Naval exercises
-
Chinese President: తైవాన్‌పై డ్రాగన్ కన్ను... యుద్ధానికి సిద్ధం కండి
బీజింగ్/తైపీ: చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్ను స్వాదీనం చేసుకోవడమే లక్ష్యంగా డ్రాగన్ దేశం పావులు కదుపుతోంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైన్యానికి పిలుపునిచ్చారు. యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చైనా అధికారిక వార్తాసంస్థ ‘సీసీటీవీ’ ఆదివారం ఈ మేరకు వెల్లడించింది. జిన్‌పింగ్ తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ బ్రిగేడ్‌ను సందర్శించారు. ‘‘రానున్న యుద్ధం కోసం శిక్షణ, సన్నద్ధతను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. సేనలు పూర్తి సామర్థ్యంతో రణక్షేత్రంలోకి అడుగుపెట్టేలా చర్యలు చేపట్టండి. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు సర్వసన్నద్ధంగా ఉండండి’’ అని సైన్యానికి పిలుపునిచ్చారు. చైనా సైన్యం ఇటీవల తైవాన్ చుట్టూ పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు, నౌకలను మోహరించి విన్యాసాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తైవాన్‌పై అతి త్వరలో డ్రాగన్ దురాక్రమణ తప్పదనేందుకు జిన్‌పింగ్ వ్యాఖ్యలు సంకేతాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, తీర రక్షక దళం నౌకలు ఆదివారం తైవాన్ను చుట్టుముట్టాయి. గత రెండేళ్లలో తైవాన్, చైనా మధ్య ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. తైవాన్ను విలీనం చేసుకోవడానికి బల ప్రయోగానికి సైతం వెనుకాడబోమని చైనా కమ్యూనిస్టు నాయకులు ఇటీవల తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. హద్దు మీరితే బదులిస్తాం: తైవాన్ చైనా దూకుడుపై తైవాన్ స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఆరు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. వాటిలో రెండు విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి ప్రవేశించాయని తెలిపింది. ‘‘తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. హద్దు మీరితే తగు రీతిలో బదులిస్తాం’’ అని స్పష్టం చేసింది. యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని చైనాకు సూచించింది. ‘‘రెచ్చగొట్టే చర్యలు ఆపండి. మా దేశాన్ని బలప్రయోగం ద్వారా అణచివేసే చర్యలకు పాల్పడొద్దు. స్వతంత్ర తైవాన్ ఉనికిని గుర్తించండి’’ అని చైనాకు సూచించింది. ప్రాంతీయ భద్రత, శాంతి, సౌభాగ్యం కోసం చైనాతో పని చేయాలన్నదే తమ ఆకాంక్ష చెప్పింది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం కొనసాగడం తైవాన్‌తోపాటు మొత్తం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కీలకమని తైవాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తైవాన్‌కు ఆ దేశాల అండ తైవాన్ 1949 నుంచి స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. అది తమ దేశంలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఎప్పటికైనా దాన్ని విలీనం చేసుకుని తీరతామని చెబుతోంది. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్... ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో తైవాన్ ఆక్రమణకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, లిథువేనియాతోపాటు మరో 30 దేశాలు తైవాన్‌కు అండగా నిలుస్తున్నాయి. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలను అవి తీవ్రంగా ఖండించాయి. -
India-Australia: రక్షణ బంధం బలోపేతం
ముంబై/న్యూఢిల్లీ: భారత్‌తో సంయుక్త నావికా విన్యాసాలకు ఆస్ట్రేలియా త్వరలో ఆతిథ్యమివ్వనుందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. ‘ఎక్సర్సైజ్ మలబార్’ పేరిట జరిపే ఈ విన్యాసాల్లో వీటిలో అమెరికా, జపాన్ కూడా పాల్గొంటాయన్నారు. ఆయన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను గురువారం ముంబైలో సందర్శించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ ఆయనకు స్వాగతం పలికారు. నౌకలో కలియదిరిగి విశేషాలు తిలకించిన అనంతరం ఆల్బనీస్ పలు అంశాలపై మాట్లాడారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ రంగంలో సాన్నిహిత్యం నానాటికీ పెరుగుతోందని, బంధం మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు. ‘గతేడాది రికార్డు స్థాయిలో సంయుక్త విన్యాసాలు, చర్చలు జరిగాయి. త్వరలో ఆస్ట్రేలియాలో ఎక్సర్సైజ్ మలబార్ నిర్వహించనున్నాం. వాటిలో భారత్ తొలిసారిగా పాల్గొంటోంది’ అని అన్నారు. మోదీపై ప్రశంసల జల్లు ఏ అంశాన్నైనా భవిష్యత్తును అంచనా వేసి మరీ ఆలోచించడం ప్రధాని నరేంద్ర మోదీలో ఉన్న గొప్పదనమని ఆల్బనీస్ ప్రశంసించారు. ‘‘రక్షణ సంబంధాలను సుదృఢం చేసేది ఇలాంటి దూరదృష్టే. బంధాలను ఇప్పుడెలా ఉన్నాయని కాకుండా మున్ముందు ఎదుగుదలకు ఉన్న అవకాశాల పరంగా మదింపు వేయగలగాలి. ఆ సామర్థ్యమున్న నేత మోదీ’’ అని అభిప్రాయపడ్డారు. వర్తక, ఆర్థిక కార్యకలాపాల కోసం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు ఇరు దేశాలకూ ఆవశ్యకమేనన్నారు. మోదీ ప్రతిపాదించిన జనరల్ రావత్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఇరు దేశాల సైనిక సిబ్బంది మధ్య అవగాహన, సాన్నిహిత్యం పెంపొందేందుకు దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. రక్షణ మంత్రుల చర్చలు రక్షణ రంగంలో ఆస్ట్రేలియాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్‌తో గురువారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంలో ఇరు దేశాలకు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా తమ సంభాషణ సాగిందన్నారు.వర్తకం, రక్షణ, కీలక ఖనిజాలు మోదీతో చర్చల్లో ఇవే ప్రధానం ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపే తం చేసుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో మోదీ శుక్రవారం విస్తృతంగా చర్చలు జరపనున్నారు. కీలక ఖనిజాలు, ద్వైపాక్షిక వర్తకం, రక్షణ ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడు, అందుకు అడ్డుకట్ట వేసే మార్గాలు తదితరాలపైనా నేతలు చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య 2021లో 27.5 బిలియన్ డాలర్ల విలువైన వర్తకం జరిగింది. 2022లో అమల్లోకి వచ్చిన ఆర్థిక సహకార వర్తక ఒప్పందం (ఈసీటీఏ)తో వచ్చే ఐదేళ్లలో ఇది 50 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ చూశారు గురువారం ఉదయం మోదీ, ఆ ల్బనీస్ కలిసి అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ప్రారంభ కార్యక్రమంలో పాల్గొ న్నారు. టాస్ అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు మ్యాచ్‌ను ఆస్వాదించారు. అనంతరం ముంబైలో ఇండియా–ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలో ఆల్బనీస్ పాల్గొన్నారు. -
మలబార్ డ్రిల్‌లో ఆస్ట్రేలియా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రగులుతున్న నేపథ్యంలో ఇదొక అత్యంత కీలక పరిణామం. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నవంబర్‌లో జరగనున్న మలబార్ విన్యాసాల్లో అమెరికా, జపాన్‌తోపాటు ఆస్ట్రేలియా పొల్గొంటుందని భారత్ సోమవారం ప్రకటించింది. ఉమ్మడి శత్రువైనా చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్భుజ కూటమి(క్వాడ్) పేరిట జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ నావికా దళాలు పాల్గొనడం పరిపాటి. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. క్వాడ్‌లోని నాలుగు సభ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదికపైకి రానుండడం ఇదే మొదటిసారి. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌లో చైనా తరచుగా ఘర్షణకు దిగుతున్న నేపథ్యంలో నాలుగు దేశాల డ్రిల్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ద్వారా చైనాకు బలమైన హెచ్చరికలు పంపినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబార్ ఎక్సర్సైజ్ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది. -
చైనాకు షాక్: భారత్-అమెరికా యుద్ధ విన్యాసాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌక యూఎస్ నిమిజ్ అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దూకుడు పెంచిన డ్రాగన్‌కు ఈ పరిణామం దీటైన సంకేతం పంపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లక్ష టన్నుల బరువుండే అమెరికా నిమిజ్ నౌక 90 యుద్ధ విమానాలను మోయగల సామర్ధ్యం కలిగిఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగుతున్న విన్యాసాల్లో సబ్మెరైన్లు సహా పలు భారత యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. అండమాన్ నికోబార్ కమాండ్ (ఏఎన్సీ)తో పాటు తూర్పు నావల్ కమాండ్ (ఏఎన్సీ)కు చెందిన నౌకలు విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో వ్మూహాత్మక జలాలపై ప్రపంచ దేశాలన్నింటికీ ఉమ్మడి భాగస్వామ్యం ఉంటుందని భారత్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విన్యాసాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రాంతంలో శాంతి సుస్ధిరతలను భారత్ కోరుకుంటుందని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా దక్షిణ చైనా సముద్రంలో స్వేఛ్చా నావిగేషన్, చట్టబద్ధ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో ఏ దేశాల హక్కులను డ్రాగన్ హరించినా ఆయా దేశాలకు ట్రంప్ యంత్రాంగం అండగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేసిన క్రమంలో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది. గత కొద్ది రోజులుగా ట్రంప్ యంత్రాంగం దక్షిణ చైనా సముద్రంపై తన వైఖరిని కఠినతరం చేసింది. ఆ ప్రాంతంలో ఇతర దేశాల ఆందోళనలను విస్మరిస్తూ దక్షిణ చైనా ప్రాంతంలో మారిటైమ్ సామ్రాజ్యం నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపించింది. చదవండి: అగ్ర రాజ్యాల మధ్య వ్యాక్సిన్ వార్ -
సముద్రంపై సత్తాకు మోదీ సర్కార్ యోచన
న్యూఢిల్లీ: హిందూ మహా సముద్రంపై తన గుత్తాధిపత్యాన్ని, నావికా బలగంలో తన సత్తాను భారత్ ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటుంది. ఇందుకోసం ప్రపంచ అగ్ర రాజ్యాలైన అమెరికా, జపాన్‌తో కలిసి సంయుక్తంగా సముద్రంపై ప్రత్యేక యుద్ధక్రీడను నిర్వహించనుంది. గతంలో ఎనిమిదేళ్ల కిందట చైనా ఇలాంటి డ్రిల్ డ్రిల్ చేసింది. ఇటీవల కాలంలో హిందూమహాసముద్రం నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ సముద్రంపై పరోక్షంగా ఆధిపత్యం చెలాంయించేందుకు చైనా పోటీదారుగా భారత్ నిలుస్తోంది. అటు భూసరిహద్దు విషయంలోను చైనా వ్యవహారం శృతిమించుతున్న నేపథ్యంలో పరోక్షంగా భారత్ సత్తాను చూపించాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో సముద్ర తలంపై మోదీ సర్కార్ భారత నౌకా విభాగంతో భారీ యుద్ధ క్రీడను నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్, అమెరికా, జపాన్ మిలటరీ అధికారులు జపాన్‌లోని యోకోసుకా అనే నేవీ స్థావరం బుధవారం, గురువారం రెండు రోజులపాటు చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. భారీ స్థాయిలో ఈ ఎక్సర్సైజ్ మూడు దేశాలు ఉమ్మడిగా నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
సమర సంరంభం
గగనతలం నుంచి సముద్రంలోకి.. నీటి నుంచి నేలపైకి.. మూడు రూపాల్లో సాగిన సాహస విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగాయి. కరాచీ హార్బర్‌ను బాంబర్లతో పేల్చేసి.. సబ్‌మెరైన్ ఘజియాను నీట ముంచి, 1971 డిసెంబర్ 4న పాకిస్తాన్‌ను మట్టి కరిపించిన తూర్పునావికాదళం శౌర్య ప్రతాపాలకు గుర్తుగా ప్రతి ఏటా నిర్వహించే నౌకాదళ విన్యాసాలు బుధవారం కన్నులపండువగా జరిగాయి. ఇసుక వేస్తే రాలనంత జనంతో సాగరతీరం కిటకిటలాడింది. అరివీర భయంకరంగా సాగిన విన్యాసాలను విశాఖవాసులు ఆస్వాదించారు. ఆరువేల అడుగుల ఎత్తులో దూసుకుపోయే ఎనిమిది డొర్నియర్లు ఒక్కసారిగా నింగి నుంచి నేల వైపునకు 400 కిమీ వేగంతో దూసుకువచ్చాయి. భారత పతాకంతో స్కై డైవర్లు కనువిందు చేశారు. దేశంలోనే మూడో అతి పెద్దదైన ఐఎన్ఎస్ జలాశ్వ హుందాగా ముందు కదులుతుంటే రన్వీజయ్, సహ్యాద్రి, సత్పురాలు అలలపై అనుసరించి, విన్యాసాలు ప్రదర్శించాయి. కదులుతున్న యుద్ధ నౌకలపై ఈస్ట్రన్ ఫ్లీట్‌కు చెందిన వీహెచ్ 3 హెచ్, కమోవ్, సీకింగ్, చేతక్ హెలికాప్టర్లు వచ్చి వాలాయి. మెరైన్ కమెండోలు సాగరంలోని ఆయిల్ రిగ్‌ను పేల్చేశారు. సముద్రంలో గాలులు తీవ్రంగా ఉండటంతో పొగ రింగ్‌గా ఏర్పడి అబ్బురపరిచింది. మిస్సైళ్ల నుంచి పేలిన బాంబులతో సాగరతీరం మార్మోగింది. సముద్రంలో చిక్కుకున్న వ్యక్తిని చాకచక్యంగా కమోవ్లో నుంచి రక్షించడం ఆసక్తి గొలిపింది. నింగి, నేల, సాగరంలోంచి శత్రువుల స్థావరాల్లో గుబులు పుట్టించడంలాంటి విన్యాసాలు అబ్బురపరిచాయి. ఎల్సీఏ, ఎల్సీఎంల నుంచి కమాండోలు దిగి బాంబుల హోరు మధ్య చేసిన బీకర యుద్ధంతో అతిథులు సైతం కలవరపడ్డారు. -
ఇక నేవీ సంరంభం
=రేపట్నుంచి వేడుకలు ప్రారంభం =నెల రోజులపాటు కార్యక్రమాలు, 4న నేవీడే =నౌకాదళం సర్వ సన్నద్ధం విశాఖపట్నం, న్యూస్‌లైన్ : తూర్పు నౌకాదళ సంబరాలకు ఏటా మాదిరిగా విశాఖ వేదిక కానుం ది. ఈ నెల పదో తేదీన ప్రారంభమయ్యే ఈ వేడుకలు డిసెంబర్ 4న నేవీ డేతో ముగియనున్నాయి. సెలెం ట్ సర్వీస్ పేరిట నౌకాదళ సత్తాను చాటే విన్యాసాలకు సాగరతీరం మరోమారు స్వాగతం పలకనుంది. ఈస్ట్రన్ ఫ్లీట్ యుద్ధ నౌకలు తూర్పుతీరం వెంట కొలువుతీరి కనువిందు చేయనున్నాయి. నౌకాదళ సేవలకు అద్దం పట్టే నేవీ మేళా ప్రత్యేక ఆకర్షణ కానుంది. నెలరోజుల పాటు సంబ రంగా సాగే వివిధ కార్యక్రమాలకు ఆదివారం తెరలేవనుంది. ఏటా చిన్నారుల చిత్ర లేఖనంతో ప్రారంభించడం ఆనవాయితీ. చిన్నారులతో పా టు ప్రత్యేక బాలలకు సయితం వేరే కే టగిరీలో పోటీలు నిర్వహిస్తారు. వీరు యుద్ధ నౌకల్లో ఎక్కి సాహస విన్యాసాల్ని వీక్షించేందుకుఅనుమతిస్తున్నారు. పోర్ట్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల పదో తేదీన చిత్ర లేఖనం పోటీలు జరుగుతాయి. ప్రేమ సమాజంలో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. వినసొంపైనా నేవీ బ్యాండ్ వుడా పార్కులో 17న సంగీతాభిమానుల్ని ఓలలాడించనుంది. డే ఎట్ సీ పేరిట ఈ నెల 20న విన్యాసాల్ని ని ర్వహించనున్నారు. విద్యార్థులకు ఈ నెల 19, 20 తేదీల్లోనూ, ప్రత్యేక బా లలకు 22న, ప్రజల కోసం 23, 24 తేదీల్లో యుద్ధ నౌకల్ని డాక్లో బెర్తుల వద్దకే తీసుకురానున్నారు. ఆర్కే బీచ్ లో డిసెంబర్ 4న అకాశంలో డోర్నియర్లు, ఫైటర్లు విన్యాసాలు చేస్తుం డగా సాగరం నుంచి నేలపైకి వచ్చి శత్రు శిబిరాల్ని తుదముట్టించడం, జలాంతర్గామి ఒక్కసారిగా సముద్రంలో పైకి లేవడం, నౌకల నుంచే యుద్ధ విమానాలపై దాడిలాంటి విన్యాసాలతో విస్మయపరిచే ఆపరేషన్స్‌తో వేడుకలకు ముగింపు పలికేందుకు నేవీ సర్వసన్నద్ధమైంది.