రవిశంకర్ ఇంటి మేడపై భద్రంగా ద్విచక్ర వాహనాలు
సాక్షి,డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కానీ, విశాఖ నగరంలోని రెడ్డి కంచరపాలెం వాసి బసవ రవిశంకర్‌రెడ్డికి మాత్రం చాలా అభిరుచులున్నాయి. వాటన్నింటినీ పట్టుదలతో సాధించుకున్న ఘనత ఆయనది. రవిశంకర్‌రెడ్డి విదేశీ కాయిన్స్, కరెన్సీతో పాటు పురాతన వస్తువులను కూడా భద్రపరచడంలో దిట్ట. 1957 నుంచి భారతదేశంలో వాడే ద్విచక్రవాహనాలు ఆయన వద్ద ఉన్నాయి.
అరుదైన భారతీయ నాణాలు, నోట్లను సేకరించడమే కాకుండా 122 దేశాల విదేశీ కరెన్సీ, డాలర్లతో పాటు 67 దేశాల స్టాంపులు సేకరించారు రవి. చదివింది డిప్లమో అయినా తన మెదడుకు పదునుపెట్టి కువైట్, అబుదబీ దేశాల్లో పనిచేసిన అనుభవంతో తయారు చేసిన రిమోట్‌తో అర కిలోమీటరు దూరం నుంచే ఇంట్లో లైట్లు వేయడం ఆపడం చేస్తుంటారు. ఇది ఆయన సొంతంగా తయారు చేసుకున్నదే. 1957 నుంచి 27 ద్విచక్రవాహనాలు జావా, లాంబ్రెట్టా, మినీ రాజ్‌దూత్, ఏజీడీ ఇలా పాత వాహనాలను సేకరించి భద్రపరిచారు. 1990లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో వంద మీటర్ల ఎత్తు, 32 టన్నుల బరువును ఉపయోగించి రెండు అతిపెద్ద క్రేన్ నమూనాలు(ఎలక్ట్రిక్ ఓవర్ హెడ్ ట్రావెల్ క్రేన్, రష్యన్ క్రేన్) తయారు చేశారు. ఈ రెండు క్రేన్‌లను మ్యూజియంకు అందజేశారు.
తన ఇంటి గేట్‌ను రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఆపరేటింగ్ చేయడం, రిమోట్ లైట్ సిస్టమ్, జీరో పవర్ కన్జంప్షన్‌తో ఆటోమేటిక్ ఓవర్ హెడ్, డబుల్ షీటర్ సైకిల్ వంటివి సృష్టించారు. ఇలాంటి మరెన్నో వినూత్నమైన వస్తువులను రూపొందిస్తున్నారు రవిశంకర్‌రెడ్డి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 50 ఏళ్లు పురస్కరించుకున్న సందర్భంగా కోల్‌కతా మింట్ విడుదల చేసిన రూ.50 మొదటి కాయిన్‌ను 2018లో రవిశంకర్‌రెడ్డి రూ.3,560కు బుక్ చేసుకుని పొందారు. ఆ తర్వాత రూ.500 కాయిన్ సంపాదించారు. మూడేళ్ల కిందట రూ.200 నాణెం సేకరించారు. రెండేళ్ల కిందట రూ.1000 నాణెం సొంతం చేసుకున్నారు. గతంలో రూ.10, రూ.20, రూ.100, రూ.150..వంటి కాయిన్లను సేకరించారు. నాలుగు నెలల కిందట రూ.75, రూ.350, రూ.550 నాణాలు సేకరించిన రవిశంకర్‌రెడ్డి.. రాజ్యసభ 250వ సమావేశాన్ని పురస్కరించుకుని ముంబాయి మింట్ విడుదల చేసిన రూ.250 కాయిన్‌ను సొంతం చేసుకున్నారు. రూ.4,390కు ఈ కాయిన్‌ను కొనుగోలు చేశారు. 40 గ్రాముల సిల్వర్‌తో కూడిన ఆ కాయిన్ ఇటీవల ఆయన చెంతకు చేరింది.
బ్యాక్‌వర్డ్స్ బ్రెయిన్ సైకిల్ ఇదే..
రవిశంకర్‌రెడ్డి తాజాగా బ్యాక్‌వర్డ్స్ బ్రెయిన్ సైకిల్‌ను రూపొందించారు. హ్యాండిల్ ఎడమ వైపు తిప్పితే టైర్ కుడి వైపు, హ్యాండిల్ కుyì వైపు తిప్పితే టైర్ ఎడమవైపు వెళ్తుంది. ఈ సైకిల్ నడిపేవారు రెగ్యులర్ సైకిల్ నడపలేరన్నారు. ఈ సైకిల్ రూపొందించేందుకు 2 నెలల సమయం పట్టిందని, రూ.8,500 ఖర్చుతో దేశంలోనే తొలిసారిగా తానే రూపొందించానని చెప్పారు. దీని పేటెంట్స్ కోసం దరఖాస్తు చేయలేదని, చూడడానికి మామూలు సైకిల్‌గానే కనిపిస్తుందన్నారు. బుర్రపెట్టి నడపాలన్నారు.
అక్కడ అన్నీ ప్రత్యేకం
ఆ ఇల్లు ఓ జంతర్ మంతర్. ఇంట్లోకి అడుగుపెట్టగానే లైట్ వెలుగుతుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మరో గదిలో లైట్ వెలుగుతుంది. ముందు గది లైట్ ఆగిపోతుంది. యాప్ ద్వారా అలెక్సా.. బెడ్‌రూమ్ స్విచ్ ఆన్ లైట్ అనగానే వెలుగుతుంది. అలెక్సా.. స్విచ్ ఆన్ ఫ్యాన్ అనగానే ఫ్యాన్ తిరుగుతుంది. మూడంతస్తుల మేడ పై నుంచి అలెక్సా.. ఓపెన్ ద మెయిన్ గేట్ అనగానే వెంటనే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న మెయిన్ గేట్ ఓపెన్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఇళ్లంతా జంతర్‌మంతర్‌లా ఉంటుంది. సాంకేతికతను ఉపయోగించి.. నోటి మాటతో లైట్లు, ఫ్యాన్లు ఆపరేట్ చేస్తున్నారు.
వినూత్న సైకిళ్లు
తన మేధాశక్తితో అధునాతనంగా సైకిళ్లు రూపొందిస్తున్నారు. యునీ సైకిల్, డ్యూయల్ సైకిల్, కోస్టర్ బ్రేక్, రెట్రా డ్రైవ్, సైడ్ వేస్, బైసింపిల్(చెయిన్ లెస్) తదితర మోడళ్లను తయారు చేశారు. గతేడాది రెట్రా డ్రైవ్ సైకిల్‌ను రూపొందించారు. ఇండియాలోనే తొలి సైకిల్ ఇది అని రవిశంకర్ ‘సాక్షి’కి తెలిపారు. ముందుకు తొక్కితే డబుల్ స్పీడ్(గంటకు 10 కిలోమీటర్లు)తో వెళ్తుందని, వెనక్కి తొక్కితే సింగిల్ స్పీడ్(గంటకు 5 కిలోమీటర్లు)తో నడుస్తుందని చెప్పారు. వ్యాయామం చేసేందుకు ఈ సైకిల్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment