సింగరేణిలో దొంగలు | thieves in singareni | Sakshi
Sakshi News home page

సింగరేణిలో దొంగలు

Published Fri, Oct 14 2016 8:47 AM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM

thieves in singareni

సంస్థలో దళారుల హవా
సంస్థ ఆస్తులకు కరువైన రక్షణ
లక్షల సొమ్ము దొంగలపాలు
 
మంచిర్యాల సిటీ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ దళారులకు అక్షయ పాత్రగా నిలిచింది. సంబంధిత శాఖలకు చెందిన పలువురి కక్కుర్తితో సంస్థ విలువైన ఆస్తులు దోచుకునే వారికి అండగా అయ్యింది. కార్మికులు చెమటోడ్చి సంపాదించిన ఆస్తులను చెమటచుక్క రాల్చకుండానే దళారులు దోచేసుకుంటున్నారనే ఆరోపణలు కార్మిక వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
 
ఇనుము, రాగి, బెల్టును అమ్ముకొని సొమ్ము చేసుకోవడంతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు సింగరేణి ప్రాంతాల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అంటున్న యాజమాన్యం ఆ నినాదాన్ని కచ్చితంగా అమలు చేస్తే సంస్థ మరిన్ని లాభాలు గడించి కార్మికుల భవిష్యత్తుకు మరిన్ని బాటలు వేసేది. దొంగలతో కక్కుర్తి పడుతున్న కొందరి అధికారుల తీరు, సంస్థ ఆస్తులను కాపాడాలనే తపన ఉన్న రక్షణ సిబ్బందికి ఇబ్బందిగా తయారైందనే ఆరోపణలు రక్షణ సిబ్బంది నుంచే వ్యక్తం అవుతున్నాయి.
 
రూ.250కి కొంటూ.. రూ.500లకు అమ్ముతూ..
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి సహకరించే భారీ యంత్రాలకు రాగి కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ కేబుళ్లు అధిక బరువు, నాణ్యతగల రాగితో నిర్మాణమవుతాయి.
 
రెండు ఫీట్ల పొడవున్న కేబుల్‌లో కిలోపైబడి రాగి ఉంటుంది. సెలవు రోజులతోపాటు, మరమ్మతు పేరిట యంత్రాలు ఆగిన సమయంలో, ఆపరేటర్ విరామం సమయం దొంగలకు అనుకూలిస్తుంది. కాలం దాటిన కేబుల్‌ను సైతం గని ఆవరణలో రక్షణ లేకుండానే వదిలేస్తారు. రన్నింగ్ కేబుల్‌తోపాటు, కాలం దాటిన కేబుల్‌ను దొంగలు ఎత్తుకెళ్లి కేబుల్‌ను కాల్చివేస్తారు.
 
దీంతో కేబుల్‌లో ఉన్న రాగి బయటకు వస్తుంది. ఈ విధంగా లభించిన రాగిని దొంగలు కిలో రూ.250 చొప్పున దళారులకు అమ్ముతారు. దళారులు హైదరాబాద్‌లోని బాలానగర్‌లో కిలో రూ.500లకు అమ్ముకుంటారు. కరిగించని రాగిని మాత్రమే ఎలాంటి రశీదు లేకుండా బాలానగర్‌లో మాత్రమే కొంటారు. కరిగించని రాగిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. దళారులు కనీసం నెలలో పది సార్లు అయినా హైదరాబాద్‌లో అమ్ముతారు. ఈ విధంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.


సైజులుగా కత్తిరించి.. బెల్టులుగా విక్రయించి..
ఉపరితల, భూగర్భ గనులతోపాటు సీఎస్‌పీలలో బొగ్గును బంకర్లలోకి తరలించడానికి బెల్టును ఉపయోగిస్తారు. బెల్టు ఒక ఇంచు మందం, రెండున్నర ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఈ బెల్టును దొంగిలించాలంటే నైపుణ్యం గల మూటాతోనే సాధ్యమవుతుంది. దొంగిలించే సమయంలో పట్టుబడిన వారి కోసం కేసు పూర్తయ్యే వరకు దళారులే అన్ని రకాల ఖర్చును భరిస్తారు.
 
దొంగల వద్ద ఒక ఫీటుకు రూ.250 దళారులు కొంటారు. వారు కొనుగోలు చేసిన బెల్టును తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులోని కొందరు బియ్యం మిల్లుల యజమానులు ఒక ఫీటుకు రూ.వెయ్యి వెచ్చించి కొంటారు. కొనుగోలు చేసేవారు ఇచ్చిన ఆర్డరు ప్రకారం బెల్టును సైజులుగా కత్తిరించి ఎంపక చేసిన పలు ట్రాన్సుపోర్టుల్లో గోనె సంచుల్లో దాచి పాలకొల్లుకు తరలిస్తారు. పాలకొల్లులో కొనుగోలు చేసిన వారు నేరుగా దళారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేస్తారు. ట్రాన్సుపోర్టు వారికి రూ.వెయ్యి ఇస్తే చాలు పాలకొల్లుకు బెల్టు వెలుతుంది.
 
 కాసులు కురిపిస్తున్న ఇనుము..
 బొగ్గు ఉత్పత్తికి ఉపయోగించే ఇనుప సామగ్రి దొంగలకు కాసులు కురిపిస్తోంది. దొంగలు తస్కరించిన ఇనుమును బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల ప్రాంతాల్లో కొందరు దళారులు కిలోకు రూ.10 చొప్పున కొంటారు. కొనుగోలు చేసిన వారు హైదరాబాద్‌లో కిలోకు రూ.15 చొప్పున అమ్ముకుంటారు. నెలకు ఈ ప్రాంతాల నుంచి సుమారుగా పది లారీల ఇనుమును అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
 
 రక్షణ ఏదీ..!
 సింగరేణి ఆస్తులను రక్షించడానికి సంస్థ ఏర్పాటు చేసుకున్న ఎస్‌అండ్‌పీసీతోపాటు సీఐఎస్‌ఎఫ్ కేంద్ర బలగాలు ఉన్నాయి. ఎస్‌అండ్‌పీసీ సుమారు 2 వేల మంది సిబ్బంది ఉండగా, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది 800 మంది ఉన్నారు. ఎస్‌అండ్‌పీసీ సిబ్బందికి నెలకు సుమారు రూ.6 కోట్లు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి ప్రతినెలా సుమారు రూ.2.5 కోట్లు వేతనాలను చెల్లిస్తోంది యాజమాన్యం.
 
 దొంగలను ఎదుర్కోడానికి కొందరు సీఐఎస్‌ఎఫ్, ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ వారు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చేరిన సందర్భాలున్నాయి. కింది స్థాయిలో కొందరు సింగరేణి సిబ్బంది సహకరించడంతోనే దొంగలు సులువుగా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు కార్మిక వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement