బజాజ్ కొత్త టూ వీలర్ బ్రాండ్ ‘వి’..
♦ ఫిబ్రవరి 1న ఆవిష్కరణ
♦ ఐఎన్‌ఎస్ విక్రాంత్ మెటల్‌తో తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న బజాజ్ ఆటో... ద్విచక్ర వాహన విభాగంలో ‘వి’ పేరుతో కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరిస్తోంది. ఫిబ్రవరి 1న దేశానికి ఈ బ్రాండ్‌ను పరిచయం చేయనున్నట్లు బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. భారత దేశ తొలి విమాన వాహక నౌక అయిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి సేకరించిన లోహంతో ఈ బ్రాండ్ బైక్‌లను తయారు చేశారు.
తొలి మోడల్ 150 సీసీ సామర్థ్యంతో రానున్నట్టు సమాచారం. 5 గేర్లు ఉండే అవకాశం ఉంది. రౌండ్ హెడ్ ల్యాంప్, సింగిల్ సీట్, అలాయ్ వీల్స్, సీటును కలుపుతున్నట్టుగా ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణలు. దేశానికి విశేష సేవలందించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారత సైనిక సామర్థ్యానికి నిదర్శనమని ఎరిక్ వాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ స్ఫూర్తి, వారసత్వాన్ని కొత్త బ్రాండ్ కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని మోడళ్లు వస్తాయి? ధర ఎంత? వంటి వివరాలను ఫిబ్రవరి 1నే వెల్లడిస్తామన్నారు.
ఇదీ ‘వి’ బ్రాండ్ నేపథ్యం..
భారత నేవీలోకి 1961లో ప్రవేశించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్... 1961లో గోవా స్వాతంత్య్ర సమయంలో, 1971లో భారత్-పాక్ యుద్ధంలో విశేష సేవలందించింది. 1997లో సేవలకు స్వస్తి చెప్పి మ్యూజియంగా మారిపోయింది. 2014 నవంబరులో నౌకను తుక్కుగా మార్చారు. దీన్ని బజాజ్ ఆటో కొనుగోలు చేసింది. ఈ స్క్రాప్‌ను ప్రాసెస్ చేసి కొత్త బ్రాండ్ వాహనాల్లో వాడారు.