Cochin Shipyard
-
బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను జాతికి అంకితం చేసిన మోదీ
తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేరళ తీరంలో ఈ రోజు నవశకం ప్రారంభమైందని తెలిపారు. అమృతోత్సవ వేళ ఐఎన్ఎస్ నౌక ప్రవేశం శుభపరిణామమన్నారు. భారత్‌కు సాధ్యం కానిది ఏదీ ఉండదని, ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు. కాగా విక్రాంత్ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది. దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా.. రూ.20 వేల కోట్లు ఖర్చయ్యింది. 262 మీటర్ల పొడవు.. 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు. ఇప్పటిదాకా భారత్ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. గత ఏడాది ట్రయల్స్ విజయవంతంగా ముగిశాయి. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించనున్నారు. చదవండి:కేసీఆర్‌కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ నౌక మోసుకుపోగలిగే ఆయుధ సంపత్తి ► 34 యుద్ధ విమానాలు (మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు) ► దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లు ఈ నౌకలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తరహా వైద్య సదుపాయాలున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసోలేషన్ వార్డులతో కూడిన అత్యాధునిక మెడికల్ కాంప్లెక్స్ ఉంది. 16 బెడ్లు, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు, 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉంటారు. ఇక దీని కిచెన్ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి. -
2న నేవీలోకి ఐఏసీ విక్రాంత్
కొచ్చి: మొట్టమొదటిసారిగా దేశీయంగా నిర్మించిన విమానవాహక నౌక(ఐఏసీ)ని సెప్టెంబర్ 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్(సీఎస్ఎల్)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధాని మోదీ నావికాదళంలోకి విక్రాంత్‌ను అధికారికంగా ప్రవేశపెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రథమ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ రిటైర్డు సిబ్బంది, నౌకా నిర్మాణ, రక్షణ శాఖల అధికారులు మొత్తం 2,000 మంది వరకు పాల్గొంటారని చెప్పారు. రూ.20వేల కోట్లతో నిర్మించిన ఈ నౌకను జూలై 28న సీఎస్ఎల్ నేవీకి అప్పగించిన విషయం తెలిసిందే. -
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీలు
కొచ్చిలోని మినీరత్న కంపెనీ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 355 ► ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్‌లు–347, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు–08. ► ట్రేడ్ అప్రెంటిస్‌లు: ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ తదితరాలు. అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 27.11.2003 తర్వాత జన్మించి ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► టెక్నీషియన్ అప్రెంటిస్‌లు: విభాగాలు: అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, బేసిక్ నర్సింగ్ అండ్ పల్లియేటివ్ కేర్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్. అర్హత: ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్(వీహెచ్ఎస్ఈ) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 27.11.2003 తర్వాత జన్మించి ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హతలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021 ► వెబ్సైట్: www.cochinshipyard.in -
కొచ్చిన్ షిప్‌యార్డు కేసు నిందితుల అరెస్ట్
న్యూఢిల్లీ: గత ఏడాది జూన్, సెప్టెంబర్ మధ్య కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మిస్తున్న స్వదేశీ విమాన వాహక నౌక నుంచి క్లిష్టమైన ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్‌ను దొంగిలించినందుకుగాను బిహార్, రాజస్తాన్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో కేరళ పోలీసుల నుంచి దర్యాప్తు స్వీకరించిన ఉగ్రవాద నిరోధక సంస్థ అనేక రాష్ట్రాల్లో దాదాపు తొమ్మిది నెలల పాటు విస్తృతమైన దర్యాప్తు జరిపిన తరువాత నిందితులు సుమిత్ కుమార్ సింగ్ (23), దయా రామ్(22)లను బుధవారం అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుల వద్ద నుంచి ‘దేశ భద్రతకు సంబంధించిన’ డాటాతో పాటు ప్రాసెసర్లు, ర్యామ్‌లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్‌లతో సహా దొంగిలించిన ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. సుమిత్ కుమార్ సింగ్ బిహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన వాడు కాగా.. దయా రామ్ రాజస్తాన్‌కు చెందిన హనుమన్‌గఢ్‌కు చెందినవారు. ఎన్ఐఏ దర్యాప్తులో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దొంగిలించబడిన కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తిరుచ్చిలో ఎన్ఐఏ దూకుడు) (నిందితులు దయారమ్, సుమిత్ కుమార్ సింగ్(ఎడమ నుంచి)) ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు మాట్లాడుతూ.. ‘వీరిద్దరు నిర్మాణంలో ఉన్న విమాన వాహక నౌకలో పెయింటింగ్ పనిలో కాంట్రాక్టు కార్మికులుగా చేరారు. డబ్బుకు ఆశపడి ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించారు. వాటిలో ఐదు మైక్రో ప్రాసెసర్లు, 10 ర్యామ్‌లు, ఓడలోని మల్టీ-ఫంక్షనల్ కన్సోల్‌ల నుంచి ఐదు సాలిడ్ స్టేట్ డ్రైవ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత సెప్టెంబరులో నిందితులు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. విషయం తెలియడంతో కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్ఐఏ సెప్టెంబర్ 26 న కేసును రీ రిజస్టర్ చేసి అక్టోబర్ 16 న కేరళ పోలీసుల నుంచి దర్యాప్తు బదిలీ చేయించుకున్నాము. నిందితుల కోసం ఈ తొమ్మది నెలల కాలంలో ఓడలో పనిచేసిన 5,000 మందికి పైగా వేలు, అరచేతి ముద్రలను ఏజెన్సీ విశ్లేషించింది. పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాము. అంతేకాక ఈ "బ్లైండ్ కేసు" నిందితులను పట్టుకోవడం కోసం 5 లక్షల రివార్డును ప్రకటించాము’ అని తెలిపారు. -
‘విక్రాంత్’లో దొంగలు
న్యూఢిల్లీ: భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న తొలి విమానవాహక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ విషయంలో భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్మాణంలో ఉన్న ఈ నౌకలో దొంగలు పడ్డారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో 4 కంప్యూటర్లను ధ్వంసం చేసిన దుండగులు, వాటిలోని హార్డ్ డ్రైవ్‌లు, ప్రాసెసర్లు, ర్యామ్‌లను ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం కేరళ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. కాగా, కంప్యూటర్లు ఉన్న ప్రాంతంలో సీసీటీవీలు లేవనీ, ఇక్కడి భద్రతను ఓ ప్రైవేటు సంస్థ చూస్తోందని కేరళ డీజీపీ లోక్‌నాథ్ తెలిపారు. 2009లో కొచి్చన్ షిప్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం ప్రారంభమైంది. 2023 నాటికి ఇది భారత నేవీలో చేరనుంది. -
కొచ్చి షిప్‌యార్డ్‌లో ప్రమాదం
కొచ్చి: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)కి చెందిన ఓ నౌకలో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. సముద్ర గర్భం నుంచి ముడిచమురును బయటకు తీయడానికి ఉపయోగించే నౌకకు కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మంగళవారం మరమ్మతులు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వారంతా ఒప్పంద కార్మికులేనని భావిస్తున్నట్లు షిప్‌యార్డ్ అధికారి ఒకరు చెప్పారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ‘సాగర్ భూషణ్’∙నౌకకు మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఓఎన్జీసీ ఓ ప్రకటనలో తెలిపింది. మంటల వల్ల వచ్చిన పొగను పీల్చడం వల్లే ఐదుగురు చనిపోయి ఉంటారని భావిస్తున్నామనీ, ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారి చెప్పారు. ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా షిప్‌యార్డ్ ఎండీని కేంద్ర నౌకాయాన మంత్రి గడ్కరీ ఆదేశించారు. కేరళ సీఎం విజయన్ మృతులకు సంతాపం తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని కొచ్చిన్ షిప్‌యార్డ్ ప్రకటించింది. -
స్టాక్స్ వ్యూ
లుపిన్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,061 టార్గెట్ ధర: రూ.1,251 ఎందుకంటే: లుపిన్ కంపెనీ ఇటీవలే సిమిబియోమిక్స్ కంపెనీని కొనుగోలు చేసింది. మహిళలకు సంబంధించి బ్రాండెడ్ హెల్త్ డివిడిజన్ను మరింత శక్తివంతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే బ్యాక్టీరియల్ వెజినోసిస్ చికిత్సలో ఉపయోగించే సొలోసెక్ (సెనిడాజోల్) ఓరల్ గ్యాన్సూల్స్కు ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఆమోదం పొందింది. బ్యాక్టీరియల్ వెజినోసిస్(బీవీ)కు సింగిల్ డోస్ ఓరల్ ట్రీట్మెంట్నిచ్చే సొలోసెక్ ఔషధాన్ని వచ్చే ఏడాది జూన్ నుంచి మార్కెట్లోకి తేవాలని కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. కనీసం పదేళ్లపాటు ఈ ఔషధంపై మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. బీవీకి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మెట్రోనిడాజోల్ క్రీమ్, టినిడాజోల్ల కంటే ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా సొలోసెక్ నిలవనున్నది. సొలోసెక్ మార్కెట్లోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే కనీసం 15–20 శాతం మార్కెట్ వాటా ్జకైవసం చేసుకోగలమని కంపెనీ ధీమాగా ఉంది. అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, జపాన్, కెనడాల్లో కూడా ఈ ఔషధాన్ని అందించాలని లుపిన్ యోచిస్తోంది. ఇక ఇప్పటికే వివిధ కారణాల వల్ల షేర్ ధర బాగా తగ్గింది. కంపెనీ అమెరికా మార్కెట్‌కు చెందిన ప్రధాన వ్యాపారానికి సంబంధించి ధరల ఒత్తిడి, పోటీ తీవ్రత మరికొంత కాలం కొనసాగవచ్చు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) రెండో అర్థభాగం నుంచి కంపెనీ ఆదాయం మెరుగుపడే అవకాశాలున్నాయి. కీలకమైన కొన్ని ఔషధాలను మార్కెట్లోకి విడుదలచేయనుండడం, స్పెషాల్టీ బిజినెస్ పోర్ట్‌ఫోలియో పునర్వ్యవస్థీకరణ దీనికి ప్రధాన కారణాలు. కొచ్చిన్ షిప్‌యార్డ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.572 టార్గెట్ ధర: రూ.725 ఎందుకంటే: షిప్ బిల్డింగ్, రిపేర్ల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ మినీ రత్న కంపెనీ ఇది. ఈ రెండు రంగాల్లో ఈ కంపెనీదే అగ్రస్థానం. జాతీయ భద్రత అంశం కావడంతో మన నావికాదళ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్లు దీనికే లభిస్తాయి. నామినేషన్ ప్రాతిపదికన అధికంగా ఆర్డర్లు కూడా ఈ కంపెనీకే లభిస్తాయి. మంచి పనితీరు కొనసాగిస్తున్న అతి కొన్ని పీఎస్‌యూల్లో ఇదొకటి. గత పదేళ్లలో కంపెనీ ఆదాయం 11%, నికర లాభం 19% చొప్పున చక్రగతిన వృద్ధి చెందాయి. 2012–17 కాలంలో ఏడాదికి సగటున 16 శాతం రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) ని ఈ కంపెనీ సాధించింది. అంతర్జాతీయంగా షిప్ బిల్డింగ్ పరిశ్రమ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైనా, భారత రక్షణ రంగంలో నిర్ణయాధికారం మందగమనంగా ఉన్నప్పటికీ ఈ కంపెనీ ఈ స్థాయి వృద్ధి సాధించడం విశేషం. కంపెనీ చేతిలో రూ.2,856 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. రూ.5,400 కోట్ల ఆర్డర్లకు సంబంధించి ప్రాజెక్టుల్లో ఈ కంపెనీకి ఎల్ 1 స్టేటస్ ఉంంది. మరోవైపు రూ.11,900 కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. షిప్ బిల్డింగ్ బిజినెస్ కంటే రెండు రెట్లు లాభాలు వచ్చే షిప్ రిపేర్ విభాగంలో ఆర్డర్లు పెరుగుతున్నాయి. రూ.2,768 కోట్ల పెట్టుబడులతో కొత్తగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లలో కంపెనీ ఆదాయం 18 శాతం, ఇబిటా 14 శాతం, నికర లాభం 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. పటిష్టమైన బిజినెస్ మోడల్, అర్డర్లు బాగా ఉండడం, భారీ స్థాయిలో మరిన్ని ఆర్డర్లు రానుండడం, నిర్వహణ సామర్థ్యం బాగా ఉండడం, డివిడెండ్ల చెల్లింపు ఆరోగ్యకరంగా ఉండడం....ఇవన్నీ సానుకూలాంశాలు. -
స్టాక్స్ వ్యూ
కొచ్చిన్ షిప్‌యార్డ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.547 టార్గెట్ ధర: రూ.725 ఎందుకంటే: ఇది ప్రభుత్వ రంగ కంపెనీ. భారత షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ రంగంలో అత్యంత నిలకడగా రాణిస్తున్న, అగ్రగామి కంపెనీ కూడా ఇదే. భారత షిప్‌బిల్డింగ్ సెగ్మెంట్లో ప్రీమియర్ కంపెనీగా అవతరించింది. డిజైనింగ్, ఇంజినీరింగ్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ విభాగాల్లో మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ విభాగంలో ఈ కంపెనీ మార్కెట్ వాటా 39 శాతంగా ఉంది. సంక్లిష్టమైన నౌకలు రిపేర్లు చేయడంలో నైపుణ్యం సాధించింది. నౌకల నిర్మాణం వ్యాపారం లాభదాయకత కంటే రెండు రెట్లు లాభదాయకత అధికంగా ఉండే నౌకల రిపేర్ల వ్యాపారానికి సంబంధించిన ఆర్డర్ బుక్ పెరుగుతోంది. కంపెనీ ప్రస్తుత ఆర్డర్ బుక్ విలువ రూ.3,000 కోట్లుగా ఉండగా, మరో రూ.12,000 కోట్ల ఆర్డర్లకు బిడ్డింగ్ చేయనున్నది.. ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ (ఐఏసీ)కు సంబంధించి మూడో దశ ఆర్డర్లు ఈ కంపెనీకే దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ ఆర్డర్ల విలువ రూ.8,000 కోట్లకు మించ ఉండవచ్చని అంచనా. ఈ ఆర్డర్ల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం వరకూ కంపెనీ ఆదాయ ఆర్జన పటిష్టంగా ఉండనున్నది.అంతర్జాతీయంగా షిప్‌బిల్డింగ్ వ్యాపారం ఒడిదుడుకులమయంగా ఉన్న 2007–17 కాలంలో ఈ కంపెనీ ఆదాయం 11 శాతం, నికర లాభం 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించడం కంపెనీ పనితీరుకు అద్దం పడుతోంది. నికర రుణ భారం రూ.123 కోట్లుగా, నగదు నిల్వలు రూ.1,600 కోట్లుగా ఉన్నాయి. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.2,800 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నది. 2012–17 కాలానికి రిటర్న్ ఆన్ ఈక్విటీ 16%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 17%గా ఉన్నాయి. రూ.2,800 కోట్ల పెట్టుబడులతో అతి పెద్ద షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. రెండేళ్లలో కంపెనీ ఆదాయం 14%, ఇబిటా 13%, నికర లాభం 11% చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. ఎన్టీపీసీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.167 టార్గెట్ ధర: రూ.211 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 6 శాతం క్షీణించి రూ.10,200 కోట్లకు తగ్గింది. ఇక 2015–16 ఆర్థిక సంవత్సరం సవరించిన నికర లాభం 5 శాతం వృద్ధితో రూ.10,800 కోట్లకు పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16 శాతంగా నమోదైంది. సగటు ఇంధన వ్యయం 4 శాతం పెరిగి ఒక్కో కిలోవాట్ అవర్‌కు రూ.1.92గా ఉంది. బొగ్గుకు సంబంధించి సగటు వ్యయం 10 శాతం పెరిగినప్పటికీ, గ్యాస్ ధరలు తగ్గడం, బొగ్గు వినియోగం తగ్గించడం కలసివచ్చాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో 9.5 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 1.1 మిలియన్ టన్నులకు తగ్గాయి. కొన్ని అనుబంధ కంపెనీలు, జాయింట్ వెంచర్లు టర్న్ అరౌండ్ కావడం కంపెనీకి ప్రయోజనం కలిగించాయి. జాయింట్ వెంచర్ల నుంచి డివిడెండ్లు 25 శాతం పెరిగి రూ.163 కోట్లకు పెరిగాయి. 2015–16లో రూ.140 కోట్లుగా ఉన్న జాయింట్ వెంచర్ల నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.620 కోట్లకు పెరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీపీసీ తమిళనాడుకు రూ.140 కోట్ల నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.99 కోట్ల లాభాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్టీపీసీ తమిళనాడు టర్న్ అరౌండ్ కాగా, ఎన్టీపీసీ–సెయిల్ నికర లాభం 57 శాతం పెరిగింది. దేశీయంగా విద్యుదుత్పత్తి సంస్థల పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సగటు 79 శాతంగా ఉండగా, ఎన్టీపీసీకి చెందిన పదికి పైగా ప్లాంట్లు 85 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జాయింట్ వెంచర్ల కంపెనీల నుంచి 445 మెగావాట్ల విద్యుత్తు అదనంగా జత కానున్నది. మూడేళ్లలో ఎన్టీపీసీ కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం చొప్పున వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా పుస్తక విలువకు 1.2 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. -
ఆగస్ట్ 1న కొచ్చిన్ షిప్‌యార్డ్ ఐపీవో ఆరంభం
ధరల శ్రేణి రూ.424 – 432 ముంబై: ప్రభుత్వరంగ కొచ్చిన్ షిప్‌యార్డ్ ఐపీవో ఆగస్ట్ 1న ప్రారంభం కానుంది. 3వ తేదీతో ముగుస్తుంది. ఒక్కో షేరుకు ఆఫర్ ధరల శ్రేణిని రూ.424 – 432గా కంపెనీ ఖరారు చేసింది. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం రూ.10 ముఖ విలువ కలిగిన 1,13,28,000 షేర్లను విక్రయించనుంది. అలాగే, 2,26,56,000 షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. దీంతో ఐపీవో అనంతరం కంపెనీలో ప్రభుత్వ వాటా 75 శాతానికి తగ్గిపోతుంది. క్రిసిల్ నివేదిక ప్రకారం 2015 మార్చి నాటికి కొచ్చిన్ షిప్‌యార్డ్ ప్రభుత్వరంగంలో దేశంలోనే అతిపెద్ద నౌకానిర్మాణ కంపెనీగా ఉంది. కాగా, రానున్న ఐదేళ్ల కాలంలో నౌకానిర్మాణం, నౌకా మరమ్మతుల సామర్థ్య విస్తరణకు రూ.3,100 కోట్లు వ్యయం చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ‘‘డ్రైడాక్ కోసం రూ.1,800 కోట్లు, ఓడల మరమ్మతుల వసతుల కోసం రూ.970 కోట్లు, ప్రస్తుత సామర్థ్యాలను రానున్న ఐదేళ్ల అవసరాలకు అనుగుణంగా పెంచుకునేందుకు రూ.300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని కంపెనీ చైర్మన్, ఎండీ మధు ఎస్ నాయర్ మంగళవారం ముంబైలో మీడియాకు తెలిపారు. ఐపీవో ద్వారా సమకూరే నిధులతో 310 మీటర్ల డాక్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా భారీ నౌకా నిర్మాణానికి వీలవుతుందని నాయర్ తెలిపారు. -
ప్రభుత్వ సంస్థలపై బ్యాంకు బకాయిల బండ!
• రంగంలోకి ఎన్టీపీసీ, సెయిల్, కొచ్చిన్ షిప్‌యార్డ్ • రుణ భారం ఈక్విటీ రూపంలో బదలాయింపు • సంధానకర్తలుగా కార్యదర్శులు న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం కీలక చొరవకు శ్రీకారం చుట్టింది. ఆయా కార్పొరేట్లు చెల్లించాల్సివున్న రుణాల్లో కొంత మొత్తాన్ని ఈక్విటీగా మార్చి దానిని ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) అప్పగించాలన్నది తాజా నిర్ణయం. ఈ దిశలో ఎన్టీపీసీ, సెయిల్, కొచ్చిన్ షిప్‌యార్డ్ సంస్థలు తొలి విడతలో ముందుకొచ్చాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సోమవారం నాడు ఇక్కడ స్టీల్, విద్యుత్, షిప్పింగ్ రంగాల్లో ఒత్తిడిలో ఉన్న బకాయిల భారం గురించి చర్చ జరిగింది. ఎన్టీపీసీ, సెయిల్, కొచ్చిన్‌షిప్‌యార్డ్ చీఫ్‌లు, ప్రభుత్వ కార్యదర్శులతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ అండ్ చందాకొచర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ రజీవ్ రాషీ తదితర బ్యాంకింగ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, ఫైనాన్షియల్ సేవల శాఖ అధికారులు, పీఎంఓ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయిన వారిలో ఉన్నారు. ఈ సమావేశంలో తాజా కీలక నిర్ణయం జరిగింది. ఈ సమావేశంలో జైట్లీ ఏమన్నారంటే.. ♦ మొండిబకాయిల సమస్య పరిష్కారించే దిశలో తాజా నిర్ణయం కీలకమైనది. ♦ తాజా నిర్ణయం అమలులో సంబంధిత రంగాల కార్యదర్శులు.. ఆయా కార్పొరేట్లు -బ్యాంకులకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు. ♦ రుణాన్ని ఈక్విటీగా మార్చే ప్రక్రియలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. బకాయి పడిన సంస్థలకు సంబంధించి నియంత్రణ, బకాయిలను ఈక్విటీగా మార్చ డం, ఈ దిశలో నిపుణులైన వ్యక్తులతో కమిటీ ఏర్పాటు వంటి అంశాలు బ్యాంకింగ్ పరంగా ముఖ్యమైనవి. ♦ ఈ పక్రియ తక్షణం ప్రారంభమవుతుందని భావిస్తున్నా. కొన్ని ఆస్తులను స్వీకరించడానికి ఎవ్వరూ ముందుకురాని పరిస్థితుల్లో, కొనేవారిని సృష్టించాల్సి ఉంటుంది. టీడీఎస్ కోతలపై వేతన జీవులకు ఎస్ఎంఎస్ ఇదిలాఉండగా, త్రైమాసికంగా సోర్స్ వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించి ఆయా ఉద్యోగులకు ఎస్ఎంఎస్ అలెర్ట్ అందనుంది. దాదాపు 2.5 కోట్ల మందికి ఆదాయపు పన్ను శాఖ నుంచి తాజా సేవలు అందనున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తాజా ఈ సేవలను ప్రారంభించారు. త్వరలో నెలవారీగా కూడా ఈ సేవలను విస్తరించడం జరుగుతుందని అరుణ్‌జైట్లీ తెలిపారు. -
INS విక్రాంత్ జలప్రవేశం