విరాట్‌పై చిగురించిన ఆశలు | Aircraft carrier INS Virat Project | Sakshi
Sakshi News home page

విరాట్‌పై చిగురించిన ఆశలు

Published Thu, Jul 13 2017 2:13 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

Aircraft carrier INS Virat Project

► ప్రాథమిక అంచనాకు నిధులు
► రూ.1.50 లక్షలు చెన్నై సంస్థకు కేటాయింపు


విశాఖసిటీ : విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ ప్రాజెక్టుపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. విశాఖలో ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ.. ప్రభుత్వం ప్రాథమిక పరిశీలన నివేదికకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో మ్యూజియంతో పాటు స్టార్‌ హోటల్‌గా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద విమాన యుద్ధ నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ నేవీ సేవల నుంచి గతేడాది నిష్క్రమించింది. అప్పటి నుంచి దీన్ని మ్యూజియం, స్టార్‌ హోటల్‌గా తీర్చిదిద్దాలని భావించారు. ప్రాజెక్టు వ్యయం వెయ్యి కోట్ల రూపాయలు అనుకున్నప్పటికీ అంత వ్యయాన్ని భరించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో దాన్ని రూ. 300 కోట్లకు కుదించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

అయితే అప్పటి నుంచి దీనిపై ఎలాంటి చర్చలూ.. కేంద్ర ప్రభుత్వం, నేవీ అధికారుల నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ప్రాజెక్టు వెనక్కు మళ్లిందని అనుకున్నారు. ఈ నేపథ్యంలో విరాట్‌ నౌకను మ్యూజియం, స్టార్‌ హోటల్‌గా మార్చేందుకు అవసరమైన నివేదికను తయారు చేయాలంటూ చెన్నైకి చెందిన నాటెక్స్‌ మ్యారీటైమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.1.50 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. ఈ ప్రాథమిక నివేదిక తయారు చేసేందుకు రూ.1.75 లక్షల వ్యయం అవుతుందని సంస్థ ప్రభుత్వానికి పంపించగా.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి.. దీనికి లక్షన్నర రూపాయలు సరిపోతాయని సంస్థకు తేల్చిచెప్పింది. వీలైనంత త్వరలో ప్రాథమిక నివేదికను అందివ్వాలని చెన్నై సంస్థను కోరింది.

భీమిలిలో ఏర్పాటుకుసన్నాహాలు
విరాట్‌ మ్యూజియం, స్టార్‌ హోటల్‌ ఏర్పాటు కోసం పర్యాటక శాఖ మూడు స్థలాల్ని ఎంపిక చేసింది. చివరికి భీమిలి మండలం మూలకుద్దులో ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద దేశంలో తొలి సబ్‌మెరైన్‌ మ్యూజియం, ఆసియాలోనే తొలి యుద్ధ విమాన మ్యూజియం ప్రాజెక్టులతో పర్యాటక రంగంలో వన్నెలద్దుకున్న విశాఖ తాజా గా.. విరాట్‌తో ప్రపంచస్థాయి మ్యూజియంగా ఖ్యాతి గడించనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement