సాక్షి, ముంబై: 1972లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో విశేష సేవలు అందించిన ‘ఐఎన్‌ఎస్-విక్రాంత్’ యుద్ధ నౌక వేలానికి మార్గం సుగమమైంది. ఈ నౌకను కాపాడుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. నౌకను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొన్ని సామాజిక సేవాసంస్థలు కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వ్యాజ్యాన్ని కొట్టిపారేసింది. కోర్టులో చుక్కెదురు కావడంతో ఇక ఆ నౌకను వేలం వేయడం ఖాయమని తేలిపోయింది.
ఈ నెల 29న వేలం పాటకు సన్నాహాలు చేస్తున్నారు. నేవీ శాఖ విక్రాంత్ సేవలను 1997లో నిలిపివేసింది. అప్పటి నుంచి బందరులో అలాగే నిలిచి ఉంది. దీని కారణంగా ఇతర నౌకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో దీన్ని ఇక్కడి నుంచి స్థలాంతరం చేయాలని పోర్టు ట్రస్టు ప్రభుత్వానికి సూచించింది. కానీ ప్రత్యామ్నాయ స్థలం దొరక్కపోవడంతో గాలికే వదిలేసింది. చివరకు మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. కానీ, అందుకయ్యే వ్యయాన్ని భరించడం తమకు సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అప్పటికే దాని నిర్వహణ, భద్రతకు రూ.22 కోట్లు ఖర్చుచేసింది.
దీంతో ఈ నౌకను వేలం ద్వారా తుక్కుసామాను కింద విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. కాగా విక్రాంత్‌ను కాపాడుకునేందుకు సామాజిక సంస్థలు, విద్యార్థులు విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. చివరకు కోర్టును ఆశ్రయించి పిల్ దాఖలు చేశారు. అయినప్పటికీ కోర్టులో కూడా చుక్కెదురైంది. ప్రస్తుతం విక్రాంత్ నౌక వయసు 70 సంవత్సరాలు. భద్రత దృష్ట్యా దీన్ని వేలం వేయడమే ఉత్తమమని ప్రభుత్వం భావించిన విధంగానే కోర్టు నుంచి తీర్పు రావడంతో మార్గం సుగమమైంది.
విక్రాంత్.. ఇక ‘తుక్కు’!
Published Sat, Jan 25 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement