నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రాందాస్
న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రాందాస్ ఖండించారు. రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన సదరన్ నేవీ కమాండర్‌గా ఉన్నారు. ఐఎన్‌ఎస్ విరాట్‌పై రాజీవ్‌తో కలిసి ఆయన ప్రయాణించారు. మోదీ ఆరోపణలపై రాందాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆ సమయంలో కేవలం ప్రధాని, ఆయన సతీమణి మాత్రమే ఉన్నారు.
విదేశీయులెవరూ మాతో లేరు. అదంతా ప్రొటోకాల్ ప్రకారమే జరిగింది’ అని వివరించారు. ‘రాజీవ్ కుటుంబ పర్యటన కోసం ఏ నౌకనూ ప్రత్యేకంగా కేటాయించలేదు. అత్యవసర వైద్య అవసరాలకు వినియోగించుకునేందుకు లక్షద్వీప్ రాజధాని కవరట్టిలో మాత్రం ఒక హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాం’అని తెలిపారు. ‘కవరట్టిలో జరిగే అధికారిక కార్యక్రమానికి ప్రధాని రాజీవ్, ఆయన భార్య హాజరయ్యారు. రెండు రోజులపాటు ఇక్కడే ఉన్నారు. అనంతరం వారిద్దరూ కుటుంబసభ్యులు, ఇతర అతిథులను కలుసుకునేందుకు సమీపంలోని బంగారం దీవికి వెళ్లారు’ అని నాటి లక్షద్వీప్ పరిపాలనాధికారి హబీబుల్లా తెలిపారు.
ఐఏఎఫ్ విమానాలను ట్యాక్సీల్లా వాడుకుంటుందెరు?
‘ప్రధాని మోదీకి వాస్తవాలతో పనిలేదు. చెప్పుకోవటానికి ఆయనకు ఏమీ లేనందున ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారు’అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. అప్పట్లో ప్రధాని రాజీవ్ అధికారిక పర్యటన కోసమే ఐఎన్‌ఎస్ విరాట్‌పై ప్రయాణించారే తప్ప కాలక్షేపం కోసం కాదంటూ నేవీ మాజీ ఉన్నతాధికారులు సైతం వెల్లడించారని పేర్కొన్నారు. ‘బోఫోర్స్ కుంభకోణంపై బహిరంగ చర్చకు మేం ఎల్లప్పుడూ సిద్ధం...మీరు రఫేల్‌పై చర్చకు సిద్ధమేనా అని ఖేరా సవాల్ విసిరారు.
ఎన్నికల్లో గెలిచేందుకు ఆఖరి ప్రయత్నంగా మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రచారం కోసం వైమానిక దళం(ఐఏఎఫ్) విమానాలను సొంత ట్యాక్సీల మాదిరిగా ప్రధాని మోదీ వాడుకుంటున్నారని, ఇందుకోసం అతి తక్కువగా కేవలం రూ.744 చెల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుదోవ పట్టించడంలో మోదీని మించిన వారు లేరని, బీజేపీని పెద్ద అబద్ధాల పార్టీ(బహుత్ జూట్ పార్టీ)గా కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి అభివర్ణించారు. మోదీ తీరుతో ప్రధాని కార్యాలయం స్థాయిని దిగజార్చారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందుగా గ్రహించి మోదీ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment