స్టాక్స్‌ వ్యూ | Stocks view | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Sep 18 2017 1:15 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

స్టాక్స్‌ వ్యూ

స్టాక్స్‌ వ్యూ

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌  కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.547      టార్గెట్‌ ధర: రూ.725
ఎందుకంటే: ఇది ప్రభుత్వ రంగ కంపెనీ. భారత షిప్‌ బిల్డింగ్, షిప్‌ రిపేర్‌ రంగంలో అత్యంత నిలకడగా రాణిస్తున్న, అగ్రగామి కంపెనీ కూడా ఇదే. భారత షిప్‌బిల్డింగ్‌ సెగ్మెంట్లో ప్రీమియర్‌ కంపెనీగా అవతరించింది. డిజైనింగ్, ఇంజినీరింగ్, ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ విభాగాల్లో మంచి పనితీరు కనబరుస్తోంది.  ఈ విభాగంలో ఈ కంపెనీ మార్కెట్‌ వాటా 39 శాతంగా ఉంది. సంక్లిష్టమైన నౌకలు రిపేర్లు చేయడంలో నైపుణ్యం సాధించింది. నౌకల నిర్మాణం వ్యాపారం లాభదాయకత కంటే రెండు రెట్లు లాభదాయకత అధికంగా ఉండే నౌకల రిపేర్ల వ్యాపారానికి సంబంధించిన ఆర్డర్‌ బుక్‌ పెరుగుతోంది. 

కంపెనీ ప్రస్తుత ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.3,000 కోట్లుగా ఉండగా, మరో రూ.12,000 కోట్ల ఆర్డర్లకు బిడ్డింగ్‌ చేయనున్నది.. ఇండియన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ (ఐఏసీ)కు సంబంధించి మూడో దశ ఆర్డర్లు ఈ కంపెనీకే దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ ఆర్డర్ల విలువ రూ.8,000 కోట్లకు మించ ఉండవచ్చని అంచనా. ఈ ఆర్డర్ల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం వరకూ కంపెనీ ఆదాయ ఆర్జన పటిష్టంగా ఉండనున్నది.అంతర్జాతీయంగా షిప్‌బిల్డింగ్‌ వ్యాపారం ఒడిదుడుకులమయంగా ఉన్న 2007–17 కాలంలో ఈ కంపెనీ ఆదాయం 11 శాతం, నికర లాభం 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించడం కంపెనీ పనితీరుకు అద్దం పడుతోంది.

నికర రుణ భారం రూ.123 కోట్లుగా, నగదు నిల్వలు రూ.1,600 కోట్లుగా ఉన్నాయి. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.2,800 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నది. 2012–17 కాలానికి రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ 16%, రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌ 17%గా ఉన్నాయి.  రూ.2,800 కోట్ల పెట్టుబడులతో అతి పెద్ద షిప్‌బిల్డింగ్, షిప్‌ రిపేర్‌ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. రెండేళ్లలో కంపెనీ ఆదాయం 14%, ఇబిటా 13%, నికర లాభం 11% చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా.

ఎన్‌టీపీసీ కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.167      టార్గెట్‌ ధర: రూ.211
ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 6 శాతం క్షీణించి రూ.10,200 కోట్లకు తగ్గింది.  ఇక 2015–16 ఆర్థిక సంవత్సరం సవరించిన నికర లాభం 5 శాతం వృద్ధితో రూ.10,800 కోట్లకు పెరిగింది. రిటర్న్‌ ఆన్‌  ఈక్విటీ 16 శాతంగా నమోదైంది. సగటు ఇంధన వ్యయం 4 శాతం పెరిగి ఒక్కో కిలోవాట్‌ అవర్‌కు రూ.1.92గా ఉంది. బొగ్గుకు సంబంధించి సగటు  వ్యయం 10 శాతం పెరిగినప్పటికీ, గ్యాస్‌ ధరలు తగ్గడం, బొగ్గు వినియోగం తగ్గించడం కలసివచ్చాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో 9.5 మిలియన్‌ టన్నులుగా ఉన్న బొగ్గు దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 1.1 మిలియన్‌ టన్నులకు తగ్గాయి.

కొన్ని అనుబంధ కంపెనీలు, జాయింట్‌ వెంచర్‌లు టర్న్‌ అరౌండ్‌ కావడం కంపెనీకి ప్రయోజనం కలిగించాయి. జాయింట్‌ వెంచర్ల నుంచి డివిడెండ్‌లు 25 శాతం పెరిగి రూ.163 కోట్లకు పెరిగాయి. 2015–16లో రూ.140 కోట్లుగా ఉన్న జాయింట్‌ వెంచర్ల నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.620 కోట్లకు పెరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌టీపీసీ తమిళనాడుకు రూ.140 కోట్ల నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.99 కోట్ల లాభాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌టీపీసీ తమిళనాడు టర్న్‌ అరౌండ్‌ కాగా, ఎన్‌టీపీసీ–సెయిల్‌ నికర లాభం 57 శాతం పెరిగింది.

దేశీయంగా విద్యుదుత్పత్తి సంస్థల పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) సగటు 79 శాతంగా ఉండగా, ఎన్‌టీపీసీకి చెందిన పదికి పైగా ప్లాంట్లు 85 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జాయింట్‌ వెంచర్ల కంపెనీల నుంచి 445 మెగావాట్ల విద్యుత్తు అదనంగా జత కానున్నది.  మూడేళ్లలో ఎన్‌టీపీసీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం చొప్పున వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా పుస్తక విలువకు 1.2 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్‌ ట్రేడవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement