
ఉపమాక వెంకన్న కల్యాణోత్సవంలో అపచారం
టీటీడీ పవిత్ర కార్యక్రమంలో మితిమీరిన టీడీపీ పెత్తనం
టీడీపీ నేతల దుశ్చర్యపై మండిపడుతున్న భక్తులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో అశీల్ల నృత్యాలు అంబరాన్నంటాయి. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రమైన ఉపమాక వెంకన్న కల్యాణ్సోతవం కార్యక్రమంలో వెగటు పుట్టించే పాటలతో అమ్మాయిల డ్యాన్స్‌లతో అపచారానికి ఒడిగట్టారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్సులను యథేచ్ఛగా నిర్వహించారు. సాక్షాత్తూ హోం మంత్రి నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం జరుగుతుండడంతో.. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఈ రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డుచెప్పే ధైర్యం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీ పెత్తనంతో..
నక్కపల్లి మండలం ఉపమాపకలో ఆరో శతాబ్ధానికి చెందిన వెంకన్న ఆలయానికి ఘన చరిత్ర ఉంది. 2017 సంవత్సరం వరకు దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే ఈ ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే టీటీడీకి అప్పగించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, కల్యాణోత్సవాలు తిరుపతిలో మాదిరిగానే నిర్వహిస్తున్నారు.
ఈ ప్రత్యేక పర్వదినాల్లో కేవలం ఆధ్యాత్మికమైన సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఇప్పటి వరకు టీటీడీ అధికారులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత జరుగుతున్న ఈ ఉపమాక వెంకన్న కల్యాణోత్సవంలో టీడీపీ నేతల పెత్తనం పెచ్చుమీరింది. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తరువాత ఉపమాక దేవస్థానంలో తెలుగుదేశం నేతల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలున్నాయి.
టీటీడీ సంప్రదాయానికి తూట్లు..
వెంకన్న కల్యాణోత్సవ కార్యక్రమాన్ని అపవిత్రం చేసేలా టీడీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్స్‌ను ఏర్పాటు చేశారు. ఒకవైపు స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుండగా మరోవైపు ఆలయానికి ఆనుకుని వెనుక ప్రాంతంలో డీజే స్టేజ్ ఏర్పాటు చేసి అమ్మాయిలు, అబ్బాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడం గమనార్హం.
పైగా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కారణంగానే రాత్రి 9 గంటలకు పూర్తి కావాల్సిన ఎదురు సన్నాహక మహోత్సవంతో పాటు రథోత్సవం అర్థరాత్రి 12 వరకు ప్రారంభం కాలేదు. ఇక స్వామి వారి కల్యాణం అర్థరాత్రి 2 గంటల తర్వాత హోం మంత్రి అనిత వచ్చాక ప్రారంభించారు. ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమానికి టీటీడీ అధికారులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు.
కానీ ఈసారి మాత్రం కల్యాణోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఉపమాకలోనే తిష్టవేశారు. కల్యాణం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలు, ఇలా అన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించారు. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ప్రాచీన పుణ్య క్షేత్రంలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు దుమ్మెత్తి పోస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment