‘విక్రాంత్’కు వీడ్కోలు..! | INS Vikrant moved out of Mumbai Naval dockyard | Sakshi
Sakshi News home page

‘విక్రాంత్’కు వీడ్కోలు..!

Published Wed, May 28 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

INS Vikrant moved out of Mumbai Naval dockyard

 ముంబై: భారత నావికాదళానికి సుదీర్ఘకాలం పాటు విశేష సేవలందించిన దేశ మొట్టమొదటి యుద్ధ నౌక విక్రాంత్‌ను నావల్ డాక్ నుంచి తరలించారు. ఈ యుద్ధ నౌకను విక్రయించిన నెల తర్వాత   బుధవారం ఉదయం 9.40కు నావల్ డాక్‌ను నౌకా విచ్ఛిన్న ప్రాంతం (షిప్ బ్రేకింగ్ యార్డ్)కు తీసుకువెళ్లారు. అయితే ఈ నౌకను మ్యూజియంగా మార్చాలనే పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇప్పుడిప్పుడే దీన్ని తుక్కుగా మార్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ నౌకను తుక్కుగా మార్చేందుకు గత నెలలో వేలం వేయగా రూ.60 కోట్లకు దక్కించుకున్న ఐబీ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సదరు నౌకను వర్షాకాలంలోపే తమకు అందించాలని నౌకాదళాన్ని కోరింది. నౌకలోని వివిధ విడిభాగాలను ఇప్పటికే తొలగించారు.

 వీటిలో 60 శాతానికి పైగా భాగాలు ముంబైలోని మారిటైమ్ హిస్టరీ సొసైటీకి, మిగిలిన వాటిని గోవాలోని నావల్ ఏవియేషన్ మ్యూజియంకు తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 1961 నుంచి 1997 వరకు భారత నావికాదళానికి సేవలందించిన ఈ నౌక నిర్వహణ బాధ్యతలు తమ వల్ల కాదని మహారాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిన విషయం తెలిసిందే. దాంతో ఈ నౌకను బహిరంగ వేలం వేసేందుకు కేంద్రం నిర్ణయించింది. అయితే 2014 జనవరిలో ఈ నౌక వేలంపై బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై బాంబే హైకోర్టుకు కేంద్ర రక్షణ శాఖ సమాధానమిస్తూ.. నౌక జీవితకాలం పూర్తయినందున తుక్కు కింద మార్చేందుకు నిర్ణయించినట్లు వివరించింది.

అయితే నౌకాదళానికి విశేష సేవలందించిన నౌకను తుక్కుగా మార్చే బదులు మ్యూజియంగా మారిస్తే ఆర్థికంగా గిట్టుబాటు కాదని తెలిపింది. దాంతో హైకోర్టు సదరు పిల్‌ను కొట్టివేసింది. దాంతో పిటిషన్ దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు అక్కడ పెండింగ్‌లో ఉండటంతో దాన్ని ఇప్పుడిప్పుడే తుక్కుగా మార్చే అవకాశంలేదు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం సమయంలో విక్రాంత్ యుద్ధ నౌక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీన్ని భారతదేశం 1957లో బ్రిటన్ నుంచి కొనుగోలుచేసింది.

 నిరసనల వెల్లువ..
 విక్రాంత్ యుద్ధ నౌకను నావల్ డాక్ నుంచి తరలించడంపై శివసేన మండిపడింది. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్లే నౌక తుక్కుగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సేన ఎంపీ రాహుల్ శెవాలే, అరవింద్ సావంత్ నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు నావల్ డాక్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. నౌకను తుక్కుగా మార్చే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement