ఫతేహాబాద్‌లో కార్యకర్తలకు మోదీ అభివాదం
కురుక్షేత్ర/ఫతేహాబాద్/న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశలు పూర్తయ్యేసరికే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేతులెత్తేశాయని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని తేలిపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన హరియాణాలోని కురుక్షేత్ర, ఫతేహాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ‘ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ప్రజల ఆశీర్వాదంతో మే 23వ తేదీ సాయంత్రం వెలువడే ఎన్నికల ఫలితాలతో మోదీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటవ్వడం ఖాయమని తేలిపోయింది. కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు విఫలమవడంతో కాంగ్రెస్, దాని అవినీతి కూటమి పార్టీలు చేతులెత్తేశాయి’ అని ప్రధాని అన్నారు.
కాంగ్రెస్ ‘అవినీతి పంట’ పండించింది..
గత కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ధరకే రైతుల భూములను లాగేసుకుని అవినీతి పంట పండించిందని, అందుకు హరియాణానే రుజువని ప్రధాని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ అవినీతి నేతలందరినీ జైళ్లకు పంపడం ఖాయమని కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం భూపీందర్ హుడా, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
వీధివీధికో కాంగ్రెస్ నేత విగ్రహం
‘పాకిస్తాన్ అంటే కాంగ్రెస్‌కు ఎంతో ప్రేమ. దేశం సుభిక్షంగా ఉండటం పాక్ పుణ్యమేనంటుంది. రక్షణ విధానం బలహీనంగా ఉన్న ఏ దేశమైనా అగ్రదేశమవుతుందా? తనను తాను రక్షించుకోలేని దేశం మాట ఇతర దేశాలు వింటాయా?’ అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. సిక్కు వ్యతిరేక దాడులతో సంబంధమున్న ఓ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ సీఎంగా చేసిందని, పరోక్షంగా కమల్‌నాథ్‌నుద్దేశిస్తూ అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో వీధికో కాంగ్రెస్ నేత విగ్రహం ఏర్పాటు చేసుకున్న గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, అమర సైనికులకు స్మృతిచిహ్నం ఒక్కటి కూడా నిర్మించలేకపోయాయన్నారు.
నా తల్లిని కూడా దూషించారు
‘ప్రేమ పదకోశం(లవ్ డిక్షనరీ)నుంచి సేకరించిన తిట్లతో నిత్యం తనను దూషించే కాంగ్రెస్ పార్టీ నేతలు.. తన తల్లిని కూడా వదల్లేదని ప్రధాని విమర్శించారు. ‘వారి అవినీతిని అడ్డుకుని, దొరతనాన్ని ప్రశ్నించినందుకే ప్రేమ ముసుగు వేసుకుని హిట్లర్, దావూద్ ఇబ్రహీం, ముస్సోలినీ, ఔరంగజేబ్ కంటే క్రూరుడు, పిచ్చికుక్క, కోతి..ఇలా రకరకాల పేర్లతో నన్ను తిడుతున్నారు’ అని పేర్కొన్నారు. ‘ నా తల్లినీ వారు దూషించారు. నా తండ్రి ఎవరని ఆమెను అడిగారు. ఈ నిందలన్నీ నేను ప్రధాని పదవిని చేపట్టాక చేసినవే’ అని మోదీ పేర్కొన్నారు.
ఆప్ ప్రభుత్వం వృథా..
‘ఏ పనీ చేయని సర్కారుకు ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వమే ఉదాహరణ. తమను తాము మార్చుకోలేని వాళ్లు దేశాన్ని మార్చుతామంటూ అధికారంలోకి వచ్చారు. చిల్లర ముఠాలను బలపరుస్తూ దేశానికి శత్రువులను పెంచుతున్నారు’ అన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను ఢిల్లీ ఆస్పత్రుల్లో అమలు చేయనందుకే ఆప్ ప్రభుత్వాన్ని ఉపయోగం లేని(నాకామ్ పంతి) ప్రభుత్వంగా మోదీ అభివర్ణించారు. మావోలు, వేర్పాటు వాదులను సమర్ధించే వారిని మోదీ తరచూ చిల్లర (టుక్డేటుక్డే)గ్యాంగ్‌గా పేర్కొనడం తెల్సిందే.
ఐఎన్‌ఎస్ విరాట్‌ను ట్యాక్సీలా వాడారు!
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ విరాట్’ను వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని మోదీ ఆరోపించారు. ‘రాజీవ్‌గాంధీ, ఆయన బావమరుదుల కుటుంబాలు కలిసి పది రోజుల విహారయాత్రకు బయలుదేరారు. ఆ యాత్రకు దేశ ప్రాదేశిక సముద్ర జలాల్లో గస్తీ కోసం వినియోగించే ఐఎన్‌ఎస్ విరాట్‌ను సొంత ట్యాక్సీ మాదిరిగా వాడుకున్నారు. విరాట్’పై హెలికాప్టర్‌ను సైతం నేవీ సిద్ధంగా ఉంచింది. విరాట్‌తోపాటు వారంతా ఒక దీవిలో పది రోజుల పాటు ఆగారు. విదేశీయులను యుద్ధ నౌకలో తీసుకెళ్లడం ద్వారా దేశ భద్రత విషయంలో రాజీ పడలేదా అనేదే నా ప్రశ్న. ఐఎన్‌ఎస్ విరాట్‌ను 1987లో భారత నేవీలోకి తీసుకోగా 2016లో విధుల నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment