పార్లమెంట్‌లో మోదీని కౌగిలించుకుంటున్న రాహుల్ (ఫైల్)
న్యూఢిల్లీ: భారత దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ అవినీతిపరుడిగా అంతమయ్యారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ‘మోదీజీ.. యుద్ధం ముగిసిపోయింది. కర్మ ఫలితం మీకోసం ఎదురుచూస్తోంది. మీ గురించి మీ మనసులో ఉన్న భావాలను నా తండ్రిపై రుద్దడం ద్వారా మీరు తప్పించుకోలేరు. మీకో పెద్ద కౌగిలింత, ప్రేమతో.. రాహుల్’ అని ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీలో శనివారం ప్రచారంలో పాల్గొన్న మోదీ రాహుల్‌గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీ తండ్రి రాజీవ్‌గాంధీని ఆయన అనుచరులంతా ‘మిస్టర్ క్లీన్‘గా అభివర్ణించేవారు. చివరకు ఆయన నంబర్ 1 అవినీతిపరుడిగా అంతమయ్యారు’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు.
మోదీ వ్యాఖ్యలపై ప్రియాంకా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ‘అమరుల పేర్లు చెప్పి ప్రజలను ఓట్లడిగే మోదీ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ మంచి వ్యక్తిని అవమానించారు. అమేథీ ప్రజల సేవలోనే రాజీవ్ ప్రాణలు అర్పించారు. ఆ ప్రజలే మోదీకి బుద్ధి చెబుతారు. మోదీజీ.. మీలాంటి మోసకారుల్ని దేశం ఎన్నటికీ క్షమించదు’ అని విమర్శించారు. సభ్యత, సంస్కారాల విషయంలో మోదీ అన్ని హద్దులు దాటేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యాఖ్యలపై ఓ గుజరాతీగా సిగ్గుపడుతున్నానని రాజీవ్ స్నేహితుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment