indigenous aircraft
-
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జాతికి అంకితం చేసిన మోదీ
తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేరళ తీరంలో ఈ రోజు నవశకం ప్రారంభమైందని తెలిపారు. అమృతోత్సవ వేళ ఐఎన్ఎస్ నౌక ప్రవేశం శుభపరిణామమన్నారు. భారత్‌కు సాధ్యం కానిది ఏదీ ఉండదని, ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు. కాగా విక్రాంత్ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా.. రూ.20 వేల కోట్లు ఖర్చయ్యింది. 262 మీటర్ల పొడవు.. 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు. ఇప్పటిదాకా భారత్ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించనున్నారు. చదవండి:కేసీఆర్‌కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ నౌక మోసుకుపోగలిగే ఆయుధ సంపత్తి ► 34 యుద్ధ విమానాలు (మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు) ► దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీని కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి. -
నేవీ చేతికి విక్రాంత్
న్యూఢిల్లీ: భారత నావికా దళం కొత్త శక్తిని సముపార్జించుకుంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గురువారం నేవీకి అందజేసింది. షెడ్యూల్ ప్రకారం విక్రాంత్‌ను ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేవీ విధుల్లోకి చేర్చుకుంటారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ విక్రాంత్ చేరికను కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. రూ.20 వేల కోట్లతో నిర్మించిన విక్రాంత్ నాలుగో, తుది దశ సీ ట్రయల్స్‌ను మూడు వారాల క్రితం విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో, యుద్ధ విమాన వాహక నౌకలను దేశీయంగా డిజైన్ చేసి, నిర్మించుకునే సామర్థ్యం సొంతం చేసుకున్న అరుదైన ఘనతను దేశం సొంతం చేసుకుంది. దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సమయాన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహకనౌక(ఐఏసీ) అందడం చారిత్రక సందర్భమని నేవీ పేర్కొంది. ‘త్వరలో నావికాదళంలోకి ప్రవేశించే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో భారతదేశం స్థానం మరింత సుస్థిరం అవుతుంది’అని నేవీ పేర్కొంది. ఐఏసీలో 76% దేశీయంగా తయారు చేసిన సామగ్రినే వినియోగించారు. విక్రాంత్‌లో మెషినరీ ఆపరేషన్, నేవిగేషన్, సర్వైవబిలిటీ గరిష్ట స్థాయి ఆటోమేషన్తో రూపొందాయి. ఫిక్స్డ్ వింగ్, రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనుగుణంగా దీని డిజైన్ ఉందని నేవీ వివరించింది. ఐఏసీ నుంచి మిగ్–29కే యుద్ధ విమానాలతోపాటు కమోవ్–31 హెలికాప్టర్లు, ఎంఐఐ–60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను కలిపి మొత్తం 30 వరకు నిర్వహించవచ్చు. ఐఏసీలో 2,300 కంపార్టుమెంట్లుండగా 1,700 మంది సిబ్బంది పనిచేసేందుకు, ముఖ్యంగా మహిళా అధికారులకు ప్రత్యేక సౌకర్యాలతో డిజైన్ చేశారు. దీని సాధారణ వేగం 18 నాట్స్ కాగా, గరిష్ట వేగం 28 నాట్స్. ఇది 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. -
రాజ తేజసం
బెంగళూరు: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించారు. ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపి ఎంతో థ్రిల్‌కి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రి రాజ్నా›థే. బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం దాదాపుగా 30 నిమిషాల సేపు తేజస్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టిన ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణం చాలా హాయిగా, సౌకర్యంగా ఉంది. ఎంతో థ్రిల్ పొందాను. నా జీవితంలో ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది అని రాజ్‌నాథ్ చెప్పారు. రాజ్‌నాథ్ వెంట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ ఉన్నారు. తేజస్‌లో పైలట్ వెనక సీట్లో కూర్చొని రాజ్‌నాథ్ ప్రయాణించారు. 68 ఏళ్ల వయసున్న రాజ్‌నాథ్ స్వదేశీ యుద్ధ విమానం కావడం వల్లే తాను ఇందులో ప్రయాణించే ధైర్యం చేశానని చెప్పారు పైలట్ అవతారం అరగంటసేపు యుద్ధ విమాన ప్రయాణంలో ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపారు. పైలట్ ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ విమానాన్ని రాజ్‌నాథ్ నియంత్రించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. రాజ్‌నాథ్ విమానాన్ని నడిపిన విషయాన్ని డీఆర్డీఓ చీఫ్ డా. జీ. సతీష్ రెడ్డి వెల్లడించారు. దీనికి రాజ్‌నాథ్ స్పందిస్తూ తాను చేసింది ఏమీ లేదని పైలెట్ తివారీ చెప్పింది చెప్పినట్టుగా చేశానని నవ్వుతూ వెల్లడించారు. తేజస్ వైపు ప్రపంచ దేశాల చూపు.. యుద్ధ విమానంలో ప్రయాణించిన తర్వాత విలేకరుల సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. హాల్, డీఆర్డీఓతో పాటుగా ఈ యుద్ధ విమానం తయారీ కోసం పని చేసిన ఇతర సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘యుద్ధ విమానాల తయారీ విషయంలో మనం ఎంతో అభివృద్ధి చెందాం. మనమూ యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఆగ్నేయాసియా దేశాలు ఎన్నో తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి’అని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు ‘విక్రాంత్’ ప్రారంభం
కొచ్చి: భారత తొలి స్వదేశీయ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తొలి దశ నిర్మాణం పూర్తిచేసుకుంది. కొచ్చి నౌకాశ్రయంలో ఐఎన్ ఎస్ విక్రాంత్‌ను సోమవారం నౌకాయాన మంత్రి జీకే వాసన్, నేవల్ చీఫ్ డీకే జోషీల సమక్షంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ ప్రారంభించనున్నారని నేవీ అధికారులు వెల్లడించారు. తొలిదశ నిర్మాణం పూర్తిచేసుకున్న దానికి గుర్తుగా ఈ నౌకను ప్రారంభించనున్నట్లు, మిగతా దశల్లో మొత్తం నిర్మాణం పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం 2016 నాటికి పూర్తయి పరీక్షలకు సిద్ధం కానుందని, 2018 నాటికి నావికాదళంలోకి చేరనుందన్నారు. ప్రస్తుతం ఇలాంటి భారీ యుద్ధనౌకలను నిర్మించే సామర్థ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలకు మాత్రమే ఉండగా.. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో భారత్ కూడా సత్తా చాటినట్లవుతుందని వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఆర్కే ధావన్ అన్నారు. ఈ నౌక నిర్మాణానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తయారుచేసిన హైగ్రేడ్ స్టీలును, స్వదేశీయ పరికరాలను ఉపయోగించినట్లు తెలిపారు. ఇవీ ప్రత్యేకతలు.. ఐఎన్ఎస్ విక్రాంత్ 260 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇప్పటిదాకా భారత్ 6-7వేల టన్నుల బరువును మోయగల నౌకలను మాత్రమే నిర్మించగా.. ఈ నౌక ఏకంగా 37,500 టన్నుల బరువును మోయగలగడం విశేషం. దీనిపై రెండు టేకాఫ్ పాయింట్లు, ఒక రన్‌వే, ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి. మిగ్-29కే, కమోవ్ 31, తేలికపాటి యుద్ధవిమానాలు ఈ నౌకపై మోహరించనున్నాయి. నౌకపై 24 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 8 డీజిల్ జనరేటర్లు, 4 గ్యాస్ టర్బైన్లు అమర్చారు. దీని డిజైన్‌ను ‘డెరైక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్’ రూపొందించగా, కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ 2006 నుంచి నిర్మిస్తోంది.