ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక
రక్షణ రంగంలో మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటేలా భారత్ నిర్మించిన అత్యాధునిక విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను కొద్ది నెలల కిందట ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో ఇది చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఔటర్ హార్బర్‌లో భారీ బెర్త్‌ను ఏర్పాటు చేసేందుకు నేవీ, పోర్టు సిద్ధమవుతున్నాయి.
సాక్షి, విశాఖపట్నం : ఐఎన్‌ఎస్ విక్రాంత్.. విజయానికి, శౌర్యానికి గుర్తు. మన దేశ గౌరవానికి ప్రతీక. మన తొలి విమాన వాహక యుద్ధ నౌక. అప్పట్లో ఉన్న విక్రాంత్ కంటే మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ఈ బాహుబలి యుద్ధ నౌక భారత్ చేతిలో బ్రహ్మాస్త్రంగా చెప్పుకోవచ్చు. విక్రాంత్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్ మెషినరీ ఆపరేషన్లు, షిప్ నేవిగేషన్, ఆటోమేటిక్ సర్వైబిలిటీ సిస్టం ఏర్పాటు చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌కు అదనపు లిఫ్ట్ ఇచ్చే ఫ్లైట్ డెక్ స్కీ జంప్‌తో స్టోబార్ కాన్ఫిగరేషన్ ఏర్పాటు చేయడం వల్ల అతి తక్కువ సమయంలో టేకాఫ్‌కు వీలవుతుంది.
ఏ భాగం మొరాయించినా ఆ ప్రభావం మిగతా భాగాలపై పడదు. దీంతో ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో రెండు వేల మంది షిప్‌యార్డ్ అధికారులు, సిబ్బంది, 13 వేల మంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 42,800 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్ రన్‌వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. విక్రాంత్ నిర్మాణానికి దాదాపు రూ.20 వేల కోట్లు ఖర్చయింది.
త్వరలోనే తూర్పు నౌకాదళంలోకి..
రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్‌ఎస్ విక్రాంత్ కీలకంగా మారనుంది. విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్ర జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ దీని సొంతం.
అందుకే విక్రాంత్‌ను కీలకమైన తూర్పు నౌకాదళానికి కేటాయించాలని రక్షణ మంత్రిత్వ శాఖ ముందుగానే నిర్ణయించింది. రాత్రి సమయంలోనూ మిగ్ విమానాలు, ఇతర ఎయిర్‌క్రాఫ్ట్‌లు విక్రాంత్‌పై ల్యాండింగ్, టేకాఫ్‌లను ఇటీవలే విజయవంతంగా నిర్వహించాయి. మరోసారి కొచ్చి షిప్‌యార్డులో తుది ట్రయల్స్ నిర్వహించిన తర్వాత.. విశాఖకు విక్రాంత్ రానుంది. ఈ ఏడాది చివరిలోనైనా లేదా 2024 తొలి నాళ్లలోనైనా.. తూర్పు నౌకాదళం నుంచి రక్షణ బాధ్యతలు చేపట్టనుందని ఇటీవలే భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ స్పష్టం చేశారు.
బెర్త్ మ్యాపింగ్‌లో బిజీబిజీ
సాధారణ యుద్ధ విమానాల కంటే.. భారీగా ఉండే విక్రాంత్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ప్రత్యేక బెర్త్ అవసరమవుతుంది. ఇప్పటివరకు తూర్పు నౌకాదళంలో 105 మీటర్ల పొడవు ఉన్న యుద్ధ నౌకలే అతి పెద్దవిగా ఉన్నాయి. వీటికి రెట్టింపు పొడవుతో విక్రాంత్ తయారైంది. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తుతో విక్రాంత్ నిర్మించారు. 14 అంతస్తులున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో మొత్తం 2,300 కంపార్ట్‌మెంట్‌లున్నాయి. గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోయే విక్రాంత్‌ను విశాఖలో ఎక్కడ బెర్తింగ్ చేయాలన్న దానిపై తూర్పు నౌకాదళాధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
భారీ బెర్త్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ, తూర్పు నౌకాదళం పక్కపక్కనే ఉండటంతో ఎలాంటి భద్రతా లోపం లేకుండా.. విక్రాంత్ కోసం ప్రత్యేక బెర్త్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పోర్టు చైర్మన్ డా.అంగముత్తుతో ఇటీవలే తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమావేశమై చర్చించారు. ఔటర్ హార్బర్‌లోని ఓ బెర్త్‌ను విస్తరించి.. ప్రత్యేకంగా విక్రాంత్‌కు కేటాయించాలని భావిస్తున్నారు.
ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు, మ్యాపింగ్ సిద్ధం చేసే పనిలో నౌకాదళాధికారులు తలమునకలయ్యారు. మరో రెండు నెలల్లో దీనికి సంబంఽధించిన రూట్ మ్యాప్ సిద్ధమయ్యాక.. రక్షణ మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అనుమతులు మంజూరైన వెంటనే.. పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment