భవనం సన్‌సైడ్ మీదినుంచి దూకుతున్న ప్రేమ్ (వృత్తంలో)
సాక్షి, బన్సీలాల్‌పేట్: విధి ఒక విష వలయం. విషాద గాథలకు అది నిలయం. ఆ నలుగురు అమాయకులు బలి కావడం కాల వైచిత్రి. తామొకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్నట్లు మృత్యువాత పడ్డారు. బుధవారం తెల్లవారుజామున న్యూ బోయగూడలోని స్క్రాబ్ గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది బిహార్ వలస కార్మికులు సజీవ దహనమైన విషయం విదితమే. వీరిలో నలుగురు అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు వదల డంతో కుటుంబీకులను తీవ్ర విషాదానికి గురి చేసింది. మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
స్నేహితులను కలిసేందుకు వచ్చి..
స్క్రాబ్ గోదాంలో అనేక మంది పని చేస్తున్నా.. 8 మంది మాత్రమే గోదాం పైఅంతస్తులో రాత్రిపూట నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో నగరంలోని అంబర్‌పేటలో పని చేస్తూ అక్కడే నివాసం ఉండే గొల్లుతో పాటు మరో ముగ్గురు తమ మిత్రులను కలిసేందుకు మంగళవారం రాత్రి న్యూ బోయగూడలోని శ్రావణ్ ట్రేడర్స్ స్క్రాబ్ గోదాంనకు వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. రాత్రి పొద్దుపోవడంతో వారితో పాటు ఈ నలుగురూ అక్కడే నిద్రించారు. ఆ నిద్రే వారి పాలిట శాపంగా మారింది. శాశ్వత నిద్రకు చేరువచేసింది.
ప్రేమ్ మాత్రం.. ప్రమాద సమయంలో కిటికీలోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం ప్రభావంతో 3.50 గంటలకు సిలిండర్ పేలగా.. దాదాపు ఆరున్నర నిమిషాల తర్వాత అతడు భవనం సన్‌సైడ్ మీదికి దూకాడు. సిలిండర్ పేలుడు ధాటికి భవనం సమీపంలో ఉన్న ఓ శునకం గాయపడినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.
వైద్యుల పర్యవేక్షణలో ప్రేమ్..
అగ్ని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రేమ్‌కు గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని శరీరంపై అయిన పది శాతం కాలిన గాయాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచే అతను సాధారణ పరిస్థితుల్లోనే ఉన్నాడని చెబుతున్నారు. వేడి పొగ పీల్చి ఉండటంతో దాని ప్రభావం అతని ఊపిరితిత్తుల లోపలి భాగంలో ఇన్‌ఫెక్షన్ రూపంలో ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇది తెలియాలంటే కనీసం మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆపై పరీక్షలు చేయాలని వివరించారు.
ఆప్యాయంగా.. ప్రేమగా..
వేర్వేరు చోట పని చేస్తున్నా వీరంతా ఆప్యాయంగా, ప్రేమగా మెలిగే వారు. సెలవులు, పండగలతో పాటు వీలున్నప్పుడల్లా కలుసుకునేవారు. మృత్యువు వీరి బంధాన్ని విడదీసింది. మిత్రులందరిని ఒకేసారి తీసుకెళ్లింది. ఈ దుర్ఘటన కార్మికులకు తీరని వేదనను మిగిల్చింది.
ఏప్రిల్‌లో వివాహం.. అంతలోనే విషాదం..
వచ్చే నెల ఏప్రిల్‌లో గొల్లు విహహం జరగాల్సి ఉంది. దీంతో అతను సొంతూరు వెళ్లేందుకు రైల్వే టికెట్ కూడా బుక్ చేసుకున్నాడని, ఇంతలోనే మృత్యువు కబళించిందని స్నేహితులు విలపిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే ఉండి ఉదయం రావాలని మృతుని బంధువు చెప్పడంతో నిద్రించి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
కన్నీటి సుడుల మధ్య..
గాంధీ ఆస్పత్రి: న్యూ బోయగూడలో స్క్రాప్ దుకాణంలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 11 మంది బిహార్ వలస కార్మికుల మృతదేహాలను బంధువుల కన్నీటి సుడుల మధ్య గురువారం పాట్నాకు తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు పంపించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ దగ్గరుండి పర్యవేక్షించారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో బుధవారమే పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేశారు. ఎంబామింగ్ చేసి ఫ్రీజర్‌లో భద్రపరిచారు.
వీటిని రెండు విడతలుగా అంబులెన్స్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. కార్గో విమానాల్లో పాట్నాకు తరలించారు. ఉదయం 8 గంటలకు మొదటి విమానంలో ఆరు, మధ్యాహ్నం 2 గంటలకు రెండో విమానంలో అయిదు మృతదేహాలను తరలించారు. మృతుల బంధువులు కొందరు వీటితో వెళ్లారు. పాట్నా విమానాశ్రయం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో మృతదేహాలకు స్వస్థలాలకు పంపారు. ప్రమాదానికి కారణాలు కనిపెట్టడంతో పాటు ఇతర ఆధారాల సేకరణ కోసం గురువారం ఘటనాస్థలిలో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని నమూనాలు సేకరించామని వాటి విశ్లేషణ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని ఓ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment