చేడిమాలలో లభ్యమయిన పురాతన శాసనం
వెంకటగిరి: జిల్లాలోని చిల్లకూరు మండలం చేడిమాలలో 1572 నాటి తెలుగు శాసనం గురువారం లభ్యమైంది. భారత పురావస్తుశాఖ అధికారి ఎం.యేసుబాబు, వెంకటగిరికి చెందిన చరిత్రకారుడు షేక్ రసూల్ అహ్మద్ కథనం మేరకు.. వారం రోజులుగా తాము జిల్లాలో చరిత్ర మూలాలపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో చిల్లకూరు మండలం చేడిమాలలో పురాతన ఈశ్వరాలయం వెనుక భాగంలో ముళ్ల పొదల మధ్య 6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పుతో 21 వరుసలు ఉన్న తెలుగు శాసనాన్ని గుర్తించామని తెలిపారు. చేడిమాల చెరువుకు సంబంధించిన శాసనమని పేర్కొన్నారు. ఈ శాసనంలో శాలివాహన శకర్షము, జయ సంవత్సరంలో రాజైన ముద్దుకృష్ణమనాయనికి పుణ్యముగా కొప్పూరి వీరమురసయ్య చేడిమాలలో చెరువును తవ్వించి మాన్యాలను కేటాయిస్తూ గ్రామ అధికారి పర్యవేక్షణలో ఉండేటట్లు నిర్ణయించబడినట్లు ఉందని పురావస్తుశాఖ అధికారి యేసుబాబు వివరించారు. అప్పట్లో ఈ ప్రాంతం దుగరాజపట్నం, వెంకటగిరికి ప్రముఖ కూడలిగా వర్ధిల్లిందని, ఇక్కడ ప్రాచీన కట్టడాలను బట్టి చెప్పవచ్చునన్నారు. జిల్లాలో ముద్దుకృష్ణమనాయునికి సంబంధించి అరుదైన శాసనంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment