‘విక్రాంత్’ తొలి అడుగులు!
కొచ్చి: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి విమానవాహక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’ తొలి అడుగు వేసింది! రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ సోమవారం కొచ్చి నౌకాశ్రయంలో దీన్ని ప్రారంభించారు. ‘ఇది జాతి యావత్తూ గర్వించదగిన, సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. యుద్ధనౌకల నిర్మాణంలో మన సత్తా చాటాం. ఇలాంటి సామర్థ్యం అభివృద్ధి చెందిన కొన్ని దేశాలకు మాత్రమే ఉంది’ అని ఈ సందర్భంగా ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. దేశం కోసం యుద్ధనౌకల నిర్మాణ సుదీర్ఘ ప్రస్థానంలో ఇది కీలకమైన తొలి అడుగుగా అభివర్ణించారు. తొలిదశ నిర్మాణానికి చిహ్నంగా ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సోమవారం ప్రారంభించారు.
తదుపరి దశలో మిగతా నిర్మాణం పూర్తికానుంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని కొచ్చిన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్(సీఎస్‌ఎల్)కు ఆంటోనీ సూచించారు. సమన్వయం లేక దీని నిర్మాణంలో చాలా ఏళ్ల జాప్యం జరిగిందన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని దీర్ఘకాలం పోరాడేందుకు నౌకాదళ శక్తిసామర్థ్యాలను మరింత పెంచాలన్నారు. కొచ్చిన్ షిప్‌యార్డ్‌కు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1972లో శంకుస్థాపన చేశారని ఆంటోనీ గుర్తు చేసుకున్నారు. పృథ్వీ-2 క్షిపణి, అరిహంత్ అణు జలాంతర్గాములను విజయవంతంగా పరీక్షించటం దేశ రక్షణ రంగ సామర్థ్యానికి రుజువన్నారు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంపై ప్రశ్నించగా, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా స్పందించే స్వేచ్ఛ మన బలగాలకు ఉందని ఆంటోనీ చెప్పారు.
‘విక్రాంత్’పై చైనాలో ఆందోళనలు
బీజింగ్: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించడంపై చైనాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత నేవీని బలోపేతం చేసి చైనా సొంత ప్రాంతంగా భావించే పసిఫిక్ మహాసముద్రంలోకి అడుగుపెట్టేందుకు వీలు కల్పిస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్ వినియోగిస్తున్న ఐఎన్‌ఎస్ విరాట్‌కు తోడుగా ఈ ఏడాది జనవరిలో ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య రానుందని, దీంతో ఆ దేశం చైనాపై పైచేయి సాధిస్తుందని చైనా నావల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉపాధ్యక్షుడు జాంగ్ జుషే చెప్పారు. విక్రాంత్ వినియోగంలోకి వస్తే త మ పొరుగు దేశం సుదూర సముద్రాల్లోనూ కాపలా కాయడానికి వీలవుతుందని, దీంతో దక్షిణాసియాలో సైనిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పారు. విక్రమాదిత్య తోడైతే ఆసియాలో రెండు విమానవాహక యుద్ధనౌకలున్న ఒకే ఒక దేశంగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. చైనా గత ఏడాది తన తొలి విమానవాహక యుద్ధనౌకను ప్రారంభించింది.