ప్రమాదంలో పునాదులు
వేల సంవత్సరాల సుదీర్ఘమైన మార్పుల క్రమంలో ఏర్పడిన విశిష్ట సంస్కృతికి భారత్ నిలయం. ఇలాంటి దేశంలో ఒకే మతం, ఏక సంస్కృతి ఉండాలనుకోవడం మన పురాతన నాగరికతకు, సాంస్కృతిక వారసత్వానికి అవమానకరమైనట్టిది.
స్వాతంత్య్రానంతర భార తీయ సైన్యంలో అతి కింది స్థాయి నుంచి ఇండియన్ నేవీ చీఫ్ వరకు వివిధ బాధ్యతలు నిర్వర్తించి దాదాపు 45 ఏళ్ల పాటు దేశానికి సేవలందిం చిన వ్యక్తి అడ్మిరల్ రామ దాస్. ప్రస్తుతం దేశంలో మతం పేరుతో నెలకొంటున్న విద్వేష వాతావరణం చూసి ఆవేదనతో ఇటీవలే భారత రాష్ట్రపతికి, ప్రధాని నరేంద్రమోదీకి ఆయన రాసిన లేఖ సారాంశాన్ని సాక్షి పాఠకులకు అందిస్తున్నాం.
మన ప్రియతమ దేశం, ప్రజలు పెను సవాళ్లను ఎదుర్కొంటూ, మన ఉమ్మడి వారసత్వం ప్రమాదంలో పడుతున్న సంక్షుభిత సమయంలో భారమైన హృద యంతో మీకు బహిరంగ లేఖ రాస్తున్నాను.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే, 15 ఏళ్ల వయ సులో భారత సాయుధ బలగాల్లో చేరాను. 1990-93 కాలంలో భారత నావికా దళాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించి నా సైనిక జీవితానికి వీడ్కోలు పలికాను. 1947లో దేశ విభజన నేపథ్యంలో జరిగిన భయానక ఘటనల నుంచి, ప్రపంచాన్ని కుగ్రామంగా మారుస్తున్న నేటి డిజిటల్ కనెక్టివిటీ వరకు భారత్ సాగించిన అనేక పరివర్తనలకు నేను సాక్షీభూతంగా నిలిచాను.
తొలి నుంచి హిందూ మత విశ్వాసాల్లోనే పుట్టి పెరి గిన వ్యక్తిగా నేను మీకీ లేఖ రాస్తున్నాను. కానీ నాకు తెలి సిన, నేను ఆస్వాదించిన హిందూయిజం గౌరవప్రదమై నదిగా, అందరినీ చేరదీసేదిగా అసాధారణమైన వైవి ధ్యంతో కూడి ఉండేది. మానవులందరినీ ప్రేమించాలి, గౌరవించాలి అనే విలువలను నా మతం నాకు నేర్పిం చింది. నేను నమ్మిన, ఆచరించిన హిందూయిజం.. హింస, కరుడుగట్టిన అసహనం, విభజన జ్వాలలతో దేశవ్యాప్తంగా భయాందోళనలను కలిగిస్తూ ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న హిందూత్వ బ్రాండ్‌కు పూర్తి భిన్నంగా ఉండేది.
ఈరోజు 80లలో పడిన వయోవృద్ధుడిగా మన తోటి పౌరులు, ప్రత్యేకించి మైనారిటీలు, దళితులపై జరుగుతున్న దాడులను మౌనంగా పరికిస్తూ సిగ్గుతో తలవంచుకుంటున్నాను. దాదాపు 45 ఏళ్లపాటు నేను సేవలందించిన మన సాయుధ బలగాలు భారతీయ లౌకిక సాంప్రదాయానికి తిరుగులేని ఉదాహరణగా నిలుస్తూ వచ్చాయి. యుద్ధ నౌకల్లో, జలాంతర్గాముల్లో, యుద్ధ విమానాల్లో, సైనిక నిర్మాణాల్లో కులం, మతం ప్రాతిపదికన ఎవరిపట్లా మేం వివక్ష చూపలేదు. కలిసే శిక్షణ పొందాం. కలిసే పోరాడాం. కలసి భుజించాం, పోరాటంలో కలిసే అసువులు బాశాం.
కానీ, 2014 మేలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మైనారిటీలపై పెరుగుతున్న దాడులను మనం ఎందుకు చూస్తూ భరిస్తూ ఉన్నాం? ఈరోజు ఒక ముస్లిం మన దేశంపట్ల విశ్వాసాన్ని తనకుతానుగా నిరూపించుకోవలసిన పరి స్థితి ఏర్పడింది. వారి ఆరాధనా స్థలాలు, వారి ఆహార అలవాట్లు, ఇతర ప్రాధమిక స్వేచ్ఛలపై కూడా దాడులు జరుగుతున్నాయి. సీనియర్ నేతలు బహిరంగంగా రెచ్చ గొడుతున్న ఫలితంగా విచక్షణ కోల్పోయిన మూక మన స్తత్వం అనేకమంది మరణాలకు దారి తీస్తోంది.
ఈ విపరిణామాలను చూస్తుంటే, ఆర్ఎస్ఎస్, దాని అనుసంధాన బృందాల నేతృత్వంలో ఇండియాను హిందూ దేశంగా సృష్టించాలనే మెజారిటీవాదపు ఏకైక అంశంతో కూడిన ఎజెండాను దేశంపై రుద్దడానికి అత్యంత వ్యవస్థీకృతంగా, పకడ్బందీగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీని ఫలితంగానే మూక మనస్తత్వం ప్రమాదకరంగా మారటమే కాదు.. పుకార్లను నిజాలుగా భావించి మైనారిటీలను చావబాద డం, బెదిరించడం జరుగుతోంది. చ ట్టపరమైన పాలనకు ఇది విఘాతం. పైగా అనేక సందర్భాల్లో చట్టాన్ని అమ లు చేయవలసిన వారు అత్యంత వేర్పాటు వాద ధోరణు లను, నడవడికను ప్రదర్శిస్తుండటం కలవరపెడుతోంది.
పైగా, అలాంటి అభ్యంతరకరమైన ఘటనలు చోటు చేసుకున్నప్పుడు దేశాన్ని పాలిస్తున్న వారి నుంచి రావలసిన ఖండనలు కానీ, వాటికి వ్యతిరేక చర్యలు కాని ఏమాత్రం కనిపించకపోవడం మాలాంటివారికి దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇలాంటి హింసాత్మక ధోరణు లను సహించేది లేదంటూ ఆగ్రహం ప్రదర్శించాల్సిన క్షణాల్లో ప్రభుత్వ వ్యవస్థల మౌనంతో మతోన్మాద మూకలు మరింత రెచ్చిపోతున్నాయి. ఎంపీలు, మం త్రులు, చివరకు ముఖ్యమంత్రులు కూడా విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం చూస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సమస్త చట్టపరిపాలనలను తుం గలోతొక్కి, తమాషా చూడడానికే కంకణం కట్టుకుం టున్నట్లు నమ్మాల్సి వస్తోంది.
ఇలాంటి వాతావరణాన్ని పెంచి పోషిస్తే దేశం అగ్ని జ్వాలల్లో రగుల్కోవడం ఖాయం. ఇప్పటికే ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు తమ పట్ల వివక్ష చూపుతున్నారని, పక్కన పెడుతున్నారని భావిస్తు న్నారు. సకల ప్రజారాసులతో కూడిన దేశ అపార వైవి ధ్యాన్ని కొనసాగించడానికి బదులుగా అంతర్జాతీయ సమాజం ముందు మనం తీవ్ర అసహనపరులుగా, జాతి వివక్షాపరులుగా, ఫాసిస్టులుగా కూడా నిలబడు తున్నాం. బలహీన వర్గాలపై హింస కొనసాగింపు వల్ల మనది పరిణిత ప్రజాస్వామ్యం కాదనే అపప్రధ ప్రపం చం దృష్టికి వెళుతోంది.
గౌరవనీయ రాష్ట్రపతి, ప్రధాని ఇరువురూ దేశం లోని ప్రతి పౌరుడికీ, పౌరురాలికి రాజ్యాంగం కల్పించిన వాక్ స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛ, సహజీవనం వంటి హక్కులకు హామీ ఏర్పడేలా తమ రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాలని అభ్యర్థిస్తున్నాను. మన సమాజంలో పెరుగుతున్న విద్వేషాన్ని ఇకనైనా తొలగించే ప్రయ త్నాలు చేయకపోతే దేశ పునాదులే ప్రమాదంలో పడతా యని, అలాంటి పరిస్థితులను మీరు ఏ పరిస్థితుల్లోనూ అనుమతించబోరని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
(వ్యాసకర్త: రామ్ దాస్, రిటైర్డ్ అడ్మిరల్, భారత నావికాదళం)