‘విక్రాంత్’ వేలం
సాక్షి, ముంబై: ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను వేలం వేయనున్నారు. ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియకు నౌకాదళం తుది మెరుగులు దిద్దుతోంది. భారత ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఎంఎస్‌టీసీ ఇండియా అనే సంస్థ ద్వారా ఈ ప్రక్రియ జరగనుంది. వేలం పాటలో పాల్గొనే సంస్థలు విక్రాంత్ నౌకను పరిశీలించేందుకు విధించిన తుది గడువు శనివారంతో ముగిసిపోయింది. దీంతో ఈ నెల 18వ తేదీన ఎలక్ట్రానిక్ ద్వారా వేలం పాట పాడతారు.అత్యధికంగా వేలం పలికిన సంస్థకు ఈ నౌకను అప్పగిస్తారు. వేలంపాటలో పాలుపంచుకునే సంస్థ లు డిపాజిట్ రూపంలో రూ. మూడు కోట్లు చెల్లిం చాల్సి ఉంటుంది.
ఈ మొత్తాన్ని ఈ నెల 17వ తేదీ సాయంత్రంలోగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నౌక మొత్తం బరువు 15 వేల టన్నులకుపైనే. గత నాలుగు దశాబ్దాలుగా అందులో భద్రపర్చిన వస్తువులు, ఇతర కలప, ప్లాస్టిక్ సామగ్రిని బయటకు తీసిన తరువాత అసలు ఉక్కు ఎంత బరువు ఎంత ఉం టుందనే దానిపైనే ఆధారపడి వేలంపాట జరుగుతుంది. వీటన్నింటినీ తొలగించిన తరువాత ఈ నౌక నాలుగు నుంచి ఎనిమిది వేల టన్నుల వరకు బరువు ఉండొచ ్చనేది నిపుణుల అంచనా. వేలానికి ముందు రూ.మూడు కోట్లు డిపాజిట్ డబ్బులు చెల్లించాలి... ఈ ప్రకారం ఐదు రేట్లు ఎక్కువ అంటే దాదాపు రూ.15 కోట్లు వేలం రూపంలో దక్కొచ్చనేది మరికొందరి అంచనా. ప్రస్తుతం ఉక్కుకు పలుకుతున్న ధరను బట్టి ప్రతి టన్నుకు కనీసం రూ.400 డాలర్ల చొప్పున వేలం పాట పాడాలి. అయితే అందులో అనేక టన్నుల సామగ్రి ఉక్కు కోవలోకి రాకపోవడంతో వేలంలో ఎంతమేర ఆదాయం వస్తుందనేది అందులో పాల్గొనేవారిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వివిధ సేవాసంస్థలు, విద్యార్థులు, బీఎంసీ, తాజాగా డబ్బావాలాలు కూడా విక్రాం త్‌ను కాపాడేందుకు విరాళాలను సేకరిస్తున్నారు. అయితే వేలాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం ఎవరూ చేపట్టడం లేదు.