విశాఖలో ముగిసిన ‘విరాట్‌’ పర్వం! | INS Virat retired From Navy Service In October 2016 | Sakshi
Sakshi News home page

విశాఖలో ముగిసిన ‘విరాట్‌’ పర్వం!

Published Sun, Dec 13 2020 3:41 AM | Last Updated on Sun, Dec 13 2020 11:35 AM

INS Virat retired From Navy Service In October 2016 - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమాన వాహక నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ నేవీ సేవల నుంచి 2016 అక్టోబర్‌లో నిష్క్రమించింది. అప్పట్లో దీన్ని మ్యూజియం, స్టార్‌ హోటల్‌గా మార్చాలని భావించారు. కేంద్ర ప్రభుత్వం విరాట్‌ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ఏపీకి అందించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలి మండలం మూలకుద్దులో విరాట్‌ను మ్యూజియం, స్టార్‌ హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు నివేదికను రూపొందించాలని చెన్నైకి చెందిన నాటెక్స్‌ మేరీటైమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు గత టీడీపీ ప్రభుత్వం రూ.1.50 లక్షలు కేటాయించింది. అయితే సుమారు రూ.700 కోట్ల ఈ ప్రాజెక్టు వ్యయ భారాన్ని భరించలేమంటూ టీడీపీ సర్కార్‌ చివరకు చేతులెత్తేసింది. దీంతో మహారాష్ట్ర తెరపైకి వచ్చి మ్యూజియంని తాము ఏర్పాటు చేసుకుంటామంటూ విరాట్‌ని ముంబై నావల్‌ డాక్‌ యార్డుకి తరలించింది. చివరికి ఈ నౌకని గుజరాత్‌కు చెందిన శ్రీరామ్‌ గ్రూప్‌ రూ.38.54 కోట్లకు వేలంలో దక్కించుకుంది.

విరాట్‌ ప్రాజెక్టు వివరాలివీ..
► యుద్ధ నౌకలోని 1,500 గదులను ఫైవ్‌ స్టార్‌ హంగులతో పర్యాటక హోటల్‌గా మార్చాలని నిర్ణయించారు.
► 500 మందికిపైగా కూర్చునేలా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణంతోపాటు మిగిలిన భాగాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
► వీటితోపాటు స్పోర్ట్స్, యాకింగ్, సెయిలింగ్, గ్‌లైడింగ్, క్రూయిజింగ్‌ వంటి సౌకర్యాల్ని కల్పించాలని భావించారు.

ఐఎన్‌ఎస్‌ విరాట్‌ విశేషాలివీ...
► 1959లో బ్రిటిష్‌ నౌకాదళంలో సేవలందించింది.
► 1987లో రూ.604.50 కోట్లకు భారత్‌ కొనుగోలు చేసి ఐఎన్‌ఎస్‌ విరాట్‌గా పేరు మార్చింది.
► ఐఎన్‌ఎస్‌ విరాట్‌ భారత జలాల్లో ప్రవేశించాక 22 మంది కెప్టెన్లు విధులు నిర్వర్తించారు. ఇందులో ఐదుగురు భారత నౌకాదళానికి చీఫ్‌ స్థానాన్ని అధిష్టించారు.
► ప్రపంచంలో సుదీర్ఘ కాలం (2,250 రోజులు (విధుల్లో ఉన్న కాలం)) సేవలందించిన యుద్ధ విమాన వాహక నౌకగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. అందుకే ఈ నౌకని ది గ్రాండ్‌ ఓల్డ్‌ లేడీ అని అంటారు.
► మొత్తం 10,94,215 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ఈ దూరం 27సార్లు భూమిని చుట్టి రావడంతో సమానం.
► యుద్ధ సమయంలో ఒకేసారి 26 యుద్ధ విమానాల్ని తీసుకెళ్లగలిగే సామర్థ్యం సొంతం.
► ఈ నౌక బరువు 28,700 టన్నులు, పొడవు 226.5 మీటర్లు, వెడల్పు 48.78 మీటర్లు.

చివరిసారిగా విశాఖలోనే...
భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన విరాట్‌.. అనేక చారిత్రక విజయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. చివరిసారిగా విశాఖ సముద్ర జలాల్లోనే విహరించింది. 2016 ఫిబ్రవరిలో నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)లో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ తళుక్కున మెరిసింది. ఐఎఫ్‌ఆర్‌ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఆఖరి అవకాశమూ చేజారింది...!!
విరాట్‌ని వేలంలో దక్కించుకున్న శ్రీరామ్‌ గ్రూప్‌.. మ్యూజియంగా మార్చేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. రూ.100 కోట్లకి నౌకని ఇస్తామని, అక్టోబర్‌ 15లోగా ముందుకు రావాలంటూ ప్రకటించింది. దీనికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ జారీ చేస్తే అమ్మేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే.. గడువు ముగిసే నాటికి ఎన్‌వోసీ రాకపోవడంతో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. గుజరాత్‌ మారిటైమ్‌ బోర్డు అనుమతి రాగానే.. త్వరలోనే నౌకను విచ్ఛిన్నం చేసి తుక్కుగా మార్చే ప్రక్రియ మొదలు పెడతామని తెలిపింది. అయితే.. ఇండియా, బ్రిటన్‌ జాతీయ గౌరవంగా భావించాల్సిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డిసెంబర్‌ 4న ది హెర్మస్‌ విరాట్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌.. ప్రధాని మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఇంకా ప్రధాని కార్యాలయ వర్గాలు స్పందించలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement