ఈపాటికి రాజీవ్ బతికుంటే...
ఈపాటికి రాజీవ్గాంధీ బతికుంటే ఆయనతో కలిసి 47వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునేదాన్నని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయనకు, ఆయన భార్య కమలా అద్వానీకి అభినందనలు తెలియజేస్తూ రాసిన లేఖలో ఆమె ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తన సహజ లక్షణానికి భిన్నంగా సోనియా కాస్తంత ఉద్వేగానికి లోనైనట్లుగా ఈ లేఖలో అనిపించారు. తమ వివాహం ఫిబ్రవరి 25న జరిగిందని, రాజీవ్ బతికుంటే ఇప్పటికి 47వ వివాహ వార్షికోత్సవం జరుపుకునేవాళ్లమని పేర్కొన్నారు. ఈ లేఖ అందిన వెంటనే చలించిన అద్వానీ స్వయంగా సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేశారని అద్వానీ సహాయకుడు దీపక్ చోప్రా మీడియాకు చెప్పారు.