యువత పోరు
భవిత కోసం
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల చెల్లింపులపై మీనమేషాలు లెక్కిస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. కొన్ని త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు కళాశాలల నుంచి విద్యార్థులను వెల్లగొట్టడం, పరీక్షల సమయాల్లో హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం చేస్తున్నాయి. దీంతో పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా యువత కూడా కూటమి ప్రభుత్వం చేతిలో మరోసారి మోసపోయింది. ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి మొత్తం 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. మెగా డీఎస్సీ దగా అయిపోయింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల సహా ప్రభుత్వ నంస్థలను ప్రైవేటుబాట పట్టిస్తోంది. సచివాలయ ఉద్యోగులను అనిశ్చితి పరిస్థితుల్లోకి నెట్టేసింది. రూ.5వేలు కాదు రూ.10 వేలు ఇస్తామని వలంటీర్లలో ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేసింది. ఇక నిరుద్యోగ భృతి హామీ కూడా టీడీపీ 2014–19 పాలనలో మాదిరిగానే ఎగనామం పెట్టేసింది. ఈ హామీలను అమలుచేయాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మంగళవారం వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ బాట పడుతోంది.
జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య 4.5 లక్షలు
కొత్తగా వచ్చిన పరిశ్రమలు 0
రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు 42 వేలు
రీయింబర్స్‌మెంట్ బకాయిలు
రూ.35 కోట్లు
● 2023–24 విద్యా సంవత్సరంలో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 38,017 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రూ.29.87 కోట్లు విడుదల చేసింది.
● 2023–24 విద్యా సంవత్సరంలో 3,929 ఎస్సీ విద్యార్థులకు రూ.4.74 కోట్లు మంజూరు చేసింది.
● జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో 42 వేల మందికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ తదితర కోర్సులు చదువుతున్నారు. వీరికి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. మొత్తం రూ.35 కోట్లు బకాయిలు ఉన్నాయి.
భృతి
భూటకమేనా..!
జిల్లాలో 6,39,699 కుటుంబాల్లో దాదాపుగా 4.5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సగటున ప్రతీ నెలా నిరుద్యోగ భృతి కింద ప్రభుత్వం రూ.135 కోట్లు చెల్లించాల్సింది. 9 నెలల కూటమి పాలనలో రూ.1215 కోట్లు నిరుద్యోగులకు బకాయిపడింది.
ప్రైవేట్ కళాశాలలు వేధింపులు
విశాఖలో పలు ప్రైవేట్ ఇంజినీరింగ్, పీజీ కళాశాలలు విద్యార్థులను ఫీజు చెల్లించాలని వేధింపులకు పాల్పడుతున్నాయి. తరగతి గది నుంచి బయటకు పంపించేయడం, పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వకపోవడం వంటి ఘటన చోటుచేసుకున్నాయి. విశాఖలో కూటమి ఎంపీకి చెందిన ఓ కళాశాలలో ఫీజులు చెల్లించకపోతే హాల్ టికెట్లు ఇవ్వబోమని బెదిరించగా విద్యార్థులు ఎదురుతిరిగారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులే ఈ విధంగా ప్రవర్తించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
యువత పోరు
Comments
Please login to add a commentAdd a comment