తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేరళ తీరంలో ఈ రోజు నవశకం ప్రారంభమైందని తెలిపారు. అమృతోత్సవ వేళ ఐఎన్‌ఎస్ నౌక ప్రవేశం శుభపరిణామమన్నారు. భారత్‌కు సాధ్యం కానిది ఏదీ ఉండదని, ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు.
కాగా విక్రాంత్ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా.. రూ.20 వేల కోట్లు ఖర్చయ్యింది. 262 మీటర్ల పొడవు.. 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు.
ఇప్పటిదాకా భారత్ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్‌వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించనున్నారు.
చదవండి:కేసీఆర్‌కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ
నౌక మోసుకుపోగలిగే ఆయుధ సంపత్తి
► 34 యుద్ధ విమానాలు (మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్‌సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు)
► దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు
ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీని కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment