Bombay Hc Allows Cutting of 22k Trees For Bullet Train Project With Conditions - Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం.. 22 వేల చెట్ల నరికివేతకు హైకోర్టు అనుమతి

Published Fri, Dec 9 2022 5:37 PM | Last Updated on Fri, Dec 9 2022 7:54 PM

Bombay Hc Allows Cutting of 22k Trees For Bullet Train Project With Conditions - Sakshi

ముంబై: మహారాష్ట్రలో చేపడుతున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 22 వేల చెట్లను నరికేందుకు బాంబే హైకోర్టు శుక్రవారం అనుమతించింది. ముంబై- అహ్మదాబాద్‌ మధ్య నడవున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం ముంబైతోపాటు పొరుగున్న ఉన్న పాల్ఘర్‌, థానే జిల్లాల్లో విస్తరించి ఉన్న 22,000 మడ చెట్లను నరికేందుకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌కు(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) అనుమతిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది..

ఈమేరకు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అభయ్ అహుజాతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే షరతులు వర్తిస్తాయని పేర్కొంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ మంజూరు చేసిన అనుమతులలో పేర్కొన్న నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. 

కాగా ముంబై, పాల్ఘడ్‌, థానే జిల్లాల్లోని 50,000కు పైగా మడ చెట్లను నరికివేయడం కోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కోరిన అనుమతిని 2018లో కో-ఆర్డినేట్‌ బెంచ్‌ తీరస్కరించింది. ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ కోసం నరికివేత అవసరమైతే అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. దీంతో ఎన్‌ఎచ్‌ఆర్‌ఎస్‌సీఎల్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.
చదవండి: ఐదేళ్లలో 36 సార్లు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఖర్చు ఎంతో తెలుసా?

ప్రాజెక్టు నిర్మాణం కోసం నరికివేయాల్సిన మడ చెట్ల సంఖ్యలను 50,000 నుంచి 20,000 వరకు తగ్గించామని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌సిఎల్ తరపున న్యాయవాది ప్రహ్లాద్ పరాంజపే కోర్టుకు తెలిపారు. అంతేగాక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని అనుమతులు పొందామని.. దీనికి తోడు నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్లు ఎక్కువ మొక్కలు నాటుతామని హామీ ఇచ్చారు.

మడ అడవులకు సమీపంలో ఉన్న రెండు ప్లాట్‌ఫారమ్‌లను కొద్దిగా దూరంగా మార్చాలని, దీనివల్ల  నరికివేసే మడ చెట్ల సంఖ్య తగ్గుతుందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ సూచించాయని పేర్కొన్నారు.  ఇందుకు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌సిఎల్ అంగీకరించిందని, దీంతో చెట్ల సంఖ్య 53,467 నుండి 22,000కి తగ్గిందని తెలిపారు.

బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం భారీ సంఖ్యలో చెట్లను నరకడంపై బాంబే ఎన్విరాన్‌మెంటల్ యాక్షన్ గ్రూప్ అనే  ఎన్జీవో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిషేధిత ప్రాంతంలో ఎలాంటి పేలుడు కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని కోర్టును కోరింది. అలాగే చెట్లు నరకడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయలేదని పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుధీర్భంగా ఇరు వార్గల వాదనలు విన్న ధర్మాసనం.. డిసెంబర్‌ 1న రిజర్వ్‌ చేసిన తీర్పును శుక్రవారం వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement