న్యూఢిల్లీ: భారత నావికా దళం కొత్త శక్తిని సముపార్జించుకుంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గురువారం నేవీకి అందజేసింది. షెడ్యూల్ ప్రకారం విక్రాంత్‌ను ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేవీ విధుల్లోకి చేర్చుకుంటారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ విక్రాంత్ చేరికను కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.
రూ.20 వేల కోట్లతో నిర్మించిన విక్రాంత్ నాలుగో, తుది దశ సీ ట్రయల్స్‌ను మూడు వారాల క్రితం విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో, యుద్ధ విమాన వాహక నౌకలను దేశీయంగా డిజైన్ చేసి, నిర్మించుకునే సామర్థ్యం సొంతం చేసుకున్న అరుదైన ఘనతను దేశం సొంతం చేసుకుంది. దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సమయాన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహకనౌక(ఐఏసీ) అందడం చారిత్రక సందర్భమని నేవీ పేర్కొంది.
‘త్వరలో నావికాదళంలోకి ప్రవేశించే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో భారతదేశం స్థానం మరింత సుస్థిరం అవుతుంది’అని నేవీ పేర్కొంది. ఐఏసీలో 76% దేశీయంగా తయారు చేసిన సామగ్రినే వినియోగించారు. విక్రాంత్‌లో మెషినరీ ఆపరేషన్, నేవిగేషన్, సర్వైవబిలిటీ గరిష్ట స్థాయి ఆటోమేషన్‌తో రూపొందాయి. ఫిక్స్‌డ్ వింగ్, రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనుగుణంగా దీని డిజైన్ ఉందని నేవీ వివరించింది.
ఐఏసీ నుంచి మిగ్–29కే యుద్ధ విమానాలతోపాటు కమోవ్–31 హెలికాప్టర్లు, ఎంఐఐ–60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను కలిపి మొత్తం 30 వరకు నిర్వహించవచ్చు. ఐఏసీలో 2,300 కంపార్టుమెంట్లుండగా 1,700 మంది సిబ్బంది పనిచేసేందుకు, ముఖ్యంగా మహిళా అధికారులకు ప్రత్యేక సౌకర్యాలతో డిజైన్ చేశారు. దీని సాధారణ వేగం 18 నాట్స్ కాగా, గరిష్ట వేగం 28 నాట్స్. ఇది 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు.
Comments
Please login to add a commentAdd a comment