగ్ వంటి సౌకర్యాల్ని కల్పించాలని భావించారు. ఐఎన్ఎస్ విరాట్ విశేషాలివీ... ► 1959లో బ్రిటిష్ నౌకాదళంలో సేవలందించింది. ► 1987లో రూ.604.50 కోట్లకు భారత్ కొనుగోలు చేసి ఐఎన్ఎస్ విరాట్‌గా పేరు మార్చింది. ► ఐఎన్ఎస్ విరాట్ భారత జలాల్లో ప్రవేశించాక 22 మంది కెప్టెన్లు విధులు నిర్వర్తించారు. ఇందులో ఐదుగురు భారత నౌకాదళానికి చీఫ్ స్థానాన్ని అధిష్టించారు. ► ప్రపంచంలో సుదీర్ఘ కాలం (2,250 రోజులు (విధుల్లో ఉన్న కాలం)) సేవలందించిన యుద్ధ విమాన వాహక నౌకగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. అందుకే ఈ నౌకని ది గ్రాండ్ ఓల్డ్ లేడీ అని అంటారు. ► మొత్తం 10,94,215 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ఈ దూరం 27సార్లు భూమిని చుట్టి రావడంతో సమానం. ► యుద్ధ సమయంలో ఒకేసారి 26 యుద్ధ విమానాల్ని తీసుకెళ్లగలిగే సామర్థ్యం సొంతం. ► ఈ నౌక బరువు 28,700 టన్నులు, పొడవు 226.5 మీటర్లు, వెడల్పు 48.78 మీటర్లు. చివరిసారిగా విశాఖలోనే... భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన విరాట్.. అనేక చారిత్రక విజయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. చివరిసారిగా విశాఖ సముద్ర జలాల్లోనే విహరించింది. 2016 ఫిబ్రవరిలో నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లో ఐఎన్ఎస్ విరాట్ తళుక్కున మెరిసింది. ఐఎఫ్ఆర్ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆఖరి అవకాశమూ చేజారింది...!! విరాట్‌ని వేలంలో దక్కించుకున్న శ్రీరామ్ గ్రూప్.. మ్యూజియంగా మార్చేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. రూ.100 కోట్లకి నౌకని ఇస్తామని, అక్టోబర్ 15లోగా ముందుకు రావాలంటూ ప్రకటించింది. దీనికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. నో అబ్జక్షన్ సర్టిఫికేట్ జారీ చేస్తే అమ్మేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే.. గడువు ముగిసే నాటికి ఎన్వోసీ రాకపోవడంతో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. గుజరాత్ మారిటైమ్ బోర్డు అనుమతి రాగానే.. త్వరలోనే నౌకను విచ్ఛిన్నం చేసి తుక్కుగా మార్చే ప్రక్రియ మొదలు పెడతామని తెలిపింది. అయితే.. ఇండియా, బ్రిటన్ జాతీయ గౌరవంగా భావించాల్సిన ఐఎన్ఎస్ విరాట్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డిసెంబర్ 4న ది హెర్మస్ విరాట్ హెరిటేజ్ ట్రస్ట్.. ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఇంకా ప్రధాని కార్యాలయ వర్గాలు స్పందించలేదు. -
‘మోదీకి కుటుంబం లేకనే ఎక్కడికీ వెళ్లట్లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరణంలో నేతల మాటలు తూటల్లా పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత విమర్శల వరకు హద్దులు మీరుతున్నాయి. 1987లో ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ గాంధీ దంపతులు తమ వ్యక్తిగత విహార యాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఘాటైన వ్యాఖ్యలతో స్పందించారు. ‘ ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లడం సర్వసాధారణం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఆయన భార్య సోనియా గాంధీతో కలిసి వెళ్లారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం (భార్య) లేదు కాబట్టి ఎక్కడికీ వెళ్లడంలేదు. కేవలం ఆయనొక్కరే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు.’’ అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని చేసన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజీవ్ గాంధీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేస్తున్నారు. నాడు రాజీవ్ కోసం ప్రత్యేకంగా విరాట్‌ను తీసుకెళ్లడంగానీ, దాని రూట్ మార్చడంగానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా రిటైరైన అడ్మిరల్ రాందాస్ మీడియా ముఖంగా మోదీకి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. విరాట్ నౌక లక్ష దీవులకు వెళుతుందని తెలిసి రాజీవ్ దంపతులు నౌక ఎక్కారని, వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు. #WATCH Anand Sharma, Congress on PM Modi's comment on INS Viraat: Any PM would do so but this PM has no family,if he had family then he would also be going there, but he goes alone because he has no connect with a family or any respect for family values. (09/05/2019) pic.twitter.com/N9sKN7iQ2D — ANI (@ANI) May 10, 2019 -
రాజీవ్ గాంధీ ప్రస్తావన ఎందుకో!?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారంలో తరచు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన కుమారుడు రాహుల్ గాంధీ పదే పదే రఫేల్ యుద్ధ విమానాల స్కామ్ గురించి ప్రస్తావిస్తున్నందుకు ప్రతిగా రాజీవ్ గాంధీ గురించి ప్రస్తావిస్తున్నారా ? అదే నిజమైతే ‘బోఫోర్స్’ ముడుపుల స్కామ్‌కు మాత్రమే పరిమితం కావాలి? ఆ స్కామ్ కారణంగానే ఆయన ప్రధాని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. 1987లో ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ గాంధీ దంపతులు తమ వ్యక్తిగత విహార యాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ నరేంద్ర మోదీ తాజాగా ఆరోపించారు. నాడు రాజీవ్ గాంధీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినా వెంటనే నాటి మేటి పార్లమెంట్ సభ్యులు అటల్ బిహారి వాజపేయి, భూపేశ్ గుప్తా, జైపాల్ రెడ్డి, ఇంద్రజిత్ గుప్తాలు ఎండగట్టేవాళ్లు. వాళ్లే కాకుండా నాడు బీజేపీ కూడా ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకలో ఎందుకు వెళ్లారని రాజీవ్ గాంధీని ప్రశ్నించలేదు. కాకపోతే అందులో లక్ష్యదీవులకు వెళితే ఎవరిని అతిథులుగా తీసుకెళ్లారంటూ అప్పటి బీజేపీ ప్రధాన కార్యదర్శి కష్ణలాల్ శర్మ ప్రశ్నించారు. అమితాబ్ బచ్చన్‌ను తీసుకెళ్లారంటూ ఆయనే ఆ తర్వాత పేరు వెల్లడించారు. రాజీవ్ గాంధీ 1987, డిసెంబర్ నెలలో లక్షదీవుల్లో జరిగిన ‘ఐలాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ’ అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆయనతోపాటు ఆయన భార్య సోనియా గాంధీ కూడా వెళ్లారు. నాడు ఆయన కోసం ప్రత్యేకంగా విరాట్‌ను తీసుకెళ్లడంగానీ, దాని రూట్ మార్చడంగానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా రిటైరైన అడ్మిరల్ రాందాస్ మీడియా ముఖంగా మోదీకి వివరణ కూడా ఇచ్చారు. విరాట్ నౌక లక్ష దీవులకు వెళుతుందని తెలిసి రాజీవ్ దంపతులు నౌక ఎక్కారని, వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు. నాడు నౌకలోఉన్న పలువురు నౌకాదళం అధికారులు కూడా మోదీ ఆరోపణలను ఖండించారు. రాజీవ్ తన అధికార పర్యటనలకు సోనియా గాంధీని వెంట తీసుకెళ్లేవారు. ఇక విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఆయన తన పిల్లలలోపాటు అజితాబచ్చన్, అమితాబ్‌బచ్చన్, వారి పిల్లలకు ఎక్కువగా తీసుకెళ్లేవారు. వారంతా ఎక్కువగా ఇటలీకే వెళ్లేవారు. మెర్సిడెస్ బెంచీ లాంటి లగ్జరీ కార్లను నడుపుకుంటే తిరిగే అలవాటున్న రాజీవ్ వ్యక్తిగత పర్యటనలకు ప్రత్యేక విమానాలనుగానీ, నౌకలనుగానీ ఏనాడు ఉపయోగించలేదు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం మంచి చెడుల ప్రస్తావన పక్కన పెడితే ఆయన కృషి కారణంగానే దేశానికి కంప్యూటర్లు, సెల్ఫోన్లు వచ్చాయి. అదే కంప్యూటర్ను ఉపయోగించి నాడు రాజీవ్ గాంధీ లక్షదీవులకు విహార యాత్రకు వెళ్లారా, లేదా ? అన్న విషయాన్ని నేడు సులువుగానే తెలుసుకోవచ్చు. నేడు దేశాన్ని కరువు, కాటకాలు, మంచినీటి సమస్య, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న అంతర్జాతీయ చమురు ధరలు, పర్యావరణం లాంటి ఎన్నో సమస్యలు పీడిస్తుండగా రాజకీయ నేతలు వ్యక్తిగత, కుటుంబ దూషణలకు దిగడం ఏమిటో !? -
కెనడా పౌరుడిని ఎందుకు వెంట తీసుకెళ్లినట్టు?
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరిన క్రమంలో బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు విమర్శలు- ప్రతివిమర్శలతో యుద్ధానికి దిగుతున్నాయి. దివంగత నేత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీ కుటుంబం సొంత ట్యాక్సీలా వాడుకుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ నేతలు కూడా రాజీవ్ గాంధీతో పాటు నెహ్రూపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ నేతలు కూడా దీటుగా బదులిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్య(దివ్యా స్పందన) ట్విటర్ వేదికగా నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వ వివాదాన్ని ప్రస్తావిస్తూ... ‘ నరేంద్ర మోదీ కెనడా పౌరుడైన అక్షయ్‌కుమార్‌ను ఐఎన్ఎస్ సుమిత్రలో విహారానికి తీసుకువెళ్లారు. ఇది సరైందేనా? ఈ వివాదం గురించి గతంలో వచ్చిన ఆర్టికల్ చూడండి’ అంటూ ఓ వార్తకు సంబంధించిన లింక్‌ను తన ట్వీట్‌కు జత చేశారు. కాగా ఐఎన్ఎస్ విరాట్‌లో ప్రయాణించిన సమయంలో రాజీవ్ గాంధీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇద్దరు అధికారులు మాత్రమే వారి వెంట ఉన్నారని రిటైర్డ్ వైస్ అడ్మిరల్ వినోద్ పస్రిచా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక రమ్య ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2016కు అక్షయ్, కంగనాలను అప్పటి రాష్ట్రపతి, రక్షణ మంత్రి ఆహ్వానించారు. వారిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ప్రధాని మోదీ కూడా ఒక అతిథిలాగే వెళ్లారు’ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం.. ‘ అవును ఏ పార్టీ నాయకులైనా, ప్రధానులైనా సరే విదేశీ పౌరులను ఇలా మన యుద్ధనౌకల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించడం సరికాదు’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. Yeh teek tha? @narendramodi you took a Canadian citizen @akshaykumar with you on-board INS Sumitra. #SabseBadaJhootaModi Here’s the link to the article, most of us have not forgotten this controversy : https://t.co/jrPNUvk2Py pic.twitter.com/SWkl78rA4F — Divya Spandana/Ramya (@divyaspandana) May 9, 2019 -
‘ఇంత పిరికి ప్రధానిని ఎన్నడూ చూడలేదు’
ప్రతాపగఢ్/జౌన్పూర్: నరేంద్ర మోదీ కన్నా పిరికి, బలహీన ప్రధానిని తానెప్పుడూ చూడలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాపగఢ్, జౌన్పూర్ల్లో ప్రియాంక గురువారం ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఈయన (మోదీ) కన్నా ఎక్కువగా భయపడే, బలహీన ప్రధానిని నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక అన్నారు. మాజీ ప్రధాని, ప్రియాంక తండ్రి దివంగత రాజీవ్ గాంధీపై మోదీ ఇటీవల పలు ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. బుధవారం మోదీ మాట్లాడుతూ యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ తన వ్యక్తిగత ట్యాక్సీలా ఉపయోగించుకుని అందులో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారని మోదీ అన్నారు. ఆ మరుసటిరోజే ప్రియాంక మాట్లాడుతూ ‘నెరవేర్చని హామీలపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. విపరీత ప్రచారం, ప్రముఖ టీవీ కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లో బలం రాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతం. ఆ ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరించే శక్తి ఉండాలి. ప్రతిపక్షం ఏం చెబుతుందో వినే శక్తి ఉండాలి. మరి ఈ ప్రధాని మన మాటలు చెవికెక్కించుకోవడం అటుంచితే, ఆయనకు సరిగ్గా సమాధానం చెప్పడం కూడా రాదు’ అని ప్రియాంక అన్నారు. తన ప్రచారాలతో మోదీ వాస్తవాలను కప్పిపుచ్చి, అంతా బ్రహ్మాండం, అద్భుతమని నమ్మిస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. -
రాజీవ్‌పై ‘విరాట్ ట్యాక్సీ’ అంతా అబద్ధం
న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రాందాస్ ఖండించారు. రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన సదరన్ నేవీ కమాండర్‌గా ఉన్నారు. ఐఎన్ఎస్ విరాట్‌పై రాజీవ్‌తో కలిసి ఆయన ప్రయాణించారు. మోదీ ఆరోపణలపై రాందాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆ సమయంలో కేవలం ప్రధాని, ఆయన సతీమణి మాత్రమే ఉన్నారు. విదేశీయులెవరూ మాతో లేరు. అదంతా ప్రొటోకాల్ ప్రకారమే జరిగింది’ అని వివరించారు. ‘రాజీవ్ కుటుంబ పర్యటన కోసం ఏ నౌకనూ ప్రత్యేకంగా కేటాయించలేదు. అత్యవసర వైద్య అవసరాలకు వినియోగించుకునేందుకు లక్షద్వీప్ రాజధాని కవరట్టిలో మాత్రం ఒక హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాం’అని తెలిపారు. ‘కవరట్టిలో జరిగే అధికారిక కార్యక్రమానికి ప్రధాని రాజీవ్, ఆయన భార్య హాజరయ్యారు. రెండు రోజులపాటు ఇక్కడే ఉన్నారు. అనంతరం వారిద్దరూ కుటుంబసభ్యులు, ఇతర అతిథులను కలుసుకునేందుకు సమీపంలోని బంగారం దీవికి వెళ్లారు’ అని నాటి లక్షద్వీప్ పరిపాలనాధికారి హబీబుల్లా తెలిపారు. ఐఏఎఫ్ విమానాలను ట్యాక్సీల్లా వాడుకుంటుందెరు? ‘ప్రధాని మోదీకి వాస్తవాలతో పనిలేదు. చెప్పుకోవటానికి ఆయనకు ఏమీ లేనందున ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారు’అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. అప్పట్లో ప్రధాని రాజీవ్ అధికారిక పర్యటన కోసమే ఐఎన్ఎస్ విరాట్‌పై ప్రయాణించారే తప్ప కాలక్షేపం కోసం కాదంటూ నేవీ మాజీ ఉన్నతాధికారులు సైతం వెల్లడించారని పేర్కొన్నారు. ‘బోఫోర్స్ కుంభకోణంపై బహిరంగ చర్చకు మేం ఎల్లప్పుడూ సిద్ధం...మీరు రఫేల్‌పై చర్చకు సిద్ధమేనా అని ఖేరా సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఆఖరి ప్రయత్నంగా మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రచారం కోసం వైమానిక దళం(ఐఏఎఫ్) విమానాలను సొంత ట్యాక్సీల మాదిరిగా ప్రధాని మోదీ వాడుకుంటున్నారని, ఇందుకోసం అతి తక్కువగా కేవలం రూ.744 చెల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుదోవ పట్టించడంలో మోదీని మించిన వారు లేరని, బీజేపీని పెద్ద అబద్ధాల పార్టీ(బహుత్ జూట్ పార్టీ)గా కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి అభివర్ణించారు. మోదీ తీరుతో ప్రధాని కార్యాలయం స్థాయిని దిగజార్చారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందుగా గ్రహించి మోదీ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
కాంగ్రెస్ సహా ప్రతిపక్షం చేతులెత్తేసింది
కురుక్షేత్ర/ఫతేహాబాద్/న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశలు పూర్తయ్యేసరికే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేతులెత్తేశాయని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని తేలిపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన హరియాణాలోని కురుక్షేత్ర, ఫతేహాబాద్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ‘ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ప్రజల ఆశీర్వాదంతో మే 23వ తేదీ సాయంత్రం వెలువడే ఎన్నికల ఫలితాలతో మోదీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటవ్వడం ఖాయమని తేలిపోయింది. కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు విఫలమవడంతో కాంగ్రెస్, దాని అవినీతి కూటమి పార్టీలు చేతులెత్తేశాయి’ అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ ‘అవినీతి పంట’ పండించింది.. గత కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ధరకే రైతుల భూములను లాగేసుకుని అవినీతి పంట పండించిందని, అందుకు హరియాణానే రుజువని ప్రధాని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ అవినీతి నేతలందరినీ జైళ్లకు పంపడం ఖాయమని కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం భూపీందర్ హుడా, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వీధివీధికో కాంగ్రెస్ నేత విగ్రహం ‘పాకిస్తాన్ అంటే కాంగ్రెస్‌కు ఎంతో ప్రేమ. దేశం సుభిక్షంగా ఉండటం పాక్ పుణ్యమేనంటుంది. రక్షణ విధానం బలహీనంగా ఉన్న ఏ దేశమైనా అగ్రదేశమవుతుందా? తనను తాను రక్షించుకోలేని దేశం మాట ఇతర దేశాలు వింటాయా?’ అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. సిక్కు వ్యతిరేక దాడులతో సంబంధమున్న ఓ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ సీఎంగా చేసిందని, పరోక్షంగా కమల్నాథ్నుద్దేశిస్తూ అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో వీధికో కాంగ్రెస్ నేత విగ్రహం ఏర్పాటు చేసుకున్న గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, అమర సైనికులకు స్మృతిచిహ్నం ఒక్కటి కూడా నిర్మించలేకపోయాయన్నారు. నా తల్లిని కూడా దూషించారు ‘ప్రేమ పదకోశం(లవ్ డిక్షనరీ)నుంచి సేకరించిన తిట్లతో నిత్యం తనను దూషించే కాంగ్రెస్ పార్టీ నేతలు.. తన తల్లిని కూడా వదల్లేదని ప్రధాని విమర్శించారు. ‘వారి అవినీతిని అడ్డుకుని, దొరతనాన్ని ప్రశ్నించినందుకే ప్రేమ ముసుగు వేసుకుని హిట్లర్, దావూద్ ఇబ్రహీం, ముస్సోలినీ, ఔరంగజేబ్ కంటే క్రూరుడు, పిచ్చికుక్క, కోతి..ఇలా రకరకాల పేర్లతో నన్ను తిడుతున్నారు’ అని పేర్కొన్నారు. ‘ నా తల్లినీ వారు దూషించారు. నా తండ్రి ఎవరని ఆమెను అడిగారు. ఈ నిందలన్నీ నేను ప్రధాని పదవిని చేపట్టాక చేసినవే’ అని మోదీ పేర్కొన్నారు. ఆప్ ప్రభుత్వం వృథా.. ‘ఏ పనీ చేయని సర్కారుకు ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వమే ఉదాహరణ. తమను తాము మార్చుకోలేని వాళ్లు దేశాన్ని మార్చుతామంటూ అధికారంలోకి వచ్చారు. చిల్లర ముఠాలను బలపరుస్తూ దేశానికి శత్రువులను పెంచుతున్నారు’ అన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను ఢిల్లీ ఆస్పత్రుల్లో అమలు చేయనందుకే ఆప్ ప్రభుత్వాన్ని ఉపయోగం లేని(నాకామ్ పంతి) ప్రభుత్వంగా మోదీ అభివర్ణించారు. మావోలు, వేర్పాటు వాదులను సమర్ధించే వారిని మోదీ తరచూ చిల్లర (టుక్డేటుక్డే)గ్యాంగ్‌గా పేర్కొనడం తెల్సిందే. ఐఎన్ఎస్ విరాట్‌ను ట్యాక్సీలా వాడారు! రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విరాట్’ను వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని మోదీ ఆరోపించారు. ‘రాజీవ్‌గాంధీ, ఆయన బావమరుదుల కుటుంబాలు కలిసి పది రోజుల విహారయాత్రకు బయలుదేరారు. ఆ యాత్రకు దేశ ప్రాదేశిక సముద్ర జలాల్లో గస్తీ కోసం వినియోగించే ఐఎన్ఎస్ విరాట్‌ను సొంత ట్యాక్సీ మాదిరిగా వాడుకున్నారు. విరాట్’పై హెలికాప్టర్‌ను సైతం నేవీ సిద్ధంగా ఉంచింది. విరాట్‌తోపాటు వారంతా ఒక దీవిలో పది రోజుల పాటు ఆగారు. విదేశీయులను యుద్ధ నౌకలో తీసుకెళ్లడం ద్వారా దేశ భద్రత విషయంలో రాజీ పడలేదా అనేదే నా ప్రశ్న. ఐఎన్ఎస్ విరాట్‌ను 1987లో భారత నేవీలోకి తీసుకోగా 2016లో విధుల నుంచి తొలగించారు. -
ఆంధ్రప్రదేశ్ చేజారిన ఐఎన్ఎస్ విరాట్
న్యూఢిల్లీ: నౌకా దళం సేవల నుంచి ఉపసంహరించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ ఆంధ్రప్రదేశ్ చేజారిపోయింది. ఐఎన్ఎస్ విరాట్‌ను తమ రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. ఐఎన్ఎస్ విరాట్‌ను 850 కోట్ల రూపాయలు వెచ్చించి హోటల్ కమ్ మ్యూజియంగా మార్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది వాస్తవమేనా? అది నిజమైతే దానికి సంబంధించిన వివరాలు ఏమిటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ రాతపూర్వక సమాధానమిచ్చారు. ఐఎన్ఎస్ విరాట్‌ను విశాఖపట్నం వద్ద అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కమ్ హోటల్‌గా మార్చేందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించాలని రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకరించింది వాస్తవం కాదా అని విజయసాయిరెడ్డి మరో ప్రశ్నను కేంద్రం ముందుంచారు. దీనిపై స్పందించిన రక్షణ మంత్రిత్వ శాఖ ఆ మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఐఎన్ఎస్ విరాట్‌ను హోటల్ కమ్ మ్యూజియంగా మార్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు రక్షణ శాఖ మంత్రి పునరుద్ఘాటించారు. విశాఖ- రాజమండ్రి మధ్య టోల్ వసూళ్లు రూ.1775 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం-రాజమండ్రి మధ్య జాతీయ రహదారిపై ఉన్న మూడు ప్రధాన టోల్ గేట్ల నుంచి ఇప్పటివరకు 1775 కోట్ల రూపాయల వసూలు చేసినట్టు ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ సోమవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. విశాఖ-రాజమండ్రి మధ్య జాతీయ రహదారిపై అగనంపూడి, వేంపాడు, కృష్ణవరం వద్ద మూడు టోల్ గేట్లు ఉన్నట్టు తెలిపారు. జూలై 1998 నుంచి 25 డిసెంబర్ 2018 వరకు అగనం పూడి టోల్ గేట్లో 286.25 కోట్ల రూపాయలు, మే 2005 నుంచి 25 డిసెంబర్ 2018 వరకు వేంపాడు టోల్ గేట్లో 844.99 కోట్ల రూపాయలు, మే 2005 నుంచి 25 డిసెంబర్ వరకు కృష్ణవరం టోల్ గేట్లో 644.23 కోట్ల రూపాయలు టోల్ ఫీజు కింద వసూలు చేసినట్టు మంత్రి వెల్లడించారు. అదే విధంగా ఈ మూడు చోట్ల టోల్ ఫీజు వసూలు సమయంలో జాప్యం వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం వాస్తవం కాదా అన్న ప్రశ్నకు మంత్రి లేదని జవాబిచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో ట్రాఫిక్ పెరిగితే అదనపు సిబ్బందిని పెట్టుకునే బాధ్యత ఒప్పందం ప్రకారం టోల్ ఏజెన్సీదేనని అన్నారు. వేంపాడు, కృష్ణవరం టోల్ ప్లాజాల వద్ద అదనంగా మరో రెండు లైన్లు విస్తరించుకునే సౌలభ్యం ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. యూజర్ ఫీ నిబంధనల ప్రకారమే వాహనదారుల నుంచి ఫీజుల వసూలు చేయడం జరుగుతుందన్నారు. -
విరాట్‌పై చిగురించిన ఆశలు
► ప్రాథమిక అంచనాకు నిధులు ► రూ.1.50 లక్షలు చెన్నై సంస్థకు కేటాయింపు విశాఖసిటీ : విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ ప్రాజెక్టుపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. విశాఖలో ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ.. ప్రభుత్వం ప్రాథమిక పరిశీలన నివేదికకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో మ్యూజియంతో పాటు స్టార్ హోటల్‌గా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద విమాన యుద్ధ నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్ఎస్ విరాట్ నేవీ సేవల నుంచి గతేడాది నిష్క్రమించింది. అప్పటి నుంచి దీన్ని మ్యూజియం, స్టార్ హోటల్‌గా తీర్చిదిద్దాలని భావించారు. ప్రాజెక్టు వ్యయం వెయ్యి కోట్ల రూపాయలు అనుకున్నప్పటికీ అంత వ్యయాన్ని భరించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో దాన్ని రూ. 300 కోట్లకు కుదించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే అప్పటి నుంచి దీనిపై ఎలాంటి చర్చలూ.. కేంద్ర ప్రభుత్వం, నేవీ అధికారుల నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ప్రాజెక్టు వెనక్కు మళ్లిందని అనుకున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ నౌకను మ్యూజియం, స్టార్ హోటల్‌గా మార్చేందుకు అవసరమైన నివేదికను తయారు చేయాలంటూ చెన్నైకి చెందిన నాటెక్స్ మ్యారీటైమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.1.50 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. ఈ ప్రాథమిక నివేదిక తయారు చేసేందుకు రూ.1.75 లక్షల వ్యయం అవుతుందని సంస్థ ప్రభుత్వానికి పంపించగా.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి.. దీనికి లక్షన్నర రూపాయలు సరిపోతాయని సంస్థకు తేల్చిచెప్పింది. వీలైనంత త్వరలో ప్రాథమిక నివేదికను అందివ్వాలని చెన్నై సంస్థను కోరింది. భీమిలిలో ఏర్పాటుకుసన్నాహాలు విరాట్ మ్యూజియం, స్టార్ హోటల్ ఏర్పాటు కోసం పర్యాటక శాఖ మూడు స్థలాల్ని ఎంపిక చేసింది. చివరికి భీమిలి మండలం మూలకుద్దులో ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద దేశంలో తొలి సబ్‌మెరైన్ మ్యూజియం, ఆసియాలోనే తొలి యుద్ధ విమాన మ్యూజియం ప్రాజెక్టులతో పర్యాటక రంగంలో వన్నెలద్దుకున్న విశాఖ తాజా గా.. విరాట్‌తో ప్రపంచస్థాయి మ్యూజియంగా ఖ్యాతి గడించనుంది. -
ఏపీ కాదంది.. ముక్కలుకానున్న యుద్ధనౌక
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత్ మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌కు జరిగిందే బ్రిటిష్ ఇండియాకు చెందిన ఐఎన్ఎస్ విరాట్‌కు కూడా జరగబోతుందా?. నేవీకి 30 ఏళ్ల పాటు సేవలందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్‌ను భారత ప్రభుత్వం ముక్కలుగా విడగొట్టాలనే యోచనలో ఉంది. వచ్చే నెల 6వ తేదీన సర్వీసు నుంచి రిటైర్‌కానున్న విరాట్ బ్రిటిష్ ఇండియాకు 27 ఏళ్ల పాటు సేవలందించింది. ఆ తర్వాత 1987లో భారత నేవీలో చేరింది. రిటైర్మెంట్ తర్వాత విరాట్‌ను మ్యూజియంగా మార్చే అవకాశాలను తొలుత కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. విరాట్‌ను 13 అంతస్తుల మ్యూజియంగా మార్చేందుకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతాయి. ఈ విషయాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం రూ.500 కోట్ల వరకూ తాము భరించగలమని మిగతా కేంద్రమే భరించాలని కోరింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్ధనను తోసిపుచ్చిన కేంద్రం సాంకేతికంగా అవసరమైతే సాయం చేస్తామని, నిధుల సాయమైతే కష్టమే అనే సంకేతాలు పంపింది. దీంతో ఐఎన్ఎస్ విరాట్‌ను తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. విక్రాంత్ రిటైర్మెంట్ అనంతరం 17 సంవత్సరాల పాటు మెయింటైన్ చేసిన భారత ప్రభుత్వం ఎక్కువ ఖర్చు అవుతుండటంతో భాగాలను విడగొట్టేందుకు అమ్మేసింది. మార్చి 6వ తేదీన ముంబై పోర్టులో భారతీయ నేవీ విరాట్‌కు విడ్కోలు పలకనుంది. ఈ కార్యక్రమానికి విరాట్ మొదటి కమాండర్‌తో పాటు విరాట్‌లో పనిచేసిన బ్రిటన్‌కు చెందిన పలువురు వెటరన్లు, నేవీ అడ్మిరల్ సునీల్ లాంబా, నేవీ అధికారులు హాజరుకానున్నట్లు తెలిసింది. విరాట్ తన కెరీర్లో ఐదు లక్షల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది. -
‘విరాట్’కు విశ్రాంతి
ఐఎఫ్ఆర్ అనంతరం నిష్ర్కమించనున్న ఐఎన్ఎస్ విరాట్ అత్యధిక కాలం సేవలందించిన విమాన వాహక నౌకగా ప్రపంచ రికార్డు సాక్షి, విశాఖపట్నం: ఐఎన్ఎస్ విరాట్.. భారత నావికాదళానికి చెందిన విమాన వాహక యుద్ధనౌక.. అటు బ్రిటిష్, ఇటు భారత నావికాదళాలకు 57 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన యుద్ధనౌకగా గుర్తింపు పొందింది. ఏడేళ్ల క్రితమే భారత నావికాదళ సేవల నుంచి తప్పుకోవలసి ఉన్నా వీలుకాక ఇంకా సేవలందిస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి విశాఖలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లో ఆఖరి అంకాన్ని ప్రదర్శించి ఘనంగా వీడ్కోలు తీసుకోనుంది. అనంతరం షిప్ మ్యూజియంగా రూపాంతరం చెంది కాకినాడ తీరంలో కొలువుదీరనుంది. ఏకైక విమానవాహక యుద్ధనౌక బ్రిటిష్ రాయల్ నేవీలోకి హెచ్ఎంఎస్ హెర్మస్ పేరుతో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ (విమాన వాహక యుద్ధనౌక) 1959లో చేరింది. అర్జెంటీనాతో 1982లో జరిగిన (ఫాక్‌ల్యాండ్) యుద్ధం లో పాల్గొంది. సుమారు 27 ఏళ్లు రాయల్ నేవీలో సేవలందించాక దాన్ని 1986 ఏప్రిల్‌లో ప్రభుత్వం కొనుగోలు చేసింది. అనంతరం అవసరమైన మరమ్మతులు, హంగులు సమకూర్చుకుని 1987 మే 12న ఈ నౌక ఐఎన్ఎస్ విరాట్ పేరుతో ఇండియన్ నేవీలో చేరింది. అప్పట్నుంచి మన నావికాదళంలో అతిపెద్ద, ఏకైక విమానవాహక యుద్ధనౌకగా భాసిల్లుతోంది. దీని నుంచి 16 సీ హారియర్, 4 వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్‌లు, 4 హెచ్ఏఎల్ ధృవ్‌లు, 2 హెచ్ఏఎల్ చేతక్.. వెరసి 26 ఎయిర్‌క్రాఫ్ట్‌లు రాకపోకలు సాగించే వీలుంది. ఇందులో 1207 మంది నౌకా సిబ్బంది, ఎయిర్ క్రూ మరో 143 మంది విధులు నిర్వహిస్తున్నారు. 226.5 మీటర్ల పొడవు, 48.78 మీటర్ల వెడ ల్పు ఉన్న ఈ భారీ యుద్ధనౌక 23,900 టన్నుల బరువును తీసుకెళ్లగలదు. ఇది గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో పయనిస్తుంది. వయసు మీరడంతో 2009లోనే ఐఎన్ఎస్ విరాట్‌ను సేవల నుంచి తప్పించాలనుకున్నారు. కానీ దాని స్థానంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రాక ఆలస్యం కావడంతో ఏటేటా రీఫిట్ పనులు చేస్తూ కొనసాగిస్తున్నారు. 1986, 1999, 2008, 2009, 2012, 2013ల్లో దీనికి మరమ్మతులు చేపట్టారు. నౌకాదళ పశ్చిమ కమాండ్ పరిధిలో ముంబై కేంద్రంగా విరాట్ సేవలందిస్తోంది. కాకినాడలో షిప్ మ్యూజియంగా.. నౌకాదళ సేవల నుంచి తప్పించిన తరువాత కూడా ఐఎన్ఎస్ విరాట్ తన ప్రత్యేకతను చాటుకోనుంది. ఈ యుద్ధనౌకను కాకినాడ పోర్టు వద్ద షిప్ మ్యూజియంగా రూపొందించనున్నారు. ఇందుకోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా పొందింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) దీనికవసరమైన ఏర్పాట్లు చేయనుంది. ఈ షిప్ మ్యూజియానికి రూ.20 కోట్ల ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికే విశాఖ సాగరతీరంలో కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం ఉంది. కాకినాడ తీరంలో ఏర్పాటయ్యే ఐఎన్ఎస్ విరాట్ షిప్ మ్యూజియం దేశంలోనే మొట్టమొదటిది అవుతుంది.