ప్రభుత్వ సంస్థలపై బ్యాంకు బకాయిల బండ!
• రంగంలోకి ఎన్‌టీపీసీ, సెయిల్, కొచ్చిన్ షిప్‌యార్డ్
• రుణ భారం ఈక్విటీ రూపంలో బదలాయింపు
• సంధానకర్తలుగా కార్యదర్శులు
న్యూఢిల్లీ: ఒత్తిడిలో ఉన్న బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం కీలక చొరవకు శ్రీకారం చుట్టింది. ఆయా కార్పొరేట్లు చెల్లించాల్సివున్న రుణాల్లో కొంత మొత్తాన్ని ఈక్విటీగా మార్చి దానిని ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) అప్పగించాలన్నది తాజా నిర్ణయం. ఈ దిశలో ఎన్‌టీపీసీ, సెయిల్, కొచ్చిన్ షిప్‌యార్డ్ సంస్థలు తొలి విడతలో ముందుకొచ్చాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సోమవారం నాడు ఇక్కడ స్టీల్, విద్యుత్, షిప్పింగ్ రంగాల్లో ఒత్తిడిలో ఉన్న బకాయిల భారం గురించి చర్చ జరిగింది.
ఎన్‌టీపీసీ, సెయిల్, కొచ్చిన్‌షిప్‌యార్డ్ చీఫ్‌లు, ప్రభుత్వ కార్యదర్శులతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ అండ్ చందాకొచర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ రజీవ్ రాషీ తదితర బ్యాంకింగ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, ఫైనాన్షియల్ సేవల శాఖ అధికారులు, పీఎంఓ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయిన వారిలో ఉన్నారు. ఈ సమావేశంలో తాజా కీలక నిర్ణయం జరిగింది. ఈ సమావేశంలో జైట్లీ ఏమన్నారంటే..
♦ మొండిబకాయిల సమస్య పరిష్కారించే దిశలో తాజా నిర్ణయం కీలకమైనది.
♦ తాజా నిర్ణయం అమలులో సంబంధిత రంగాల కార్యదర్శులు.. ఆయా కార్పొరేట్లు -బ్యాంకులకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు.
♦ రుణాన్ని ఈక్విటీగా మార్చే ప్రక్రియలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. బకాయి పడిన సంస్థలకు సంబంధించి నియంత్రణ, బకాయిలను ఈక్విటీగా మార్చ డం, ఈ దిశలో నిపుణులైన వ్యక్తులతో కమిటీ ఏర్పాటు వంటి అంశాలు బ్యాంకింగ్ పరంగా ముఖ్యమైనవి.
♦ ఈ పక్రియ తక్షణం ప్రారంభమవుతుందని భావిస్తున్నా. కొన్ని ఆస్తులను స్వీకరించడానికి ఎవ్వరూ ముందుకురాని పరిస్థితుల్లో, కొనేవారిని సృష్టించాల్సి ఉంటుంది.
టీడీఎస్ కోతలపై వేతన జీవులకు ఎస్‌ఎంఎస్
ఇదిలాఉండగా, త్రైమాసికంగా సోర్స్ వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించి ఆయా ఉద్యోగులకు ఎస్‌ఎంఎస్ అలెర్ట్ అందనుంది. దాదాపు 2.5 కోట్ల మందికి ఆదాయపు పన్ను శాఖ నుంచి తాజా సేవలు అందనున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తాజా ఈ సేవలను ప్రారంభించారు. త్వరలో నెలవారీగా కూడా ఈ సేవలను విస్తరించడం జరుగుతుందని అరుణ్‌జైట్లీ తెలిపారు.