సిడ్నీ: విద్యా సంవత్సరం ముగింపు రోజు.. చిన్నారుల ఆటపాటలు, నవ్వులు, కేరింతలతో స్కూలు ప్రాంగణమంతా సందడిగా ఉంది. అంతలోనే చోటు చేసుకున్న అనూహ్య ఘటన వారందరినీ షాక్‌కు గురి చేసింది. తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారులు ఎక్కి ఆడుకుంటున్న బౌన్సీ క్యాజిల్ (కోట ఆకారంలో ఉండే గాలి నింపిన దళసరి బెలూన్‌తో చేసిన నిర్మాణం)ను అకస్మాత్తుగా వీచిన బలమైన సుడిగాలి పైకి లాక్కెళ్లిపోయింది. దీంతో, అందులో ఆడుకుంటున్న 9 మంది చిన్నారులు కిందపడిపోయారు. సుమారు 33 అడుగుల ఎత్తు నుంచి వారు పడిపోవడంతో నలుగురు అక్కడికక్కడే తుదిశ్వాస విడవగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు.
క్షతగాత్రులైన మరో నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా 10, 11 ఏళ్ల ఆరో గ్రేడ్ చదువుకుంటున్న బాలబాలికలని సమాచారం. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా రాష్ట్రం డేవన్‌పోర్ట్‌లోని ఓ స్కూల్‌లో గురువారం ఉదయం ‘ఫన్‌డే’ ఉత్సవాల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, తీవ్ర ఆందోళనతో హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకుని, తమ చిన్నారుల క్షేమ సమాచారం గురించి వాకబు చేశారు. ఇది అనూహ్యంగా చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment