సాక్షి ముంబై: యుద్ధనౌక ‘విక్రాంత్’ భద్రతా బాధ్యతలు చేపట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని, అంతేకాక ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా గత 15 సంవత్సరాల్లో సేకరించి ఇవ్వలేకపోయిందని, అందుకే తుక్కు కింద అమ్మాలని నిర్ణయించినట్లు బాంబే హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వివరాలిలా ఉన్నాయి... ‘భారత నౌకాదళం 1997 నుంచి విక్రాంత్ సేవలను నిలిపివేసింది. దీంతో ఆ నౌకను తుక్కు కింద విక్రయించడం లేదా మ్యూజియంగా మార్చడం వంటి రెండు ప్రతిపాదనలను రూపొందించింది.
1998లో విక్రాంత్‌ను మ్యూజియంగా మారుస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపించింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం విక్రాంత్‌ను నిలిపేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని, మరమ్మతులు పూర్తికాగానే దాని భద్రత బాధ్యతలు స్వీకరించాలని కేంద్రం షరతులు విధించింది. ఈ షరతుల్లో ఏ ఒక్కదాన్నీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. దీంతో రోజురోజుకూ ‘విక్రాంత్’ నిర్వహణ వ్యయం పెరిగిపోతూనే ఉంది. గడిచిన 15 ఏళ్లలో కేంద్రం ప్రభుత్వం దాదాపు రూ.22 కోట్లు ఖర్చుచేసింది. కే ంద్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో రెండు సార్లు ఈ నౌకను ప్రజల సందర్శనార్థం తెరిచింది. ప్రస్తుతం విక్రాంత్ నౌక వయస్సు 70 సంవత్సరాలు. భద్రత దృష్ట్యా ఈ నౌక ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను, ఇతర ప్రత్యామ్నాయ అంశాలను కేంద్రం పరిశీలించింది. అయినప్పటికీ వాటివల్ల ప్రయోజనమేమీ లేదనే అభిప్రాయంతోనే విక్రాంత్‌ను తుక్కు సామాగ్రి కింద అమ్మాలని నిర్ణయం తీసుకున్నామ’ని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
ఇదిలాఉండగా ఈ నౌకను తుక్కు సామగ్రి కింద అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే ప్రకటించింది. ఈ నిర్ణయంపై అనేక రంగాల నుంచి విమర్శలు వచ్చాయి. విక్రాంత్‌ను కాపాడుకునేందుకు ఇటీవల సామాజిక సంస్థలు, విద్యార్థులు విరాళాలు సేకరించారు. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. వీటన్నింటిని పరిగణంలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా.. ఎందుకు తుక్కు కింద అమ్మాలని నిర్ణయించుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఆ మేరకు కేంద్ర కోర్టుకు ఈ అఫిడవిట్ సమర్పించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకే..
Published Fri, Jan 17 2014 11:08 PM | Last Updated on Mon, Oct 8 2018 6:22 PM
Advertisement
Advertisement