‘విరాట్’కు విశ్రాంతి | INS virat Indian royal navy missile | Sakshi
Sakshi News home page

‘విరాట్’కు విశ్రాంతి

Published Thu, Jan 28 2016 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

‘విరాట్’కు విశ్రాంతి

‘విరాట్’కు విశ్రాంతి

ఐఎఫ్‌ఆర్ అనంతరం నిష్ర్కమించనున్న ఐఎన్‌ఎస్ విరాట్
అత్యధిక కాలం సేవలందించిన విమాన వాహక నౌకగా ప్రపంచ రికార్డు

 
సాక్షి, విశాఖపట్నం: ఐఎన్‌ఎస్ విరాట్.. భారత నావికాదళానికి చెందిన విమాన వాహక యుద్ధనౌక.. అటు బ్రిటిష్, ఇటు భారత నావికాదళాలకు 57 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన యుద్ధనౌకగా గుర్తింపు పొందింది. ఏడేళ్ల క్రితమే భారత నావికాదళ సేవల నుంచి తప్పుకోవలసి ఉన్నా వీలుకాక ఇంకా సేవలందిస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి విశాఖలో జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో ఆఖరి అంకాన్ని ప్రదర్శించి ఘనంగా వీడ్కోలు తీసుకోనుంది. అనంతరం షిప్ మ్యూజియంగా రూపాంతరం చెంది కాకినాడ తీరంలో కొలువుదీరనుంది.  

ఏకైక విమానవాహక యుద్ధనౌక
బ్రిటిష్ రాయల్ నేవీలోకి హెచ్‌ఎంఎస్ హెర్మస్ పేరుతో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ (విమాన వాహక యుద్ధనౌక) 1959లో చేరింది. అర్జెంటీనాతో 1982లో జరిగిన (ఫాక్‌ల్యాండ్) యుద్ధం లో పాల్గొంది. సుమారు 27 ఏళ్లు రాయల్ నేవీలో సేవలందించాక దాన్ని 1986 ఏప్రిల్‌లో ప్రభుత్వం కొనుగోలు చేసింది. అనంతరం అవసరమైన మరమ్మతులు, హంగులు సమకూర్చుకుని 1987 మే 12న ఈ నౌక ఐఎన్‌ఎస్ విరాట్ పేరుతో ఇండియన్ నేవీలో చేరింది. అప్పట్నుంచి మన నావికాదళంలో అతిపెద్ద, ఏకైక విమానవాహక యుద్ధనౌకగా భాసిల్లుతోంది. దీని నుంచి 16 సీ హారియర్, 4 వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్‌లు, 4 హెచ్‌ఏఎల్ ధృవ్‌లు, 2 హెచ్‌ఏఎల్ చేతక్.. వెరసి 26 ఎయిర్‌క్రాఫ్ట్‌లు రాకపోకలు సాగించే వీలుంది.

ఇందులో 1207 మంది నౌకా సిబ్బంది, ఎయిర్ క్రూ మరో 143 మంది విధులు నిర్వహిస్తున్నారు. 226.5 మీటర్ల పొడవు, 48.78 మీటర్ల వెడ ల్పు ఉన్న ఈ భారీ యుద్ధనౌక 23,900 టన్నుల బరువును తీసుకెళ్లగలదు. ఇది గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో పయనిస్తుంది. వయసు మీరడంతో 2009లోనే ఐఎన్‌ఎస్ విరాట్‌ను సేవల నుంచి తప్పించాలనుకున్నారు. కానీ దాని స్థానంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రాక ఆలస్యం కావడంతో ఏటేటా రీఫిట్ పనులు చేస్తూ కొనసాగిస్తున్నారు. 1986, 1999, 2008, 2009, 2012, 2013ల్లో దీనికి మరమ్మతులు చేపట్టారు. నౌకాదళ పశ్చిమ కమాండ్ పరిధిలో ముంబై కేంద్రంగా విరాట్ సేవలందిస్తోంది.
 
కాకినాడలో షిప్ మ్యూజియంగా..
నౌకాదళ సేవల నుంచి తప్పించిన తరువాత కూడా ఐఎన్‌ఎస్ విరాట్ తన ప్రత్యేకతను చాటుకోనుంది. ఈ యుద్ధనౌకను కాకినాడ పోర్టు వద్ద షిప్ మ్యూజియంగా రూపొందించనున్నారు. ఇందుకోసం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా పొందింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) దీనికవసరమైన ఏర్పాట్లు చేయనుంది. ఈ షిప్ మ్యూజియానికి రూ.20 కోట్ల ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికే విశాఖ సాగరతీరంలో కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం ఉంది.  కాకినాడ తీరంలో ఏర్పాటయ్యే ఐఎన్‌ఎస్ విరాట్ షిప్ మ్యూజియం దేశంలోనే మొట్టమొదటిది అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement