.. సూర్యాపేట జిల్లా ఫణిగిరి గుట్టపై 2003లో జరిపిన తవ్వకాల్లో క్రీస్తుశకం 1– 3 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన 3 అడుగుల సున్నపు రాయి ఫలకం వెలుగు చూసింది. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారే క్రమంలో జరిగిన పరిణామాల చిత్రాలను మూడు వరుసల్లో దానిపై చెక్కారు. అరుదైన ఇలాంటి ఫలకాలకు అంతర్జాతీయ విపణిలో విపరీతమైన డిమాండ్ ఉంది.
తవ్వకాలు జరిపిన కొత్తలో ఈ శిలా ఫలకాన్ని ప్రభుత్వ ఆదీనంలోని ఓ గదిలో భద్రపర్చగా.. 2003 సెపె్టంబర్‌లో దొంగలు దాన్ని ఎత్తుకుపోయారు. పోలీసు బృందాలు జల్లెడ పట్టి సమీపంలోని ఓ ఊరిలో దానిని స్వాదీనం చేసుకున్నారు. కానీ శిలా ఫలకం అప్పటికే రెండు ముక్కలు కావడంతో.. తాత్కాలికంగా అతికించారు.
అయితే ఈ ఫలకాన్ని సురక్షిత ప్రాంతంలో ఉంచాలంటూ కోర్టు ఆదేశించడంతో.. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో సిమెంట్ బేస్ సాయంతో కదలకుండా ఏర్పాటు చేశారు. అయితే నాలుగేళ్ల క్రితం ఈ శిల్పాన్ని విమానంలో ముంబై మ్యూజియానికి తీసుకెళ్లి, తీసుకొచ్చారు. ఆ సమయంలో పగులు విచ్చుకోవటంతో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతికించారు.
ఈసారి అమెరికాకు తరలించి..
అమెరికాలో న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో బుద్ధుడి జీవిత పరిణామ క్రమానికి సంబంధించిన భారతీయ శిల్పాలతో అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానికి మన దేశం నుంచి 94 శిల్పాలను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి 9 ఉన్నాయి.
వీటిలో కరీంనగర్ మ్యూజియంలో ఉన్న నాగ ముచిలింద శిల్పం పగుళ్లతో ఉండటంతో.. దాన్ని వదిలేసి మిగతా 8 శిల్పాలను ఇటీవల విమానంలో తరలించారు. ఇలా తరలించిన వాటిలో ఫణిగిరి సున్నపురాయి ఫలకం కూడా ఉంది. అరుదైన ఈ శిలా ఫలకాన్ని అంత దూరం ఎలా తరలిస్తారని ఇటీవల కొందరు కేంద్ర పురావస్తు శాఖకు ఫిర్యాదు చేశారు.
ఇంతకుముందు రెండు శిల్పాలు ధ్వంసం
దాదాపు 20 ఏళ్ల క్రితం స్టేట్ మ్యూజియం నుంచి బాదామి చాళుక్యుల కాలం నాటి ఎర్ర ఇసుకరాతితో చేసిన దుర్గాదేవి ప్రతిమను విదేశాలకు పంపగా.. రవాణాలో విగ్రహం ముక్కు భాగం దెబ్బతిన్నది. బెర్లిన్‌లో జరిగిన తేజస్ ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లిన ఓ నాగ శిల్పం వెనక భాగంలో దెబ్బతిన్నది. ఇలా అరుదైన శిల్పాలు దెబ్బతిన్న ఘటనలున్నా.. ఇప్పటికే దెబ్బతిని, తిరిగి అతికించిన శిలా ఫలకాన్ని విదేశాలకు తరలించడం అడ్డగోలు చర్య అని ఓ విశ్రాంత ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment