కెనడా పౌరుడిని ఎందుకు వెంట తీసుకెళ్లినట్టు? | Divya Spandana Slams PM Modi And Asks Why Modi Take Canadian Citizen On INS Sumithra | Sakshi
Sakshi News home page

కెనడా పౌరుడిని వెంట తీసుకెళ్లడం కరెక్టేనా?

Published Fri, May 10 2019 8:55 AM | Last Updated on Fri, May 10 2019 8:56 AM

Divya Spandana Slams PM Modi And Asks Why Modi Take Canadian Citizen On INS Sumithra - Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరిన క్రమంలో బీజేపీ- కాంగ్రెస్‌ పార్టీలు విమర్శలు- ప్రతివిమర్శలతో యుద్ధానికి దిగుతున్నాయి. దివంగత నేత రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను గాంధీ కుటుంబం సొంత ట్యాక్సీలా వాడుకుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ నేతలు కూడా రాజీవ్‌ గాంధీతో పాటు నెహ్రూపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్‌ నేతలు కూడా దీటుగా బదులిస్తున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రమ్య(దివ్యా స్పందన) ట్విటర్‌ వేదికగా నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కెనడా పౌరసత్వ వివాదాన్ని ప్రస్తావిస్తూ... ‘ నరేంద్ర మోదీ కెనడా పౌరుడైన అక్షయ్‌కుమార్‌ను ఐఎన్‌ఎస్‌ సుమిత్రలో విహారానికి తీసుకువెళ్లారు. ఇది సరైందేనా? ఈ వివాదం గురించి గతంలో వచ్చిన ఆర్టికల్‌ చూడండి’ అంటూ ఓ వార్తకు సంబంధించిన లింక్‌ను తన ట్వీట్‌కు జత చేశారు. కాగా ఐఎన్‌ఎస్‌ విరాట్‌లో ప్రయాణించిన సమయంలో రాజీవ్‌ గాంధీతో పాటు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సహా ఇద్దరు అధికారులు మాత్రమే వారి వెంట ఉన్నారని రిటైర్డ్‌ వైస్‌ అడ్మిరల్‌ వినోద్‌ పస్రిచా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక రమ్య ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘ ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ-2016కు అక్షయ్‌, కంగనాలను అప్పటి రాష్ట్రపతి, రక్షణ మంత్రి ఆహ్వానించారు. వారిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ప్రధాని మోదీ కూడా ఒక అతిథిలాగే వెళ్లారు’ అంటూ కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం.. ‘ అవును ఏ పార్టీ నాయకులైనా, ప్రధానులైనా సరే విదేశీ పౌరులను ఇలా మన యుద్ధనౌకల్లో ప్రయాణించేందుకు వీలు కల్పించడం సరికాదు’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement