INS Vikrant
-
నేడు మిలాన్‌లో మెరుపులు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా గురువారం సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. ఆర్కే బీచ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళం తయారు చేసిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తొలిసారిగా విశాఖ చేరుకుంది. ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచి్చన తర్వాత తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్ విధులు నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత వివిధ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న విక్రాంత్ ప్రస్తుతం తొలిసారిగా విశాఖకు చేరుకుంది. వాస్తవానికి విక్రాంత్‌ని బెర్తింగ్ చేసేందుకు అవసరమైన బెర్త్ ఇక్కడ లేదు. విక్రాంత్‌కు అనుగుణమైన భారీ బెర్త్ నిర్మించేందుకు విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)తో నౌకాదళం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాఖ వేదికగా మిలాన్–2024 విన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖకు వచ్చిన విక్రాంత్‌ను విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో బెర్తింగ్ చేశారు. మరోవైపు.. పశ్చిమ నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న మరో విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య రెండు రోజుల క్రితం విశాఖ చేరుకుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ని గంగవరం అదానీ పోర్టులో లంగరు వేశారు. 22న జరిగే సిటీ పరేడ్, 23 నుంచి 27వ తేదీ వరకూ జరిగే మిలాన్ సీ ఫేజ్ విన్యాసాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మిలాన్‌లో పాల్గొన్న దేశాల జాతీయ జెండాలతో ఆ దేశ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పరేడ్ సాగనుంది. యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాసాలతో ఆర్కే బీచ్‌లో యుద్ధ వాతావరణాన్ని నౌకాదళ సిబ్బంది ప్రజలకు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించనున్నారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నౌకాదళ అధికారులు పాల్గొననున్నారు. -
‘విక్రాంత్’కు బెర్త్ ఎక్కడ?
రక్షణ రంగంలో మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటేలా భారత్ నిర్మించిన అత్యాధునిక విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను కొద్ది నెలల కిందట ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో ఇది చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఔటర్ హార్బర్లో భారీ బెర్త్‌ను ఏర్పాటు చేసేందుకు నేవీ, పోర్టు సిద్ధమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం : ఐఎన్ఎస్ విక్రాంత్.. విజయానికి, శౌర్యానికి గుర్తు. మన దేశ గౌరవానికి ప్రతీక. మన తొలి విమాన వాహక యుద్ధ నౌక. అప్పట్లో ఉన్న విక్రాంత్ కంటే మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ఈ బాహుబలి యుద్ధ నౌక భారత్ చేతిలో బ్రహ్మాస్త్రంగా చెప్పుకోవచ్చు. విక్రాంత్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్ మెషినరీ ఆపరేషన్లు, షిప్ నేవిగేషన్, ఆటోమేటిక్ సర్వైబిలిటీ సిస్టం ఏర్పాటు చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌కు అదనపు లిఫ్ట్ ఇచ్చే ఫ్లైట్ డెక్ స్కీ జంప్‌తో స్టోబార్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేయడం వల్ల అతి తక్కువ సమయంలో టేకాఫ్‌కు వీలవుతుంది. ఏ భాగం మొరాయించినా ఆ ప్రభావం మిగతా భాగాలపై పడదు. దీంతో ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో రెండు వేల మంది షిప్‌యార్డ్ అధికారులు, సిబ్బంది, 13 వేల మంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 42,800 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. విక్రాంత్ నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చయింది. త్వరలోనే తూర్పు నౌకాదళంలోకి.. రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ కీలకంగా మారనుంది. విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్ర జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ దీని సొంతం. అందుకే విక్రాంత్‌ను కీలకమైన తూర్పు నౌకాదళానికి కేటాయించాలని రక్షణ మంత్రిత్వ శాఖ ముందుగానే నిర్ణయించింది. రాత్రి సమయంలోనూ మిగ్ విమానాలు, ఇతర ఎయిర్‌క్రాఫ్ట్‌లు విక్రాంత్‌పై ల్యాండింగ్, టేకాఫ్‌లను ఇటీవలే విజయవంతంగా నిర్వహించాయి. మరోసారి కొచ్చి షిప్‌యార్డులో తుది ట్రయల్స్ నిర్వహించిన తర్వాత.. విశాఖకు విక్రాంత్ రానుంది. ఈ ఏడాది చివరిలోనైనా లేదా 2024 తొలి నాళ్లలోనైనా.. తూర్పు నౌకాదళం నుంచి రక్షణ బాధ్యతలు చేపట్టనుందని ఇటీవలే భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ స్పష్టం చేశారు. బెర్త్ మ్యాపింగ్‌లో బిజీబిజీ సాధారణ యుద్ధ విమానాల కంటే.. భారీగా ఉండే విక్రాంత్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ప్రత్యేక బెర్త్ అవసరమవుతుంది. ఇప్పటివరకు తూర్పు నౌకాదళంలో 105 మీటర్ల పొడవు ఉన్న యుద్ధ నౌకలే అతి పెద్దవిగా ఉన్నాయి. వీటికి రెట్టింపు పొడవుతో విక్రాంత్ తయారైంది. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తుతో విక్రాంత్ నిర్మించారు. 14 అంతస్తులున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో మొత్తం 2,300 కంపార్ట్మెంట్లున్నాయి. గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోయే విక్రాంత్‌ను విశాఖలో ఎక్కడ బెర్తింగ్ చేయాలన్న దానిపై తూర్పు నౌకాదళాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. భారీ బెర్త్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ, తూర్పు నౌకాదళం పక్కపక్కనే ఉండటంతో ఎలాంటి భద్రతా లోపం లేకుండా.. విక్రాంత్ కోసం ప్రత్యేక బెర్త్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పోర్టు చైర్మన్ డా.అంగముత్తుతో ఇటీవలే తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమావేశమై చర్చించారు. ఔటర్ హార్బర్లోని ఓ బెర్త్‌ను విస్తరించి.. ప్రత్యేకంగా విక్రాంత్‌కు కేటాయించాలని భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు, మ్యాపింగ్ సిద్ధం చేసే పనిలో నౌకాదళాధికారులు తలమునకలయ్యారు. మరో రెండు నెలల్లో దీనికి సంబంఽధించిన రూట్ మ్యాప్ సిద్ధమయ్యాక.. రక్షణ మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అనుమతులు మంజూరైన వెంటనే.. పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. -
India-Australia: రక్షణ బంధం బలోపేతం
ముంబై/న్యూఢిల్లీ: భారత్‌తో సంయుక్త నావికా విన్యాసాలకు ఆస్ట్రేలియా త్వరలో ఆతిథ్యమివ్వనుందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. ‘ఎక్సర్సైజ్ మలబార్’ పేరిట జరిపే ఈ విన్యాసాల్లో వీటిలో అమెరికా, జపాన్ కూడా పాల్గొంటాయన్నారు. ఆయన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను గురువారం ముంబైలో సందర్శించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ ఆయనకు స్వాగతం పలికారు. నౌకలో కలియదిరిగి విశేషాలు తిలకించిన అనంతరం ఆల్బనీస్ పలు అంశాలపై మాట్లాడారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ రంగంలో సాన్నిహిత్యం నానాటికీ పెరుగుతోందని, బంధం మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు. ‘గతేడాది రికార్డు స్థాయిలో సంయుక్త విన్యాసాలు, చర్చలు జరిగాయి. త్వరలో ఆస్ట్రేలియాలో ఎక్సర్సైజ్ మలబార్ నిర్వహించనున్నాం. వాటిలో భారత్ తొలిసారిగా పాల్గొంటోంది’ అని అన్నారు. మోదీపై ప్రశంసల జల్లు ఏ అంశాన్నైనా భవిష్యత్తును అంచనా వేసి మరీ ఆలోచించడం ప్రధాని నరేంద్ర మోదీలో ఉన్న గొప్పదనమని ఆల్బనీస్ ప్రశంసించారు. ‘‘రక్షణ సంబంధాలను సుదృఢం చేసేది ఇలాంటి దూరదృష్టే. బంధాలను ఇప్పుడెలా ఉన్నాయని కాకుండా మున్ముందు ఎదుగుదలకు ఉన్న అవకాశాల పరంగా మదింపు వేయగలగాలి. ఆ సామర్థ్యమున్న నేత మోదీ’’ అని అభిప్రాయపడ్డారు. వర్తక, ఆర్థిక కార్యకలాపాల కోసం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు ఇరు దేశాలకూ ఆవశ్యకమేనన్నారు. మోదీ ప్రతిపాదించిన జనరల్ రావత్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఇరు దేశాల సైనిక సిబ్బంది మధ్య అవగాహన, సాన్నిహిత్యం పెంపొందేందుకు దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. రక్షణ మంత్రుల చర్చలు రక్షణ రంగంలో ఆస్ట్రేలియాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్‌తో గురువారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంలో ఇరు దేశాలకు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా తమ సంభాషణ సాగిందన్నారు.వర్తకం, రక్షణ, కీలక ఖనిజాలు మోదీతో చర్చల్లో ఇవే ప్రధానం ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపే తం చేసుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో మోదీ శుక్రవారం విస్తృతంగా చర్చలు జరపనున్నారు. కీలక ఖనిజాలు, ద్వైపాక్షిక వర్తకం, రక్షణ ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడు, అందుకు అడ్డుకట్ట వేసే మార్గాలు తదితరాలపైనా నేతలు చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య 2021లో 27.5 బిలియన్ డాలర్ల విలువైన వర్తకం జరిగింది. 2022లో అమల్లోకి వచ్చిన ఆర్థిక సహకార వర్తక ఒప్పందం (ఈసీటీఏ)తో వచ్చే ఐదేళ్లలో ఇది 50 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ చూశారు గురువారం ఉదయం మోదీ, ఆ ల్బనీస్ కలిసి అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ప్రారంభ కార్యక్రమంలో పాల్గొ న్నారు. టాస్ అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు మ్యాచ్‌ను ఆస్వాదించారు. అనంతరం ముంబైలో ఇండియా–ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలో ఆల్బనీస్ పాల్గొన్నారు. -
INS Vikrant : తూర్పు నౌకా దళం చారిత్రాత్మక ముందడుగు
ఆత్మ నిర్భర భారత్ దిశ గా భారత్ సొంతంగా రూపొందించిన యుద్ద నౌక విక్రాంత్. ఐఎన్ ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకా పై తొలి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను దింపింది నేవీ సిబ్బంది. తద్వారా భారత రక్షణ రంగంలో నవశకానికి నాంది పలికింది. సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: రక్షణ రంగంలో పాటవ ప్రదర్శనలో భారత నౌకాదళం మరో కీలక అడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ప్రదర్శనకు వేదికగా మారింది. భారత సముద్రజలాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా లైట్ కాంబోట్ ఎయిర్‌క్రాఫ్ట్స్(ఎల్సీఏ)ని నేవీ పైలట్లు సోమవారం వేర్వేరు ట్రయల్స్‌లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌పై స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడం శుభపరిణామమని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు అభినందనలు తెలిపాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది అతివేగంగా శత్రు లక్ష్యాలపై దాడి చేసే ఈ ఐ ఎన్ ఎస్ విక్రాంత్ యుద్ధనౌక పై అతి వేగంగా ప్రయాణించే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సదుపాయం ఉంది. ఈ ప్రక్రియ సోమవారం విజయవంతంగా ముగిసింది. ఇప్పటివరకు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధనౌకలపై విమానాలు దిగే సాంకేతిక పరిజ్ఞానం భారత్ వినియోగిస్తుంది. ఇప్పుడు భారతదేశ తొలిసారిగా విమాన వాహక యుద్ధనౌకను సిద్ధం చేసుకోవడంపై భారతీయులు గర్వపడుతున్నారు. విక్రాంత్‌పై మిగ్–29కే రయ్..రయ్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా మిగ్–29కే యుద్ధ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దీనికి సంబంధించిన పరీక్షల్ని సముద్ర జలాల్లో సోమవారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. 2.5 సెకన్లలో 240 నుండి 0 కి.మీ సముద్ర ట్రయల్స్‌లో భాగంగా స్వదేశీ యుద్ధ విమానం తేజస్.. విజయవంతంగా బయలుదేరి విమాన వాహక నౌక ఫ్లైట్ డెక్‌పై ల్యాండ్ అయింది. ఈ నేవల్ వేరియెంట్ జెట్ మిషన్కి నేతృత్వం వహించారు కామ్రేడ్ జైదీప్ మావోలంకర్(రిటైర్డ్). చిన్న నౌక మీద ల్యాండ్ కావడం అంటే చాలా కష్టతరమైన వ్యవహారం. కేవలం 2.5 సెకండ్లలోనే గంటకు 240 కిలోమీటర్ల నుంచి సున్నాకు జెట్‌ను అదుపు చేయడం పైలట్లకు ఛాలెంజ్‌తో కూడిన వ్యవహారం. ఆ టైంలో ల్యాండింగ్‌పై నియంత్రణ కూడా కష్టమేనని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్.. భారత నౌకాదళం కోసం కేరళలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) నిర్మించిన విమాన వాహక నౌక. 45,000 టన్నుల బరువున్న ఈ నౌకను.. ₹ 20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇది రంగ ప్రవేశం చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌తో యుద్ధ విమానాల అనుసంధానం 2023 మే లేదంటే జూన్ నాటికి పూర్తవుతుందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ గతంలో వెల్లడించారు. మరో విశేషం ఏంటంటే.. ఐఎన్ఎస్ విక్రమాదిత్యా డెక్ మీద తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ప్రొటోటైప్‌ను కామ్రేడ్ మావోలంకర్ స్వయంగా ల్యాండ్ చేయడం గమనార్హం. తద్వారా అలాంటి ఘనత సాధించిన కొద్ది దేశాల సరసన భారత్ నిలిచినట్లయ్యింది. -
INS విక్రాంత్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జాతికి అంకితం చేసిన మోదీ
తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేరళ తీరంలో ఈ రోజు నవశకం ప్రారంభమైందని తెలిపారు. అమృతోత్సవ వేళ ఐఎన్ఎస్ నౌక ప్రవేశం శుభపరిణామమన్నారు. భారత్‌కు సాధ్యం కానిది ఏదీ ఉండదని, ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు. కాగా విక్రాంత్ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా.. రూ.20 వేల కోట్లు ఖర్చయ్యింది. 262 మీటర్ల పొడవు.. 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు. ఇప్పటిదాకా భారత్ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించనున్నారు. చదవండి:కేసీఆర్‌కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ నౌక మోసుకుపోగలిగే ఆయుధ సంపత్తి ► 34 యుద్ధ విమానాలు (మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు) ► దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీని కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి. -
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్.. ఏకంగా 14 అంతస్తులు, 2,300 కంపార్ట్మెంట్లు
రక్షణ రంగంలో మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి ఘనంగా చాటే రోజు రానే వచ్చింది. ఇప్పటిదాకా మన దగ్గరున్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించారు. ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్ఎస్ విక్రాంత్. విజయానికి, శౌర్యానికి గుర్తు. మన దేశ గౌరవానికి ప్రతీక. మన తొలి విమాన వాహక నౌక. బ్రిటన్ నుంచి 1961లో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలకపాత్ర పోషించింది. మరపురాని విజయాలు అందించింది. 1997లో రిటైరైంది. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ఐఏసీ–1కు కూడా అదే పేరు పెట్టారు. నాటి విక్రాంత్ కంటే మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ఈ బాహుబలి యుద్ధ నౌక భారత్ చేతిలో బ్రహ్మాస్త్రమే కానుంది. అత్యాధునిక సాంకేతికత విక్రాంత్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్ మెషినరీ ఆపరేషన్లు, షిప్ నేవిగేషన్, ఆటోమేటిక్ సర్వైబిలిటీ సిస్టం ఏర్పాటు చేశారు. మేజర్ మాడ్యులర్ ఓటీ, ఎమర్జెన్సీ మాడ్యులర్ ఓటీ, ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్‌బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, స్టీరింగ్ గేర్, ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థ తదితరాలున్నాయి. టేకాఫ్ సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు అదనపు లిఫ్ట్ ఇచ్చే ఫ్లైట్ డెక్ స్కీ జంప్‌తో స్టోబార్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేశారు. దాంతో అతి తక్కువ సమయంలో టేకాఫ్ వీలవుతుంది. ఏ భాగమైనా మొరాయించినా ఆ ప్రభావం మిగతా భాగాలపై పడదు. దాంతో ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. 550 సంస్థలు, 100 ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో 2005లో విక్రాంత్ నిర్మాణాన్ని ప్రారంభించారు. నేవీ అంతర్గతసంస్థ అయిన వార్ షిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యూడీబీ) దీన్ని రూపొందించింది. 2009 నుంచి మొదలైన పూర్తిస్థాయి నిర్మాణం 13 ఏళ్లలో పూర్తయింది. బీఈఎల్, భెల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్, ఎస్ఆర్ గ్రూప్, మిథానీ, జీఆర్ఎస్ఈ, కెల్ట్రాన్, కిర్లోస్కర్, ఎల్ అండ్ టీ మొదలైన 550 దిగ్గజ పరిశ్రమలతో పాటు 100కు పైగా ఎంఎస్ఎంఈలు నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. పరికరాలు, యంత్రాలన్నీ దాదాపుగా స్వదేశీ తయారీవే. 23 వేల టన్నుల ఉక్కు, 2,500 కి.మీ. ఎలక్ట్రిక్ కేబుల్స్, 150 కి.మీ. పైపులు, 2 వేల వాల్వులు, గ్యాలీ పరికరాలు, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ ప్లాంట్లు, స్టీరింగ్ గేర్స్ వంటివన్నీ స్వదేశీయంగా తయారు చేసినవే. కొన్ని భాగాలను మాత్రం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండువేల మంది షిప్‌యార్డు అధికారులు, సిబ్బంది, 13 వేలమంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్ నిర్మాణంలో భాగస్వాములు. నౌక నిర్మాణం జరిగిన 13 ఏళ్ల పాటు రోజూ 2 వేల మందికి ఉపాధి దొరికింది. పరోక్షంగా పలు తయారీ సంస్థల్లో 40 వేల మందికి ఉపాధి లభించింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఖర్చయియింది. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. గంటలో వెయ్యిమందికి చపాతీ, ఇడ్లీ రెడీ ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీని కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి. ఎందుకంత కీలకం? రక్షణపరంగా, రవాణాపరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ మనకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడనుంది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగిన నౌకలు ఉంటే నావికాశక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాల్లోనూ, గగన తలంపై కూడా పట్టు సాధించగలం. చైనా దగ్గర రెండు విమాన వాహక నౌకలు, 355 యుద్ధ నౌకలు, 48 విధ్వంసక నౌకలు, 43 ఫ్రిజెట్లు, 61 కార్వెట్లున్నాయి. మూడో విమాన వాహక నౌక తయారీ కూడా మొదలైంది. మనకు మాత్రం ఇప్పటిదాకా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే ఉంది. 10 విధ్వంసక నౌకలు, 12 ఫ్రిగేట్లు, 20 కార్వెట్లున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్ర జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం. నౌక మోసుకుపోగలిగే ఆయుధ సంపత్తి ► 34 యుద్ధ విమానాలు (మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు) ► దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు మరో యుద్ధనౌకను నిర్మించగలం విక్రాంత్ తయారీలో ప్రతి రోజూ ఉత్కంఠగానే గడిచింది. కరోనాతో కాస్త ఆలస్యమైనా అద్భుతంగా నిర్మించాం. మరో యుద్ధనౌకను కూడా నిర్మించగల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాం. విక్రాంత్ తయారీలో 76 శాతం స్వదేశీ పరిజ్ఞానమే. తర్వాతి క్యారియర్ నిర్మాణానికల్లా దీన్ని 85 శాతం వరకు పెంచుకోగలం. – మధునాయర్, కొచ్చి షిప్‌యార్డు సీఎండీ – సాక్షి, విశాఖపట్నం -
నౌకాదళానికి మరో రక్షణ కవచం
భారత నౌకాదళంలో మరో రక్షణ కవచం చేరనుంది. భారత రక్షణ రంగం అమ్ముల పొదిలో మరో అధునాతన అస్త్రం రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలందించేందుకు సిద్ధమవుతోంది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్ నిర్మాణంతో విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ స్థానం సంపాదించింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది. సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్.. యుద్ధ విమాన వాహక నౌకల విషయంలో మాత్రం వెనకబడి ఉంది. ఈ రంగంలోనూ బలీయమైన శక్తిగా ఎదగాలన్న కాంక్షతో భారత్.. విక్రాంత్ తయారీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ క్లాస్ యుద్ధనౌక సిద్ధమైంది. భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌక ఇది. 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సిద్ధమవుతోంది. నిర్మాణానికి పదేళ్లు.. విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. కొచ్చి షిప్‌యార్డులో తుది మెరుగులు దిద్దుకుంటోంది విక్రాంత్. జయమ్ సమ్ యుద్ధి స్పర్థః అనే రుగ్వేద శ్లోకాన్ని స్ఫూర్తిగా దీనిని రూపొందిస్తున్నారు. ‘నాతో యుద్ధమంటే నాదే గెలుపు’ అని ఈ శ్లోకానికి అర్థం. ►1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌకా డిజైన్ మొదలు పెట్టారు. ►2009లో కీలక భాగాల్ని పూర్తి చేశారు. ►2011లో డ్రైడాక్ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. ►2015 జూన్ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ►సముద్రంలో కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయి సేవలకు ఉపయోగించనున్నారు. ►2020లో భారత నౌకాదళంలో సేవలు ప్రారంభించనుంది. – ఐఎన్ఎస్ విక్రాంత్‌ని ఇండియన్ నేవీలో కీలకమైన తూర్పు నౌకాదళం కేంద్రంగా సేవలందించనుంది. ఇక భారత్‌దే పైచేయి.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మహా సముద్రం.. హిందూ మహాసముద్రం. రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన ఈ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ రాకతో రక్షణ పరంగా దుర్భేధ్యంగా నిలవనుంది. 7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హిందూ మహా సముద్రంలో ఎలాంటి అడ్డు లేకుండా ముందుకు దూసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని విక్రాంత్ సొంతం చేసుకుంది. విక్రాంత్‌కు కీలక బాధ్యతలు.. విక్రాంత్ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ యుద్ధ విమాన వాహక నౌక అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో తీర ప్రాంత భద్రతకు సంబంధించిన కీలక బాధ్యతలు భుజానికెత్తుకుంటుంది. ముఖ్యంగా నౌకాదళంలో చేరనున్న మిగ్–29 యుద్ధ విమానాలకు విక్రాంత్ ఉపయుక్తమవుతుంది. – వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, తూర్పు నౌకాదళాధిపతి -
‘విక్రాంత్’లో దొంగలు
న్యూఢిల్లీ: భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న తొలి విమానవాహక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ విషయంలో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్మాణంలో ఉన్న ఈ నౌకలో దొంగలు పడ్డారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో 4 కంప్యూటర్లను ధ్వంసం చేసిన దుండగులు, వాటిలోని హార్డ్ డ్రైవ్‌లు, ప్రాసెసర్లు, ర్యామ్‌లను ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం కేరళ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. కాగా, కంప్యూటర్లు ఉన్న ప్రాంతంలో సీసీటీవీలు లేవనీ, ఇక్కడి భద్రతను ఓ ప్రైవేటు సంస్థ చూస్తోందని కేరళ డీజీపీ లోక్‌నాథ్ తెలిపారు. 2009లో కొచి్చన్ షిప్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం ప్రారంభమైంది. 2023 నాటికి ఇది భారత నేవీలో చేరనుంది. -
ఉత్కంఠజనితం..ఉద్వేగ భరితం
-
బజాజ్ కొత్త టూ వీలర్ బ్రాండ్ ‘వి’..
♦ ఫిబ్రవరి 1న ఆవిష్కరణ ♦ ఐఎన్ఎస్ విక్రాంత్ మెటల్‌తో తయారీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బజాజ్ ఆటో... ద్విచక్ర వాహన విభాగంలో ‘వి’ పేరుతో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరిస్తోంది. ఫిబ్రవరి 1న దేశానికి ఈ బ్రాండ్‌ను పరిచయం చేయనున్నట్లు బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. భారత దేశ తొలి విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి సేకరించిన లోహంతో ఈ బ్రాండ్ బైక్‌లను తయారు చేశారు. తొలి మోడల్ 150 సీసీ సామర్థ్యంతో రానున్నట్టు సమాచారం. 5 గేర్లు ఉండే అవకాశం ఉంది. రౌండ్ హెడ్ ల్యాంప్, సింగిల్ సీట్, అలాయ్ వీల్స్, సీటును కలుపుతున్నట్టుగా ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణలు. దేశానికి విశేష సేవలందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ భారత సైనిక సామర్థ్యానికి నిదర్శనమని ఎరిక్ వాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ స్ఫూర్తి, వారసత్వాన్ని కొత్త బ్రాండ్ కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని మోడళ్లు వస్తాయి? ధర ఎంత? వంటి వివరాలను ఫిబ్రవరి 1నే వెల్లడిస్తామన్నారు. ఇదీ ‘వి’ బ్రాండ్ నేపథ్యం.. భారత నేవీలోకి 1961లో ప్రవేశించిన ఐఎన్ఎస్ విక్రాంత్... 1961లో గోవా స్వాతంత్య్ర సమయంలో, 1971లో భారత్-పాక్ యుద్ధంలో విశేష సేవలందించింది. 1997లో సేవలకు స్వస్తి చెప్పి మ్యూజియంగా మారిపోయింది. 2014 నవంబరులో నౌకను తుక్కుగా మార్చారు. దీన్ని బజాజ్ ఆటో కొనుగోలు చేసింది. ఈ స్క్రాప్‌ను ప్రాసెస్ చేసి కొత్త బ్రాండ్ వాహనాల్లో వాడారు. -
INS విక్రాంత్ జలప్రవేశం
-
‘విక్రాంత్’కు వీడ్కోలు..!
ముంబై: భారత నావికాదళానికి సుదీర్ఘకాలం పాటు విశేష సేవలందించిన దేశ మొట్టమొదటి యుద్ధ నౌక విక్రాంత్‌ను నావల్ డాక్ నుంచి తరలించారు. ఈ యుద్ధ నౌకను విక్రయించిన నెల తర్వాత బుధవారం ఉదయం 9.40కు నావల్ డాక్‌ను నౌకా విచ్ఛిన్న ప్రాంతం (షిప్ బ్రేకింగ్ యార్డ్)కు తీసుకువెళ్లారు. అయితే ఈ నౌకను మ్యూజియంగా మార్చాలనే పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇప్పుడిప్పుడే దీన్ని తుక్కుగా మార్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ నౌకను తుక్కుగా మార్చేందుకు గత నెలలో వేలం వేయగా రూ.60 కోట్లకు దక్కించుకున్న ఐబీ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సదరు నౌకను వర్షాకాలంలోపే తమకు అందించాలని నౌకాదళాన్ని కోరింది. నౌకలోని వివిధ విడిభాగాలను ఇప్పటికే తొలగించారు. వీటిలో 60 శాతానికి పైగా భాగాలు ముంబైలోని మారిటైమ్ హిస్టరీ సొసైటీకి, మిగిలిన వాటిని గోవాలోని నావల్ ఏవియేషన్ మ్యూజియంకు తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 1961 నుంచి 1997 వరకు భారత నావికాదళానికి సేవలందించిన ఈ నౌక నిర్వహణ బాధ్యతలు తమ వల్ల కాదని మహారాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిన విషయం తెలిసిందే. దాంతో ఈ నౌకను బహిరంగ వేలం వేసేందుకు కేంద్రం నిర్ణయించింది. అయితే 2014 జనవరిలో ఈ నౌక వేలంపై బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై బాంబే హైకోర్టుకు కేంద్ర రక్షణ శాఖ సమాధానమిస్తూ.. నౌక జీవితకాలం పూర్తయినందున తుక్కు కింద మార్చేందుకు నిర్ణయించినట్లు వివరించింది. అయితే నౌకాదళానికి విశేష సేవలందించిన నౌకను తుక్కుగా మార్చే బదులు మ్యూజియంగా మారిస్తే ఆర్థికంగా గిట్టుబాటు కాదని తెలిపింది. దాంతో హైకోర్టు సదరు పిల్‌ను కొట్టివేసింది. దాంతో పిటిషన్ దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు అక్కడ పెండింగ్‌లో ఉండటంతో దాన్ని ఇప్పుడిప్పుడే తుక్కుగా మార్చే అవకాశంలేదు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం సమయంలో విక్రాంత్ యుద్ధ నౌక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీన్ని భారతదేశం 1957లో బ్రిటన్ నుంచి కొనుగోలుచేసింది. నిరసనల వెల్లువ.. విక్రాంత్ యుద్ధ నౌకను నావల్ డాక్ నుంచి తరలించడంపై శివసేన మండిపడింది. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్లే నౌక తుక్కుగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సేన ఎంపీ రాహుల్ శెవాలే, అరవింద్ సావంత్ నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు నావల్ డాక్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. నౌకను తుక్కుగా మార్చే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. -
ఐఎన్ఎస్-విక్రాంత్ వీడ్కోలుకు భారీ ఏర్పాట్లు
సాక్షి, ముంబై: వేలం పాటలో అమ్ముడైన ఐఎన్ఎస్-విక్రాంత్ యుద్ధనౌకకు తుది వీడ్కోలు పలికేందుకు ముంబైలో నేవీ దళం భారీగా సన్నాహాలు చేస్తోంది. ఈ నౌక అందించిన సేవలు చిరస్మరణీయం కావడంతో భారీ ఏర్పాట్ల మధ్య సాగనంపాలని సిబ్బంది నిర్ణయించారు. కాలం చెల్లిన విక్రాంత్‌ను రూ.63 కోట్లకు కొనుగోలు చేసిన ఐబీ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 20 రోజుల్లోపు ముంబై బందర్ నుంచి భావ్‌నగర్‌కు తరలించనుంది. ఆ తర్వాత దీన్ని ముక్కలుముక్కలుగా చేయనుంది. ఈ నౌక అందించిన సేవలు ప్రజల్లో చిరస్మరణీయంగా ఉండిపోవాలనే ఉద్ధేశంతో దీని స్థానంలో మరో విక్రాంత్ యుద్ధనౌకను ప్రవేశపెట్టాలని రక్షణ శాఖ భావించింది. ప్రస్తుతం ఈ యుద్ధనౌకను కొచ్చిన్ షిప్ యార్డులో తయారుచేస్తోంది. 2018 సంవత్సరంలో దీని సేవలు అందుబాటులోకి రానున్నాయని నేవీ వర్గాలు వెల్లడించాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఈ యుద్ధనౌక విక్రాంత్ కంటే కొంత పొడవు, వెడల్పు ఎక్కువే ఉంటుంది. అత్యాధునిక ఆయుధాలు, యుద్ధం కోసం అవసరమయ్యే సామగ్రి నిల్వ చేసేందుకు తగిన స్థలం ఉండనుంది. 12 మికోయాన్, మిగ్-29, ఎనిమిది తేజస్ హెలికాప్టర్లు, 10 కొమావ్ వెస్ట్‌ల్యాండ్ సోకింగ్ హెలికాప్టర్, ధ్రువ హెలికాప్టర్లు పార్కింగ్ చేసేందుకు డెక్‌పై వీలుంటుందని నేవీ దళ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాత విక్రాంత్ లేని లోటును నాలుగేళ్లలో అందుబాటులోకి రానున్న కొత్త యుద్ధనౌక తీర్చనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
చారిత్రిక యుద్ధ నౌకను తుక్కుగా అమ్మేస్తున్న సర్కారు
ఒకప్పుడు భారతీయ నౌకాదళానికే తలమానికంగా ఉన్న మొట్టమొదటి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ ఎస్ విక్రాంత్ ను భారత ప్రభుత్వం తుక్కు కింద అమ్మేస్తోంది. 1971 యుద్ధంలో అత్యంత కీలక పాత్ర పోషించి, తూర్పు పాకిస్తాన్ ను దిగ్బంధనం చేసి, భారత్ విజయానికి బాటలు వేసిన ఐఎన్ ఎస్ విక్రాంత్ ఘన చరిత్ర దృష్ట్యా దాన్ని కనీసం ఒక మ్యూజియంలా మార్చాలని కొందరు చేసిన ప్రయత్నాలను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ అరవై కోట్లకు తుక్కుగా అమ్మేయాలని నిర్ణయించింది. 15000 టన్నుల బరువున్న ఐఎన్ ఎస్ విక్రాంత్ ను 1957 లో ఇంగ్లండ్ నుంచి భారత నౌకాదళం కొనుగోలు చేసింది. ఇది చాలా కాలం భారత నౌకాదళానికి ఎనలేని సేవలందించింది. దీని నుంచి విమానాలు టేకాఫ్ చేయవచ్చు. శత్రువులపై దాడి చేసి మళ్లీ తిరిగి లాండ్ కావచ్చు. అంత విశాలమైన నౌక ఇది. అయితే 1997 లో ఈ చరిత్రాత్మక యుద్ధనౌకకు కాలం చెల్లిందని నౌకాదళం ప్రకటించింది. ఆ తరువాత నుంచీ దీన్ని తుక్కుగా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వారం ఒక షిప్ బ్రేకింగ్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే సామాజిక కార్యకర్త పైన్ గావ్ కర్ దీన్ని మ్యూజియంగా మార్చాలని, తరువాతి తరాలకు దీని ఘనచరిత్రను, పోరాట వారసత్వాన్ని ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. కానీ దీని నిర్వహణ భారాన్ని తాము మోయలేమని మహారాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో శత్రువును తుక్కు తుక్కు చేసిన ఈ చారిత్రిక యుద్ధనౌక ఇప్పుడు తుక్కుగా మారిపోనుంది. -
విక్రాంత్.. ఇక ‘తుక్కు’!
సాక్షి, ముంబై: 1972లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో విశేష సేవలు అందించిన ‘ఐఎన్ఎస్-విక్రాంత్’ యుద్ధ నౌక వేలానికి మార్గం సుగమమైంది. ఈ నౌకను కాపాడుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. నౌకను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొన్ని సామాజిక సేవాసంస్థలు కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వ్యాజ్యాన్ని కొట్టిపారేసింది. కోర్టులో చుక్కెదురు కావడంతో ఇక ఆ నౌకను వేలం వేయడం ఖాయమని తేలిపోయింది. ఈ నెల 29న వేలం పాటకు సన్నాహాలు చేస్తున్నారు. నేవీ శాఖ విక్రాంత్ సేవలను 1997లో నిలిపివేసింది. అప్పటి నుంచి బందరులో అలాగే నిలిచి ఉంది. దీని కారణంగా ఇతర నౌకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో దీన్ని ఇక్కడి నుంచి స్థలాంతరం చేయాలని పోర్టు ట్రస్టు ప్రభుత్వానికి సూచించింది. కానీ ప్రత్యామ్నాయ స్థలం దొరక్కపోవడంతో గాలికే వదిలేసింది. చివరకు మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. కానీ, అందుకయ్యే వ్యయాన్ని భరించడం తమకు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అప్పటికే దాని నిర్వహణ, భద్రతకు రూ.22 కోట్లు ఖర్చుచేసింది. దీంతో ఈ నౌకను వేలం ద్వారా తుక్కుసామాను కింద విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. కాగా విక్రాంత్‌ను కాపాడుకునేందుకు సామాజిక సంస్థలు, విద్యార్థులు విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. చివరకు కోర్టును ఆశ్రయించి పిల్ దాఖలు చేశారు. అయినప్పటికీ కోర్టులో కూడా చుక్కెదురైంది. ప్రస్తుతం విక్రాంత్ నౌక వయసు 70 సంవత్సరాలు. భద్రత దృష్ట్యా దీన్ని వేలం వేయడమే ఉత్తమమని ప్రభుత్వం భావించిన విధంగానే కోర్టు నుంచి తీర్పు రావడంతో మార్గం సుగమమైంది. -
రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకే..
సాక్షి ముంబై: యుద్ధనౌక ‘విక్రాంత్’ భద్రతా బాధ్యతలు చేపట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని, అంతేకాక ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా గత 15 సంవత్సరాల్లో సేకరించి ఇవ్వలేకపోయిందని, అందుకే తుక్కు కింద అమ్మాలని నిర్ణయించినట్లు బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరాలిలా ఉన్నాయి... ‘భారత నౌకాదళం 1997 నుంచి విక్రాంత్ సేవలను నిలిపివేసింది. దీంతో ఆ నౌకను తుక్కు కింద విక్రయించడం లేదా మ్యూజియంగా మార్చడం వంటి రెండు ప్రతిపాదనలను రూపొందించింది. 1998లో విక్రాంత్‌ను మ్యూజియంగా మారుస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపించింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం విక్రాంత్‌ను నిలిపేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని, మరమ్మతులు పూర్తికాగానే దాని భద్రత బాధ్యతలు స్వీకరించాలని కేంద్రం షరతులు విధించింది. ఈ షరతుల్లో ఏ ఒక్కదాన్నీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. దీంతో రోజురోజుకూ ‘విక్రాంత్’ నిర్వహణ వ్యయం పెరిగిపోతూనే ఉంది. గడిచిన 15 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం దాదాపు రూ.22 కోట్లు ఖర్చుచేసింది. కే ంద్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో రెండు సార్లు ఈ నౌకను ప్రజల సందర్శనార్థం తెరిచింది. ప్రస్తుతం విక్రాంత్ నౌక వయస్సు 70 సంవత్సరాలు. భద్రత దృష్ట్యా ఈ నౌక ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను, ఇతర ప్రత్యామ్నాయ అంశాలను కేంద్రం పరిశీలించింది. అయినప్పటికీ వాటివల్ల ప్రయోజనమేమీ లేదనే అభిప్రాయంతోనే విక్రాంత్‌ను తుక్కు సామాగ్రి కింద అమ్మాలని నిర్ణయం తీసుకున్నామ’ని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఇదిలాఉండగా ఈ నౌకను తుక్కు సామగ్రి కింద అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే ప్రకటించింది. ఈ నిర్ణయంపై అనేక రంగాల నుంచి విమర్శలు వచ్చాయి. విక్రాంత్‌ను కాపాడుకునేందుకు ఇటీవల సామాజిక సంస్థలు, విద్యార్థులు విరాళాలు సేకరించారు. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. వీటన్నింటిని పరిగణంలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా.. ఎందుకు తుక్కు కింద అమ్మాలని నిర్ణయించుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఆ మేరకు కేంద్ర కోర్టుకు ఈ అఫిడవిట్ సమర్పించింది. -
‘విక్రాంత్’ వేలం
సాక్షి, ముంబై: ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను వేలం వేయనున్నారు. ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియకు నౌకాదళం తుది మెరుగులు దిద్దుతోంది. భారత ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఎంఎస్టీసీ ఇండియా అనే సంస్థ ద్వారా ఈ ప్రక్రియ జరగనుంది. వేలం పాటలో పాల్గొనే సంస్థలు విక్రాంత్ నౌకను పరిశీలించేందుకు విధించిన తుది గడువు శనివారంతో ముగిసిపోయింది. దీంతో ఈ నెల 18వ తేదీన ఎలక్ట్రానిక్ ద్వారా వేలం పాట పాడతారు.అత్యధికంగా వేలం పలికిన సంస్థకు ఈ నౌకను అప్పగిస్తారు. వేలంపాటలో పాలుపంచుకునే సంస్థ లు డిపాజిట్ రూపంలో రూ. మూడు కోట్లు చెల్లిం చాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఈ నెల 17వ తేదీ సాయంత్రంలోగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నౌక మొత్తం బరువు 15 వేల టన్నులకుపైనే. గత నాలుగు దశాబ్దాలుగా అందులో భద్రపర్చిన వస్తువులు, ఇతర కలప, ప్లాస్టిక్ సామగ్రిని బయటకు తీసిన తరువాత అసలు ఉక్కు ఎంత బరువు ఎంత ఉం టుందనే దానిపైనే ఆధారపడి వేలంపాట జరుగుతుంది. వీటన్నింటినీ తొలగించిన తరువాత ఈ నౌక నాలుగు నుంచి ఎనిమిది వేల టన్నుల వరకు బరువు ఉండొచ ్చనేది నిపుణుల అంచనా. వేలానికి ముందు రూ.మూడు కోట్లు డిపాజిట్ డబ్బులు చెల్లించాలి... ఈ ప్రకారం ఐదు రేట్లు ఎక్కువ అంటే దాదాపు రూ.15 కోట్లు వేలం రూపంలో దక్కొచ్చనేది మరికొందరి అంచనా. ప్రస్తుతం ఉక్కుకు పలుకుతున్న ధరను బట్టి ప్రతి టన్నుకు కనీసం రూ.400 డాలర్ల చొప్పున వేలం పాట పాడాలి. అయితే అందులో అనేక టన్నుల సామగ్రి ఉక్కు కోవలోకి రాకపోవడంతో వేలంలో ఎంతమేర ఆదాయం వస్తుందనేది అందులో పాల్గొనేవారిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వివిధ సేవాసంస్థలు, విద్యార్థులు, బీఎంసీ, తాజాగా డబ్బావాలాలు కూడా విక్రాం త్ను కాపాడేందుకు విరాళాలను సేకరిస్తున్నారు. అయితే వేలాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం ఎవరూ చేపట్టడం లేదు. -
‘విక్రాంత్’ త్వరలో కనుమరుగు!
సాక్షి, ముంబై: ఐఎన్ఎస్ విక్రాంత్! యుద్ధ నౌకగా భారత నావికా దళంలో తనదైన ముద్రవేసింది. దాదాపు 40 ఏళ్లపాటు శత్రువుల గుండెల్లో దడ పుట్టించిందనేది చారిత్రక సత్యం. 1971 నాటి భారత్-పాక్ యుద్ధంలో అత్యంత సమర్థవంతమైన సేవలందించిన ఈ నౌక ప్రస్తుతం కాలం తీరిన వస్తువుల జాబితాలో చేరిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే త్వరలో ఇది చెత్తసామానులో కలిసిపోనుంది. నిర్వహణ భారాన్ని భరించలేకనే ప్రభుత్వం విక్రాంత్‌ను వదిలించుకోవాలని నిర్ణయించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిని వేలం వేయాలని సర్కారు సంకల్పించిందని పేర్కొన్నా యి. విక్రాంత్ నౌకను శాశ్వతంగా జాతీయ సంగ్రాహాలయం (మ్యూజియం)గా తీర్చిదిద్దితే బాగుం టుందంటూ నౌకాదళం ఇచ్చిన సూచనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. నిర్వహణ భారం పెరిగిపోయిందనే సాకు చూపుతూ విక్రయానికి సిద్ధపడింది. ఇందులో 50 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ నౌక నానాటికీ శిథిలమవుతోంది. మరోచోటికి తరలించాలంటే అందుకోసం ఇంజిన్‌కు మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. ఇది భారీ వ్యయంతో కూడుకున్న పని. అంతేకాకుండా రెండు సంవత్సరాలుగా ఈ నౌకను బందరులో లంగరు వేసి నిలిపి ఉంచడంవల్ల రాకపోకలు సాగించే వాణిజ్య, చమురు తదితర నౌకలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1961 మార్చి నాలుగో తేదీన ఈ నౌక భారత నావిక దళం అధీనంలోకి వచ్చింది. విమానాలు రాకపోకలు సాగించే మొదటి నౌక ఘనతను దక్కించుకుంది. 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధంలో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. 1997, జనవరి నుంచి దీనిని వినియోగించడం లేదు. వేలం పాటలో ఈ నౌకను దక్కించుకున్న తరువాత సర్వహక్కులు దాని యజమానికే ఉంటాయి. అందువల్ల దీనిని ముక్కలు చేస్తారా? లేక మ్యూజియం మాదిరిగా ఉంచుతారా? అనేది కొనుగోలుదారుడిపై ఆధారపడి ఉంటుందని నౌకాదళ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఈ యుద్ధ నౌకను శాశ్వతంగా మ్యూజియంగా ఉంచాలంటే అందులో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అందుకు రూ.75 కోట్లు ఖర్చవుతాయని రెండేళ్ల కిందట అంచనావేశారు. అయితే రాష్ట్రప్రభుత్వం ఉదాసీనత కారణంగా ఇప్పుడది రూ.500 కోట్లకు చేరుకుంది. దీన్ని మ్యూజియంగా తీర్చి దిద్ధేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు కోట్లు నిధులు మాత్రమే కేటాయించింది. ముంబైకి బదులు కొంకణ్ తీర ప్రాంతంలో నిలిపి ఉంచినట్టయితే పర్యాటకులు ఎక్కువసంఖ్యలో వచ్చే అవకాశముంటుంది. ఈ నెల 15వ తేదీలోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని నౌకాదళవర్గాలు వెల్లడించాయి. సర్కారు విఫలమైంది: ఉద్ధవ్ ముంబై: కాలం చెల్లిన ఐఎన్ఎస్ విక్రాంత నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ శివసేన విమర్శించింది. దీనిని మ్యూజియంగా మార్చేందుకు రూ. 75 కోట్లు సరిపోతాయని, అయితే ఆ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించలేదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ...పార్టీ అధికార పత్రిక సామ్నాలో గురువారం రాసిన సంపాదకీయంలో పేర్కొన్నారు. దివంగత నేత బాల్‌ఠాక్రే సైతం విక్రాంతను మ్యూజియంగా మార్చాలంటూ డిమాండ్ చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆవిధంగా చేస్తే అది యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, వారు కూడా దేశరక్షణలో భాగస్వాములయ్యేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నట్టు ఉద్ధవ్ గుర్తుచేశారు. -
ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభంపై చైనా పత్రిక ప్రశంస
బీజింగ్: సరిహద్దు అంశంపై భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా ఓ విషయంలో మాత్రం మన దేశాన్ని పొగడ్తల్లో ముంచెత్తింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ తొలిసారి విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను తయారు చేసుకోవడాన్ని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. ఈ చర్య ద్వారా దేశీయంగా అత్యాధునిక ఆయుధాల తయారీ దిశగా భారత్ ముందడుగు వేసినట్లయిందని పేర్కొంది. దేశీయంగా ఆయుధాల ఉత్పత్తిలో భారత ప్రభుత్వం ప్రాథమిక విజయం సాధించిందని ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభం తెలియజేస్తోందని కొనియాడింది. దీనికితోడు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్‌ను భారత్ ప్రారంభించడం వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను మెరుగుపరిచే అవకాశం ఉందని పత్రిక అంచనా వేసింది. -
‘విక్రాంత్’ తొలి అడుగులు!
కొచ్చి: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి విమానవాహక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ తొలి అడుగు వేసింది! రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ సోమవారం కొచ్చి నౌకాశ్రయంలో దీన్ని ప్రారంభించారు. ‘ఇది జాతి యావత్తూ గర్వించదగిన, సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. యుద్ధనౌకల నిర్మాణంలో మన సత్తా చాటాం. ఇలాంటి సామర్థ్యం అభివృద్ధి చెందిన కొన్ని దేశాలకు మాత్రమే ఉంది’ అని ఈ సందర్భంగా ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. దేశం కోసం యుద్ధనౌకల నిర్మాణ సుదీర్ఘ ప్రస్థానంలో ఇది కీలకమైన తొలి అడుగుగా అభివర్ణించారు. తొలిదశ నిర్మాణానికి చిహ్నంగా ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సోమవారం ప్రారంభించారు. తదుపరి దశలో మిగతా నిర్మాణం పూర్తికానుంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని కొచ్చిన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్(సీఎస్ఎల్)కు ఆంటోనీ సూచించారు. సమన్వయం లేక దీని నిర్మాణంలో చాలా ఏళ్ల జాప్యం జరిగిందన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని దీర్ఘకాలం పోరాడేందుకు నౌకాదళ శక్తిసామర్థ్యాలను మరింత పెంచాలన్నారు. కొచ్చిన్ షిప్‌యార్డ్‌కు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1972లో శంకుస్థాపన చేశారని ఆంటోనీ గుర్తు చేసుకున్నారు. పృథ్వీ-2 క్షిపణి, అరిహంత్ అణు జలాంతర్గాములను విజయవంతంగా పరీక్షించటం దేశ రక్షణ రంగ సామర్థ్యానికి రుజువన్నారు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంపై ప్రశ్నించగా, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా స్పందించే స్వేచ్ఛ మన బలగాలకు ఉందని ఆంటోనీ చెప్పారు. ‘విక్రాంత్’పై చైనాలో ఆందోళనలు బీజింగ్: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించడంపై చైనాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత నేవీని బలోపేతం చేసి చైనా సొంత ప్రాంతంగా భావించే పసిఫిక్ మహాసముద్రంలోకి అడుగుపెట్టేందుకు వీలు కల్పిస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్ వినియోగిస్తున్న ఐఎన్ఎస్ విరాట్‌కు తోడుగా ఈ ఏడాది జనవరిలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య రానుందని, దీంతో ఆ దేశం చైనాపై పైచేయి సాధిస్తుందని చైనా నావల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు జాంగ్ జుషే చెప్పారు. విక్రాంత్ వినియోగంలోకి వస్తే త మ పొరుగు దేశం సుదూర సముద్రాల్లోనూ కాపలా కాయడానికి వీలవుతుందని, దీంతో దక్షిణాసియాలో సైనిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పారు. విక్రమాదిత్య తోడైతే ఆసియాలో రెండు విమానవాహక యుద్ధనౌకలున్న ఒకే ఒక దేశంగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. చైనా గత ఏడాది తన తొలి విమానవాహక యుద్ధనౌకను ప్రారంభించింది. -
ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవ దృశ్యాలు
తొలిసారి పూర్తి దేశీయంగా రూపొందిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సోమవారం జాతికి అంకితం చేశారు.కేరళలోని కొచ్చి నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నౌకాయాన మంత్రి జీకే వాసన్, నేవల్ చీఫ్ డీకే జోషీల సమక్షంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ ప్రారంభించారు. తొలిదశ నిర్మాణం మాత్రమే ఇప్పటికి పూర్తయిందని, మిగతా దశల్లో మొత్తం నిర్మాణం పూర్తిచేయనున్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. -
ఐఎన్ఎస్ విక్రాంత్ జాతికి అంకితం
తొలిసారి పూర్తి దేశీయంగా రూపొందిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సోమవారం జాతికి అంకితం చేశారు. కేరళలోని కొచ్చి నౌకాశ్రయంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నౌకాయాన మంత్రి జీకే వాసన్, నేవల్ చీఫ్ డీకే జోషీల సమక్షంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ ప్రారంభించారు. తొలిదశ నిర్మాణం మాత్రమే ఇప్పటికి పూర్తయిందని, మిగతా దశల్లో మొత్తం నిర్మాణం పూర్తిచేయనున్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం 2016 నాటికి పూర్తయి పరీక్షలకు సిద్ధం కానుందని, 2018 నాటికి నావికాదళంలోకి చేరనుందని చెప్పారు. ప్రస్తుతం ఇలాంటి భారీ యుద్ధనౌకలను నిర్మించే సామర్థ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలకు మాత్రమే ఉండగా.. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో భారత్ కూడా సత్తా చాటినట్లవుతుందని నౌకా దళ ఉప ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఆర్కే ధావన్ అన్నారు. ఈ నౌక నిర్మాణానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తయారుచేసిన హైగ్రేడ్ స్టీలును, స్వదేశీయ పరికరాలను ఉపయోగించినట్లు తెలిపారు. ఇవీ ప్రత్యేకతలు.. ఐఎన్ఎస్ విక్రాంత్ 260 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇప్పటిదాకా భారత్ 6-7వేల టన్నుల బరువును మోయగల నౌకలను మాత్రమే నిర్మించగా.. ఈ నౌక ఏకంగా 37,500 టన్నుల బరువును మోయగలగడం విశేషం. దీనిపై రెండు టేకాఫ్ పాయింట్లు, ఒక రన్‌వే, ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి. మిగ్-29కే, కమోవ్ 31, తేలికపాటి యుద్ధవిమానాలు ఈ నౌకపై మోహరించనున్నాయి. నౌకపై 24 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 8 డీజిల్ జనరేటర్లు, 4 గ్యాస్ టర్బైన్లు అమర్చారు. దీని డిజైన్‌ను ‘డెరైక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్’ రూపొందించగా, కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ 2006 నుంచి నిర్మిస్తోంది. -
నేడు ‘విక్రాంత్’ ప్రారంభం
కొచ్చి: భారత తొలి స్వదేశీయ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తొలి దశ నిర్మాణం పూర్తిచేసుకుంది. కొచ్చి నౌకాశ్రయంలో ఐఎన్ ఎస్ విక్రాంత్‌ను సోమవారం నౌకాయాన మంత్రి జీకే వాసన్, నేవల్ చీఫ్ డీకే జోషీల సమక్షంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ ప్రారంభించనున్నారని నేవీ అధికారులు వెల్లడించారు. తొలిదశ నిర్మాణం పూర్తిచేసుకున్న దానికి గుర్తుగా ఈ నౌకను ప్రారంభించనున్నట్లు, మిగతా దశల్లో మొత్తం నిర్మాణం పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం 2016 నాటికి పూర్తయి పరీక్షలకు సిద్ధం కానుందని, 2018 నాటికి నావికాదళంలోకి చేరనుందన్నారు. ప్రస్తుతం ఇలాంటి భారీ యుద్ధనౌకలను నిర్మించే సామర్థ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలకు మాత్రమే ఉండగా.. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో భారత్ కూడా సత్తా చాటినట్లవుతుందని వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఆర్కే ధావన్ అన్నారు. ఈ నౌక నిర్మాణానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తయారుచేసిన హైగ్రేడ్ స్టీలును, స్వదేశీయ పరికరాలను ఉపయోగించినట్లు తెలిపారు. ఇవీ ప్రత్యేకతలు.. ఐఎన్ఎస్ విక్రాంత్ 260 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇప్పటిదాకా భారత్ 6-7వేల టన్నుల బరువును మోయగల నౌకలను మాత్రమే నిర్మించగా.. ఈ నౌక ఏకంగా 37,500 టన్నుల బరువును మోయగలగడం విశేషం. దీనిపై రెండు టేకాఫ్ పాయింట్లు, ఒక రన్‌వే, ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి. మిగ్-29కే, కమోవ్ 31, తేలికపాటి యుద్ధవిమానాలు ఈ నౌకపై మోహరించనున్నాయి. నౌకపై 24 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 8 డీజిల్ జనరేటర్లు, 4 గ్యాస్ టర్బైన్లు అమర్చారు. దీని డిజైన్‌ను ‘డెరైక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్’ రూపొందించగా, కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ 2006 నుంచి నిర్మిస్తోంది.