Australia Prime minister
-
India-Australia: రక్షణ బంధం బలోపేతం
ముంబై/న్యూఢిల్లీ: భారత్‌తో సంయుక్త నావికా విన్యాసాలకు ఆస్ట్రేలియా త్వరలో ఆతిథ్యమివ్వనుందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. ‘ఎక్సర్సైజ్ మలబార్’ పేరిట జరిపే ఈ విన్యాసాల్లో వీటిలో అమెరికా, జపాన్ కూడా పాల్గొంటాయన్నారు. ఆయన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను గురువారం ముంబైలో సందర్శించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ ఆయనకు స్వాగతం పలికారు. నౌకలో కలియదిరిగి విశేషాలు తిలకించిన అనంతరం ఆల్బనీస్ పలు అంశాలపై మాట్లాడారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ రంగంలో సాన్నిహిత్యం నానాటికీ పెరుగుతోందని, బంధం మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు. ‘గతేడాది రికార్డు స్థాయిలో సంయుక్త విన్యాసాలు, చర్చలు జరిగాయి. త్వరలో ఆస్ట్రేలియాలో ఎక్సర్సైజ్ మలబార్ నిర్వహించనున్నాం. వాటిలో భారత్ తొలిసారిగా పాల్గొంటోంది’ అని అన్నారు. మోదీపై ప్రశంసల జల్లు ఏ అంశాన్నైనా భవిష్యత్తును అంచనా వేసి మరీ ఆలోచించడం ప్రధాని నరేంద్ర మోదీలో ఉన్న గొప్పదనమని ఆల్బనీస్ ప్రశంసించారు. ‘‘రక్షణ సంబంధాలను సుదృఢం చేసేది ఇలాంటి దూరదృష్టే. బంధాలను ఇప్పుడెలా ఉన్నాయని కాకుండా మున్ముందు ఎదుగుదలకు ఉన్న అవకాశాల పరంగా మదింపు వేయగలగాలి. ఆ సామర్థ్యమున్న నేత మోదీ’’ అని అభిప్రాయపడ్డారు. వర్తక, ఆర్థిక కార్యకలాపాల కోసం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు ఇరు దేశాలకూ ఆవశ్యకమేనన్నారు. మోదీ ప్రతిపాదించిన జనరల్ రావత్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఇరు దేశాల సైనిక సిబ్బంది మధ్య అవగాహన, సాన్నిహిత్యం పెంపొందేందుకు దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. రక్షణ మంత్రుల చర్చలు రక్షణ రంగంలో ఆస్ట్రేలియాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్‌తో గురువారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంలో ఇరు దేశాలకు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా తమ సంభాషణ సాగిందన్నారు.వర్తకం, రక్షణ, కీలక ఖనిజాలు మోదీతో చర్చల్లో ఇవే ప్రధానం ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపే తం చేసుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో మోదీ శుక్రవారం విస్తృతంగా చర్చలు జరపనున్నారు. కీలక ఖనిజాలు, ద్వైపాక్షిక వర్తకం, రక్షణ ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడు, అందుకు అడ్డుకట్ట వేసే మార్గాలు తదితరాలపైనా నేతలు చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య 2021లో 27.5 బిలియన్ డాలర్ల విలువైన వర్తకం జరిగింది. 2022లో అమల్లోకి వచ్చిన ఆర్థిక సహకార వర్తక ఒప్పందం (ఈసీటీఏ)తో వచ్చే ఐదేళ్లలో ఇది 50 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ చూశారు గురువారం ఉదయం మోదీ, ఆ ల్బనీస్ కలిసి అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ప్రారంభ కార్యక్రమంలో పాల్గొ న్నారు. టాస్ అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు మ్యాచ్‌ను ఆస్వాదించారు. అనంతరం ముంబైలో ఇండియా–ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలో ఆల్బనీస్ పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో 13 మంది మహిళా మంత్రులు
కెన్బెరా: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానెసె తన కేబినెట్లో మహిళలకు పెద్ద పీట వేశారు. రికార్డు స్థాయిలో 13 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. వీరిలో ఆనీ అలీ అనే ముస్లిం కూడా ఉన్నారు. దేశ చరిత్రలో తొలి ముస్లిం మహిళా మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. అయ్యారు. కెన్బెరాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లీ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. లేబర్ పార్టీకి చెందిన ఆంటోని ప్రధాని అయిన 11 రోజుల తర్వాత 30 మందితో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. ఇలాంటి ఒక సమీకృత ప్రభుత్వానికి సారథిగా ఉండడం గర్వంగా ఉందని ఆంటోని ట్విటర్లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఎంత భిన్నత్వంతో కూడుకొని ఉందో, తన కేబినెట్ కూడా అంతే భిన్నంగా ఉందన్నారు. -
విధి వికృత ఆట
సిడ్నీ: విద్యా సంవత్సరం ముగింపు రోజు.. చిన్నారుల ఆటపాటలు, నవ్వులు, కేరింతలతో స్కూలు ప్రాంగణమంతా సందడిగా ఉంది. అంతలోనే చోటు చేసుకున్న అనూహ్య ఘటన వారందరినీ షాక్‌కు గురి చేసింది. తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారులు ఎక్కి ఆడుకుంటున్న బౌన్సీ క్యాజిల్ (కోట ఆకారంలో ఉండే గాలి నింపిన దళసరి బెలూన్‌తో చేసిన నిర్మాణం)ను అకస్మాత్తుగా వీచిన బలమైన సుడిగాలి పైకి లాక్కెళ్లిపోయింది. దీంతో, అందులో ఆడుకుంటున్న 9 మంది చిన్నారులు కిందపడిపోయారు. సుమారు 33 అడుగుల ఎత్తు నుంచి వారు పడిపోవడంతో నలుగురు అక్కడికక్కడే తుదిశ్వాస విడవగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులైన మరో నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా 10, 11 ఏళ్ల ఆరో గ్రేడ్ చదువుకుంటున్న బాలబాలికలని సమాచారం. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా రాష్ట్రం డేవన్పోర్ట్లోని ఓ స్కూల్లో గురువారం ఉదయం ‘ఫన్డే’ ఉత్సవాల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, తీవ్ర ఆందోళనతో హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకుని, తమ చిన్నారుల క్షేమ సమాచారం గురించి వాకబు చేశారు. ఇది అనూహ్యంగా చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. -
ఆస్ట్రేలియాకు గూగుల్ బెదిరింపులు
వెల్లింగ్టన్: ‘బెదిరింపులపై మేం స్పందించం. కానీ మీరు చేయగలిగే స్థాయిలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాలు చేస్తుంది’.. ఇదీ గూగుల్ బెదిరింపులకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇచ్చిన సమాధానం. వివరాల్లోకెల్తే.. ఆస్ట్రేలియాలోని మీడియా సంస్థలకు చెందిన వార్తలను గూగుల్ ఉపయోగించు కుంటున్నందుకుగానూ ఆయా మీడియా సంస్థలకు డబ్బు చెల్లించేలా ఆస్ట్రేలియా ఇటీవల కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ చట్టాలపై గూగుల్ బెదిరింపు వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ల గూగుల్ డైరెక్టర్ మెల్ సిల్వా మాట్లాడుతూ.. ‘ఈ కోడ్ గనక చట్టంగా మారితే, గూగుల్ సెర్చ్‌ను ఆస్ట్రేలియాలో లేకుండా చేయడం తప్ప ఇంకేమీ చేయలేం. అప్పుడు మా ప్రొడక్ట్‌లను ఉపయోగించే దేశ ప్రజలకు అది బ్యాడ్ న్యూస్’ అంటూ ఆ దేశ సెనెటర్లకు చెప్పారు. మీడియా సంస్థలకు డబ్బు చెల్లించడానికి తాము సిద్ధమేనని, అయితే చట్టంలో ఉన్న నియమాల ప్రకారం కాదని చెప్పారు. -
ఆస్ట్రేలియా ప్రధాని రాక వాయిదా
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ భారత్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. జనవరి 13న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు రావాల్సి ఉంది. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేస్తున్నామని, రానున్న నెలల్లో ఇరు దేశాలకు కుదిరే మరో సమయంలో భేటీ జరుగుందని ట్వీట్ చేశారు. భారత్‌తో భేటీ అనంతరం ఆయన జపాన్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేసినందుకు ఇరు దేశాల ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు భారీగా ఆస్తులను దహనం చేస్తోంది. ఈ విపత్తు సమయంలో తాను దేశంలో ఉండి పౌరులకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని మారిసన్ పేర్కొన్నారు. కార్చిచ్చు గురించి ప్రధాని మోదీ శుక్రవారం మారిసన్‌తో మాట్లాడారు. భారతీయుల తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 23 మంది పౌరులు మృతిచెందారు. దీని నుంచి పౌరులను కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 3 వేల మంది మిలిటరీ రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది. -
నువ్వు ఒక మూర్ఖుడివి.. ఎప్పటికి ఓట్లు వేయం
-
నువ్వు ఒక మూర్ఖుడివి.. ఎప్పటికి ఓట్లు వేయం
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌కు దేశ ప్రజల నుంచి వింత అనుభవం ఎదురైంది. గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాలోని అడవుల్లో కార్చిచ్చు అంటుకొని మంటలు వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 18 మంది కార్చిచ్చుకు బలవ్వగా, అందులో దేశ పౌరులు, పలువురు ఫైర్ ఫైటర్స్, వాలంటీర్లు ఉన్నారు. అయితే ప్రధాని స్కాట్ మోరిసన్ గురువారం న్యూ సౌత్‌వేల్స్‌లోని కోబార్గో పట్టణంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లారు. కాగా అక్కడ సహాయ కార్యక్రమాలు చేపడుతున్న ఒక మహిళా ఫైర్ ఫైటర్‌ను అభినందిస్తూ ఆమెతో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ప్రధానితో కరచాలనం చేయడానికి ఇష్టపడలేదు. అంతలో అక్కడ ఉన్న మరో వ్యక్తితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా అతను కూడా నిరాకరించి ప్రధానికి క్షమాపణ చెప్పి దూరంగా వెళ్లిపోయాడు. కాగా ఆ వ్యక్తి ఇతరుల ఇళ్లను కాపాడే ప్రయత్నంలో తన ఇళ్లును పోగొట్టుకున్నాడని ఒక అధికారి వెల్లడించారు. 'కార్చిచ్చు అంటుకొని దేశం మొత్తం తగలబడుతుంటే మీరు మాత్రం సిడ్నీ హార్బర్ దగ్గర్లోని కిర్రిబిల్లి హౌస్‌లో కూర్చొని కొత్త సంవత్సర వేడుకలను ఆస్వాదిస్తారా' అంటూ ఒక వ్యక్తి ప్రధానిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ' నువ్వు ఒక మూర్ఖుడివి.. నిన్ను మళ్లీ మేం ప్రధానిగా చూడబోమంటూ' మరొక వ్యక్తి ప్రధాని మోరిసన్ మీద విరుచుకుపడ్డాడు. అయితే వీటిపై ప్రధాని స్పందిస్తూ.. ' ఈరోజు ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో నా కళ్లారా చూశాను. నన్ను తిట్టినందుకు నేనేం బాధపడడంలేదు.ఎందుకంటే ఇందులో మానవ తప్పిదం ఏం లేదు. కేవలం ప్రకృతి వైపరిత్యాల వల్లే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు మా ప్రజలు పడుతున్న బాధను దగ్గరుండి గమనించాను. మా ప్రభుత్వం తరపున వారికి కావలిసివి అన్ని ఏర్పాటు చేస్తామని' పేర్కొన్నారు. గతేడాది మేలో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి స్కాట్ మోరిసన్ ప్రధాని పదవిని చేపట్టాడు. అయితే కార్చిచ్చు అంటుకొని దేశంలోని ఐదు రాష్ట్రాలకు వ్యాపించిన సమయంలో మోరిసన్ తన కుటుంబంతో కలిపి హాలిడే టూర్ పేరుతో హవాయి నగరాన్ని సందర్శించారు. అయితే ప్రధాని తీరుపై అక్కడి ప్రజలు, విపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోశారు. దీనిపై తాను క్షమాపణ కోరుతున్నట్లు మోరిసన్ తెలిపారు.జనవరి 13 నుంచి 16 వరకు ప్రధాని స్కాట్ మోరిసన్ భారత్‌లో పర్యటించాల్సి ఉండగా, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్యా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. -
ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్లీ మోరిసన్!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ సంకీర్ణం అనూహ్య ఫలితాలు సాధించింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ గెలుపు ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మెజారిటీ సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు శనివారం జరిగిన ఎన్నికల్లో సుమారు 1.60 కోట్ల మంది ఓటేశారు. అయితే, 9 గెలాక్సీ ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ కూటమి మొత్తం 151 సీట్లలో 82 స్థానాలు గెలుచుకుంటుందని వచ్చింది. కానీ, ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలను బట్టి అధికార పార్టీ 74 స్థానాలను కైవసం చేసుకోగా, మోరిసన్ మళ్లీ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కనీసం 76 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. అయితే, 65 స్థానాలు మాత్రమే గెలుచుకున్న లేబర్ పార్టీ ఓటమిని అంగీకరించింది. -
భారత్‌లో ఆస్ట్రేలియా ప్రధాని
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ స్వాగతం పలికారు. ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో బంధాల బలోపేతానికి టర్న్‌బుల్ భారత ప్రధానితో చర్చలు జరుపుతారు. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులను భారత్ ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది.