సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారంలో తరచు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన కుమారుడు రాహుల్ గాంధీ పదే పదే రఫేల్ యుద్ధ విమానాల స్కామ్ గురించి ప్రస్తావిస్తున్నందుకు ప్రతిగా రాజీవ్ గాంధీ గురించి ప్రస్తావిస్తున్నారా ? అదే నిజమైతే ‘బోఫోర్స్’ ముడుపుల స్కామ్‌కు మాత్రమే పరిమితం కావాలి? ఆ స్కామ్ కారణంగానే ఆయన ప్రధాని పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. 1987లో ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ గాంధీ దంపతులు తమ వ్యక్తిగత విహార యాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ నరేంద్ర మోదీ తాజాగా ఆరోపించారు.
నాడు రాజీవ్ గాంధీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడినా వెంటనే నాటి మేటి పార్లమెంట్ సభ్యులు అటల్ బిహారి వాజపేయి, భూపేశ్ గుప్తా, జైపాల్ రెడ్డి, ఇంద్రజిత్ గుప్తాలు ఎండగట్టేవాళ్లు. వాళ్లే కాకుండా నాడు బీజేపీ కూడా ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధ నౌకలో ఎందుకు వెళ్లారని రాజీవ్ గాంధీని ప్రశ్నించలేదు. కాకపోతే అందులో లక్ష్యదీవులకు వెళితే ఎవరిని అతిథులుగా తీసుకెళ్లారంటూ అప్పటి బీజేపీ ప్రధాన కార్యదర్శి కష్ణలాల్ శర్మ ప్రశ్నించారు. అమితాబ్ బచ్చన్‌ను తీసుకెళ్లారంటూ ఆయనే ఆ తర్వాత పేరు వెల్లడించారు.
రాజీవ్ గాంధీ 1987, డిసెంబర్ నెలలో లక్షదీవుల్లో జరిగిన ‘ఐలాండ్స్ డెవలప్‌మెంట్ అథారిటీ’ అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆయనతోపాటు ఆయన భార్య సోనియా గాంధీ కూడా వెళ్లారు. నాడు ఆయన కోసం ప్రత్యేకంగా విరాట్‌ను తీసుకెళ్లడంగానీ, దాని రూట్ మార్చడంగానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా రిటైరైన అడ్మిరల్ రాందాస్ మీడియా ముఖంగా మోదీకి వివరణ కూడా ఇచ్చారు. విరాట్ నౌక లక్ష దీవులకు వెళుతుందని తెలిసి రాజీవ్ దంపతులు నౌక ఎక్కారని, వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు.
నాడు నౌకలోఉన్న పలువురు నౌకాదళం అధికారులు కూడా మోదీ ఆరోపణలను ఖండించారు. రాజీవ్ తన అధికార పర్యటనలకు సోనియా గాంధీని వెంట తీసుకెళ్లేవారు. ఇక విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఆయన తన పిల్లలలోపాటు అజితాబచ్చన్, అమితాబ్‌బచ్చన్, వారి పిల్లలకు ఎక్కువగా తీసుకెళ్లేవారు. వారంతా ఎక్కువగా ఇటలీకే వెళ్లేవారు. మెర్సిడెస్ బెంచీ లాంటి లగ్జరీ కార్లను నడుపుకుంటే తిరిగే అలవాటున్న రాజీవ్ వ్యక్తిగత పర్యటనలకు ప్రత్యేక విమానాలనుగానీ, నౌకలనుగానీ ఏనాడు ఉపయోగించలేదు.
రాజీవ్ గాంధీ ప్రభుత్వం మంచి చెడుల ప్రస్తావన పక్కన పెడితే ఆయన కృషి కారణంగానే దేశానికి కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వచ్చాయి. అదే కంప్యూటర్‌ను ఉపయోగించి నాడు రాజీవ్ గాంధీ లక్షదీవులకు విహార యాత్రకు వెళ్లారా, లేదా ? అన్న విషయాన్ని నేడు సులువుగానే తెలుసుకోవచ్చు. నేడు దేశాన్ని కరువు, కాటకాలు, మంచినీటి సమస్య, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న అంతర్జాతీయ చమురు ధరలు, పర్యావరణం లాంటి ఎన్నో సమస్యలు పీడిస్తుండగా రాజకీయ నేతలు వ్యక్తిగత, కుటుంబ దూషణలకు దిగడం ఏమిటో !?
Comments
Please login to add a commentAdd a comment