India confirmed as 'top-tier security partner' for Australia - Sakshi
Sakshi News home page

India-Australia: రక్షణ బంధం బలోపేతం

Published Fri, Mar 10 2023 4:43 AM | Last Updated on Fri, Mar 10 2023 10:43 AM

India confirmed as top-tier security partner for Australia - Sakshi

ముంబైలో డబ్బావాలాలతో ముచ్చటిస్తున్న ఆల్బనీస్‌; ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై తేలికపాటి యుద్ధవిమానంలో ఆల్బనీస్‌

ముంబై/న్యూఢిల్లీ: భారత్‌తో సంయుక్త నావికా విన్యాసాలకు ఆస్ట్రేలియా త్వరలో ఆతిథ్యమివ్వనుందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ ప్రకటించారు. ‘ఎక్సర్‌సైజ్‌ మలబార్‌’ పేరిట జరిపే ఈ విన్యాసాల్లో వీటిలో అమెరికా, జపాన్‌ కూడా పాల్గొంటాయన్నారు. ఆయన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను గురువారం ముంబైలో సందర్శించారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు.

నౌకలో కలియదిరిగి విశేషాలు తిలకించిన అనంతరం ఆల్బనీస్‌ పలు అంశాలపై మాట్లాడారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ రంగంలో సాన్నిహిత్యం నానాటికీ పెరుగుతోందని, బంధం మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు. ‘గతేడాది రికార్డు స్థాయిలో సంయుక్త విన్యాసాలు, చర్చలు జరిగాయి. త్వరలో ఆస్ట్రేలియాలో ఎక్సర్‌సైజ్‌ మలబార్‌ నిర్వహించనున్నాం. వాటిలో భారత్‌ తొలిసారిగా పాల్గొంటోంది’ అని అన్నారు.

మోదీపై ప్రశంసల జల్లు
ఏ అంశాన్నైనా భవిష్యత్తును అంచనా వేసి మరీ ఆలోచించడం ప్రధాని నరేంద్ర మోదీలో ఉన్న గొప్పదనమని ఆల్బనీస్‌ ప్రశంసించారు. ‘‘రక్షణ సంబంధాలను సుదృఢం చేసేది ఇలాంటి దూరదృష్టే. బంధాలను ఇప్పుడెలా ఉన్నాయని కాకుండా మున్ముందు ఎదుగుదలకు ఉన్న అవకాశాల పరంగా మదింపు వేయగలగాలి. ఆ సామర్థ్యమున్న నేత మోదీ’’ అని అభిప్రాయపడ్డారు. వర్తక, ఆర్థిక కార్యకలాపాల కోసం ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు ఇరు దేశాలకూ ఆవశ్యకమేనన్నారు. మోదీ ప్రతిపాదించిన జనరల్‌ రావత్‌ డిఫెన్స్‌ ఆఫీసర్స్‌ ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రాం ఇరు దేశాల సైనిక సిబ్బంది మధ్య అవగాహన, సాన్నిహిత్యం పెంపొందేందుకు దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.

రక్షణ మంత్రుల చర్చలు
రక్షణ రంగంలో ఆస్ట్రేలియాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ చెప్పారు. ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్‌ మార్లెస్‌తో గురువారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయంలో ఇరు దేశాలకు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా తమ సంభాషణ సాగిందన్నారు.వర్తకం, రక్షణ, కీలక ఖనిజాలు

మోదీతో చర్చల్లో ఇవే ప్రధానం
ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపే తం చేసుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో మోదీ శుక్రవారం విస్తృతంగా చర్చలు జరపనున్నారు. కీలక ఖనిజాలు, ద్వైపాక్షిక వర్తకం, రక్షణ ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా సైనిక దూకుడు, అందుకు అడ్డుకట్ట వేసే మార్గాలు తదితరాలపైనా నేతలు చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య 2021లో 27.5 బిలియన్‌ డాలర్ల విలువైన వర్తకం జరిగింది. 2022లో అమల్లోకి వచ్చిన ఆర్థిక సహకార వర్తక ఒప్పందం (ఈసీటీఏ)తో వచ్చే ఐదేళ్లలో ఇది 50 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

టెస్ట్‌ మ్యాచ్‌ చూశారు
గురువారం ఉదయం మోదీ, ఆ ల్బనీస్‌ కలిసి అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట ప్రారంభ కార్యక్రమంలో పాల్గొ న్నారు. టాస్‌ అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు మ్యాచ్‌ను ఆస్వాదించారు.  అనంతరం ముంబైలో ఇండియా–ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలో ఆల్బనీస్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement