rajeevgandhi
-
రాజీవ్‌పై ‘విరాట్ ట్యాక్సీ’ అంతా అబద్ధం
న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రాందాస్ ఖండించారు. రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన సదరన్ నేవీ కమాండర్‌గా ఉన్నారు. ఐఎన్ఎస్ విరాట్‌పై రాజీవ్‌తో కలిసి ఆయన ప్రయాణించారు. మోదీ ఆరోపణలపై రాందాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆ సమయంలో కేవలం ప్రధాని, ఆయన సతీమణి మాత్రమే ఉన్నారు. విదేశీయులెవరూ మాతో లేరు. అదంతా ప్రొటోకాల్ ప్రకారమే జరిగింది’ అని వివరించారు. ‘రాజీవ్ కుటుంబ పర్యటన కోసం ఏ నౌకనూ ప్రత్యేకంగా కేటాయించలేదు. అత్యవసర వైద్య అవసరాలకు వినియోగించుకునేందుకు లక్షద్వీప్ రాజధాని కవరట్టిలో మాత్రం ఒక హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాం’అని తెలిపారు. ‘కవరట్టిలో జరిగే అధికారిక కార్యక్రమానికి ప్రధాని రాజీవ్, ఆయన భార్య హాజరయ్యారు. రెండు రోజులపాటు ఇక్కడే ఉన్నారు. అనంతరం వారిద్దరూ కుటుంబసభ్యులు, ఇతర అతిథులను కలుసుకునేందుకు సమీపంలోని బంగారం దీవికి వెళ్లారు’ అని నాటి లక్షద్వీప్ పరిపాలనాధికారి హబీబుల్లా తెలిపారు. ఐఏఎఫ్ విమానాలను ట్యాక్సీల్లా వాడుకుంటుందెరు? ‘ప్రధాని మోదీకి వాస్తవాలతో పనిలేదు. చెప్పుకోవటానికి ఆయనకు ఏమీ లేనందున ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నారు’అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. అప్పట్లో ప్రధాని రాజీవ్ అధికారిక పర్యటన కోసమే ఐఎన్ఎస్ విరాట్‌పై ప్రయాణించారే తప్ప కాలక్షేపం కోసం కాదంటూ నేవీ మాజీ ఉన్నతాధికారులు సైతం వెల్లడించారని పేర్కొన్నారు. ‘బోఫోర్స్ కుంభకోణంపై బహిరంగ చర్చకు మేం ఎల్లప్పుడూ సిద్ధం...మీరు రఫేల్‌పై చర్చకు సిద్ధమేనా అని ఖేరా సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఆఖరి ప్రయత్నంగా మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రచారం కోసం వైమానిక దళం(ఐఏఎఫ్) విమానాలను సొంత ట్యాక్సీల మాదిరిగా ప్రధాని మోదీ వాడుకుంటున్నారని, ఇందుకోసం అతి తక్కువగా కేవలం రూ.744 చెల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుదోవ పట్టించడంలో మోదీని మించిన వారు లేరని, బీజేపీని పెద్ద అబద్ధాల పార్టీ(బహుత్ జూట్ పార్టీ)గా కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి అభివర్ణించారు. మోదీ తీరుతో ప్రధాని కార్యాలయం స్థాయిని దిగజార్చారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందుగా గ్రహించి మోదీ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
చంపేస్తారని ముందే తెలుసు
సింగపూర్: మాజీ ప్రధాన మంత్రి, తన తండ్రి రాజీవ్ గాంధీని హత్యచేసిన వారిని తన కుటుంబం పూర్తిగా క్షమించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజలను ద్వేషించటం తమకు చాలా కష్టమైన పని అన్నారు. సింగపూర్‌లో ఐఐఎం పూర్వవిద్యార్థులతో సంభాషణలో రాహుల్.. పలు అంశాలపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నందునే ఇందిర, రాజీవ్‌లు హత్యకు గురయ్యారన్నారు. ‘నాన్న, నానమ్మ చనిపోతారని మాకు ముందే తెలుసు. తనను చంపేస్తారని నానమ్మ నాతో చెప్పేది. నాన్నను కూడా చంపేస్తారంది. రాజకీయాల్లో దుష్టశక్తులతో పోరాటంలో.. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు చనిపోవటం ఖాయం. మేం (రాహుల్, ప్రియాంక) చాలారోజుల వరకు హంతకులపై ఆవేదనగా, కోపంగా ఉన్నాం. కానీ ఇప్పుడు వారిని మేం పూర్తిగా క్షమించేశాం’అని రాహుల్ పేర్కొన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీటర్లో పోస్టు చేసింది. ‘చరిత్రలో భిన్న సిద్ధాంతాలు, భిన్న శక్తుల మధ్య పోరాటం జరిగినపుడు ఇలాంటి ఘటనలు సహజమే. మా నానమ్మను చంపిన వారితో నేను బ్యాడ్మింటన్ ఆడేవాణ్ణి. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ హతమైన విషయాన్ని టీవీలో చూస్తున్నపుడు.. ఆయన కుటుంబం, పిల్లలు ఎంత బాధపడి ఉంటారోనని అనిపించింది. ఎందుకంటే తండ్రిపోతే పిల్లలు ఎలా బాధపడతారో నాకు బాగా తెలుసు. వెంటనే ప్రియాంకకు ఫోన్ చేసి అతనే నాన్నను చంపాడని చెప్పా. దీనిపై నేను సంతోషపడాలి కానీ ఎందుకో సంతోషం అనిపించటం లేదన్నా. తను కూడా సంతోషంగా లేనని ప్రియాంక చెప్పింది’ అని రాహుల్ పేర్కొన్నారు. -
ఈపాటికి రాజీవ్ బతికుంటే..
-
ఈపాటికి రాజీవ్ బతికుంటే...
ఈపాటికి రాజీవ్‌గాంధీ బతికుంటే ఆయనతో కలిసి 47వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునేదాన్నని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయనకు, ఆయన భార్య కమలా అద్వానీకి అభినందనలు తెలియజేస్తూ రాసిన లేఖలో ఆమె ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. తన సహజ లక్షణానికి భిన్నంగా సోనియా కాస్తంత ఉద్వేగానికి లోనైనట్లుగా ఈ లేఖలో అనిపించారు. తమ వివాహం ఫిబ్రవరి 25న జరిగిందని, రాజీవ్ బతికుంటే ఇప్పటికి 47వ వివాహ వార్షికోత్సవం జరుపుకునేవాళ్లమని పేర్కొన్నారు. ఈ లేఖ అందిన వెంటనే చలించిన అద్వానీ స్వయంగా సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేశారని అద్వానీ సహాయకుడు దీపక్ చోప్రా మీడియాకు చెప్పారు.