ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె చర్చలు అసంపూర్ణం
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై రీజనల్ లేబర్ కమిషనర్(ఆర్‌ఎల్‌సీ) మొహంతి సమక్షంలో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై ఆర్‌ఎల్‌సీ మంగళవారం ఉక్కు యాజమాన్యం, కాంట్రాక్టర్ల అసోసియేషన్, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. కార్మికుల తొలగింపుపై కమిటీ వేస్తామని యాజమాన్యం ప్రతినిధులు తెలపగా పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. కార్మిక నాయకులు అందించిన వివరాలు..
తొలగింపు అంశాన్ని కార్మిక సంఘాలు ప్రస్తావించగా, కంపెనీ పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది తగ్గింపు చేపట్టామని యాజమాన్యం తెలిపింది. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఇటీవల బయోమెట్రిక్ నుంచి తొలగించిన 248 కాంట్రాక్ట్ కార్మికులను పునరుద్దరించాలని యాజమాన్యానికి ఆర్‌ఎల్‌సీ సూచించారు. పర్మినెంట్ కార్మికుల వలే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నచ్చినట్లు చేయకూడదన్నారు. దీనిపై కమిటీ ఏర్పాటు చేస్తామని యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. కార్మికుల తొలగింపు పూర్తి నిలుపుదలపై యాజమాన్యం హామీ ఇవ్వకపోవడంతో తమ పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు ఆర్‌ఎల్‌సీకు రాతపూర్వకంగా తెలిపారు. సమావేశంలో యాజమాన్యం తరపున జీఎం ఎం.మధుసూదనరావు, ఖర్, వైహెచ్ శంకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు కె.ఎం.శ్రీనివాస్, జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, మంత్రి రవి, కె.వంశీకృష్ణ, జి.సత్యారావు, టి.గుర్నాథ్, జి.అప్పన్న, యు.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment