ఐఎన్ఎస్ విక్రాంత్ జాతికి అంకితం
తొలిసారి పూర్తి దేశీయంగా రూపొందిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ను సోమవారం జాతికి అంకితం చేశారు. కేరళలోని కొచ్చి నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నౌకాయాన మంత్రి జీకే వాసన్, నేవల్ చీఫ్ డీకే జోషీల సమక్షంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ ప్రారంభించారు. తొలిదశ నిర్మాణం మాత్రమే ఇప్పటికి పూర్తయిందని, మిగతా దశల్లో మొత్తం నిర్మాణం పూర్తిచేయనున్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.
ఐఎన్‌ఎస్ విక్రాంత్ నిర్మాణం 2016 నాటికి పూర్తయి పరీక్షలకు సిద్ధం కానుందని, 2018 నాటికి నావికాదళంలోకి చేరనుందని చెప్పారు. ప్రస్తుతం ఇలాంటి భారీ యుద్ధనౌకలను నిర్మించే సామర్థ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలకు మాత్రమే ఉండగా.. ఐఎన్‌ఎస్ విక్రాంత్ నిర్మాణంతో భారత్ కూడా సత్తా చాటినట్లవుతుందని నౌకా దళ ఉప ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఆర్‌కే ధావన్ అన్నారు. ఈ నౌక నిర్మాణానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తయారుచేసిన హైగ్రేడ్ స్టీలును, స్వదేశీయ పరికరాలను ఉపయోగించినట్లు తెలిపారు.
ఇవీ ప్రత్యేకతలు..
ఐఎన్‌ఎస్ విక్రాంత్ 260 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇప్పటిదాకా భారత్ 6-7వేల టన్నుల బరువును మోయగల నౌకలను మాత్రమే నిర్మించగా.. ఈ నౌక ఏకంగా 37,500 టన్నుల బరువును మోయగలగడం విశేషం. దీనిపై రెండు టేకాఫ్ పాయింట్లు, ఒక రన్‌వే, ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి. మిగ్-29కే, కమోవ్ 31, తేలికపాటి యుద్ధవిమానాలు ఈ నౌకపై మోహరించనున్నాయి. నౌకపై 24 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 8 డీజిల్ జనరేటర్లు, 4 గ్యాస్ టర్బైన్లు అమర్చారు. దీని డిజైన్‌ను ‘డెరైక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్’ రూపొందించగా, కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ 2006 నుంచి నిర్మిస్తోంది.