‘విక్రాంత్’ త్వరలో కనుమరుగు! | Ten reasons why India should preserve INS Vikrant | Sakshi
Sakshi News home page

‘విక్రాంత్’ త్వరలో కనుమరుగు!

Published Thu, Dec 5 2013 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Ten reasons why India should preserve INS Vikrant

సాక్షి, ముంబై: ఐఎన్‌ఎస్ విక్రాంత్! యుద్ధ నౌకగా భారత నావికా దళంలో తనదైన ముద్రవేసింది. దాదాపు 40 ఏళ్లపాటు శత్రువుల గుండెల్లో దడ పుట్టించిందనేది చారిత్రక సత్యం. 1971 నాటి భారత్-పాక్ యుద్ధంలో అత్యంత సమర్థవంతమైన సేవలందించిన ఈ నౌక ప్రస్తుతం కాలం తీరిన వస్తువుల జాబితాలో చేరిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే త్వరలో ఇది చెత్తసామానులో కలిసిపోనుంది. నిర్వహణ భారాన్ని భరించలేకనే ప్రభుత్వం విక్రాంత్‌ను వదిలించుకోవాలని నిర్ణయించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిని వేలం వేయాలని సర్కారు సంకల్పించిందని పేర్కొన్నా యి. విక్రాంత్ నౌకను శాశ్వతంగా జాతీయ సంగ్రాహాలయం (మ్యూజియం)గా తీర్చిదిద్దితే బాగుం టుందంటూ నౌకాదళం ఇచ్చిన సూచనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.
 
నిర్వహణ భారం పెరిగిపోయిందనే సాకు చూపుతూ విక్రయానికి సిద్ధపడింది. ఇందులో 50 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ నౌక  నానాటికీ శిథిలమవుతోంది. మరోచోటికి తరలించాలంటే అందుకోసం ఇంజిన్‌కు మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. ఇది భారీ వ్యయంతో కూడుకున్న పని. అంతేకాకుండా రెండు సంవత్సరాలుగా ఈ నౌకను బందరులో లంగరు వేసి నిలిపి ఉంచడంవల్ల రాకపోకలు సాగించే వాణిజ్య, చమురు తదితర నౌకలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1961 మార్చి నాలుగో తేదీన ఈ నౌక భారత నావిక దళం అధీనంలోకి వచ్చింది. విమానాలు రాకపోకలు సాగించే మొదటి నౌక ఘనతను దక్కించుకుంది. 1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధంలో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. 1997, జనవరి నుంచి దీనిని వినియోగించడం లేదు. వేలం పాటలో ఈ నౌకను దక్కించుకున్న తరువాత సర్వహక్కులు దాని యజమానికే ఉంటాయి.
 
అందువల్ల దీనిని ముక్కలు  చేస్తారా? లేక మ్యూజియం మాదిరిగా ఉంచుతారా? అనేది కొనుగోలుదారుడిపై ఆధారపడి ఉంటుందని నౌకాదళ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఈ యుద్ధ నౌకను శాశ్వతంగా మ్యూజియంగా ఉంచాలంటే అందులో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అందుకు రూ.75 కోట్లు ఖర్చవుతాయని రెండేళ్ల కిందట అంచనావేశారు. అయితే రాష్ట్రప్రభుత్వం ఉదాసీనత కారణంగా ఇప్పుడది రూ.500 కోట్లకు చేరుకుంది. దీన్ని మ్యూజియంగా తీర్చి దిద్ధేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు కోట్లు నిధులు మాత్రమే కేటాయించింది. ముంబైకి బదులు కొంకణ్ తీర ప్రాంతంలో నిలిపి ఉంచినట్టయితే పర్యాటకులు ఎక్కువసంఖ్యలో వచ్చే అవకాశముంటుంది. ఈ నెల 15వ తేదీలోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని నౌకాదళవర్గాలు వెల్లడించాయి.

 సర్కారు విఫలమైంది: ఉద్ధవ్
 ముంబై: కాలం చెల్లిన ఐఎన్‌ఎస్ విక్రాంత నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ శివసేన విమర్శించింది. దీనిని మ్యూజియంగా మార్చేందుకు రూ. 75 కోట్లు సరిపోతాయని, అయితే ఆ మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించలేదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ...పార్టీ అధికార పత్రిక సామ్నాలో గురువారం రాసిన సంపాదకీయంలో పేర్కొన్నారు. దివంగత నేత బాల్‌ఠాక్రే సైతం విక్రాంతను మ్యూజియంగా మార్చాలంటూ డిమాండ్ చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆవిధంగా చేస్తే అది యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, వారు కూడా దేశరక్షణలో భాగస్వాములయ్యేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నట్టు ఉద్ధవ్ గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement