చారిత్రిక యుద్ధ నౌకను తుక్కుగా అమ్మేస్తున్న సర్కారు
ఒకప్పుడు భారతీయ నౌకాదళానికే తలమానికంగా ఉన్న మొట్టమొదటి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ ఎస్ విక్రాంత్ ను భారత ప్రభుత్వం తుక్కు కింద అమ్మేస్తోంది. 1971 యుద్ధంలో అత్యంత కీలక పాత్ర పోషించి, తూర్పు పాకిస్తాన్ ను దిగ్బంధనం చేసి, భారత్ విజయానికి బాటలు వేసిన ఐఎన్ ఎస్ విక్రాంత్ ఘన చరిత్ర దృష్ట్యా దాన్ని కనీసం ఒక మ్యూజియంలా మార్చాలని కొందరు చేసిన ప్రయత్నాలను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ అరవై కోట్లకు తుక్కుగా అమ్మేయాలని నిర్ణయించింది.
15000 టన్నుల బరువున్న ఐఎన్ ఎస్ విక్రాంత్ ను 1957 లో ఇంగ్లండ్ నుంచి భారత నౌకాదళం కొనుగోలు చేసింది. ఇది చాలా కాలం భారత నౌకాదళానికి ఎనలేని సేవలందించింది. దీని నుంచి విమానాలు టేకాఫ్ చేయవచ్చు. శత్రువులపై దాడి చేసి మళ్లీ తిరిగి లాండ్ కావచ్చు. అంత విశాలమైన నౌక ఇది. అయితే 1997 లో ఈ చరిత్రాత్మక యుద్ధనౌకకు కాలం చెల్లిందని నౌకాదళం ప్రకటించింది. ఆ తరువాత నుంచీ దీన్ని తుక్కుగా అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వారం ఒక షిప్ బ్రేకింగ్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
అయితే సామాజిక కార్యకర్త పైన్ గావ్ కర్ దీన్ని మ్యూజియంగా మార్చాలని, తరువాతి తరాలకు దీని ఘనచరిత్రను, పోరాట వారసత్వాన్ని ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. కానీ దీని నిర్వహణ భారాన్ని తాము మోయలేమని మహారాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో శత్రువును తుక్కు తుక్కు చేసిన ఈ చారిత్రిక యుద్ధనౌక ఇప్పుడు తుక్కుగా మారిపోనుంది.