సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా గురువారం సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. ఆర్కే బీచ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళం తయారు చేసిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ తొలిసారిగా విశాఖ చేరుకుంది.
ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచి్చన తర్వాత తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్ విధులు నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత వివిధ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న విక్రాంత్ ప్రస్తుతం తొలిసారిగా విశాఖకు చేరుకుంది. వాస్తవానికి విక్రాంత్‌ని బెర్తింగ్ చేసేందుకు అవసరమైన బెర్త్ ఇక్కడ లేదు. విక్రాంత్‌కు అనుగుణమైన భారీ బెర్త్ నిర్మించేందుకు విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)తో నౌకాదళం ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే విశాఖ వేదికగా మిలాన్–2024 విన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖకు వచ్చిన విక్రాంత్‌ను విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో బెర్తింగ్ చేశారు. మరోవైపు.. పశ్చిమ నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న మరో విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య రెండు రోజుల క్రితం విశాఖ చేరుకుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ని గంగవరం అదానీ పోర్టులో లంగరు వేశారు. 22న జరిగే సిటీ పరేడ్, 23 నుంచి 27వ తేదీ వరకూ జరిగే మిలాన్ సీ ఫేజ్ విన్యాసాల్లో ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
మిలాన్‌లో పాల్గొన్న దేశాల జాతీయ జెండాలతో ఆ దేశ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పరేడ్ సాగనుంది. యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాసాలతో ఆర్‌కే బీచ్‌లో యుద్ధ వాతావరణాన్ని నౌకాదళ సిబ్బంది ప్రజలకు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించనున్నారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నౌకాదళ అధికారులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment