సాక్షి, ముంబై: వేలం పాటలో అమ్ముడైన ఐఎన్‌ఎస్-విక్రాంత్ యుద్ధనౌకకు తుది వీడ్కోలు పలికేందుకు ముంబైలో నేవీ దళం భారీగా సన్నాహాలు చేస్తోంది. ఈ నౌక అందించిన సేవలు చిరస్మరణీయం కావడంతో భారీ ఏర్పాట్ల మధ్య సాగనంపాలని సిబ్బంది నిర్ణయించారు. కాలం చెల్లిన విక్రాంత్‌ను రూ.63 కోట్లకు కొనుగోలు చేసిన ఐబీ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 20 రోజుల్లోపు ముంబై బందర్ నుంచి భావ్‌నగర్‌కు తరలించనుంది. ఆ తర్వాత దీన్ని ముక్కలుముక్కలుగా చేయనుంది. ఈ నౌక అందించిన సేవలు ప్రజల్లో చిరస్మరణీయంగా ఉండిపోవాలనే ఉద్ధేశంతో దీని స్థానంలో మరో విక్రాంత్ యుద్ధనౌకను ప్రవేశపెట్టాలని రక్షణ శాఖ భావించింది.
ప్రస్తుతం ఈ యుద్ధనౌకను కొచ్చిన్ షిప్ యార్డులో తయారుచేస్తోంది. 2018 సంవత్సరంలో దీని సేవలు అందుబాటులోకి రానున్నాయని నేవీ వర్గాలు వెల్లడించాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఈ యుద్ధనౌక విక్రాంత్ కంటే కొంత పొడవు, వెడల్పు ఎక్కువే ఉంటుంది. అత్యాధునిక ఆయుధాలు, యుద్ధం కోసం అవసరమయ్యే సామగ్రి నిల్వ చేసేందుకు తగిన స్థలం ఉండనుంది. 12 మికోయాన్, మిగ్-29, ఎనిమిది తేజస్ హెలికాప్టర్లు, 10 కొమావ్ వెస్ట్‌ల్యాండ్ సోకింగ్ హెలికాప్టర్, ధ్రువ హెలికాప్టర్లు పార్కింగ్ చేసేందుకు డెక్‌పై వీలుంటుందని నేవీ దళ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాత విక్రాంత్ లేని లోటును నాలుగేళ్లలో అందుబాటులోకి రానున్న కొత్త యుద్ధనౌక తీర్చనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐఎన్‌ఎస్-విక్రాంత్ వీడ్కోలుకు భారీ ఏర్పాట్లు
Published Thu, Apr 10 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement