ఎమ్మెల్యే కోన చొరవతో గాలిగోపురం
► పనులకు శంకుస్థాపన
► మూడునెలల్లోగా మొదటి దశ పనులు పూర్తి చేస్తాం
► ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఎమ్మెల్యే కోన రఘుపతి
బాపట్ల : బాపట్ల ప్రాంతం ప్రజల చిరకాలకోర్కె, ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నికల హామీల్లో ఒకటైన భావన్నారాయణస్వామి దేవాలయ గాలిగోపురం శంకుస్థాపన ఎట్టకేలకు బుధవారం చేపట్టారు. 2011 అక్టోబరు 23వతేదీన గాలిగోపురం కూలిపోవటం దగ్గర నుంచి ఎంతో మంది ఎన్నోరకాలుగా పనులు చేపట్టేందుకు ప్రయత్నించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రత్యేక చొరవ చూపి పురావస్తుశాఖతో చేసిన సంప్రదింపులు ఫలించాయి. గాలిగోపురం నిర్మాణానికి రూ.2.62 కోట్లు ప్రతిపాదించగా మొదటి విడతగా రూ.95లక్షల నిధులు విడుదల చేయించి తొలి పునాదిరాయి వేయించగలిగారు.
కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ నిజాముద్దీన్ తహిర్, ఏఈలు ఎన్‌సిహెచ్ పెద్దింట్ల, వెంకటేశ్వరరావు, ఆలయ ప్రధాన పూజారి నల్లూరి రంగాచార్యులు సమక్షంలో ప్రత్యేక పూజల మధ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ గాలిగోపురం పనులు ప్రారంభించాలని ఎన్నోసార్లు పురావస్తుశాఖ ఢిల్లీ కార్యాలయం చుట్టూ తిరిగామని చెప్పారు. డిజైన్ నుంచి మెటీరీయల్ వరకు పలుమార్లు అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. వాటిని తిరిగి ప్రతిపాదించటంతోపాటు టెండర్లలో 35 శాతం తక్కువకు కోడ్ చేయటంతో పనులలో జాప్యం నెలకొందని పేర్కొన్నారు. బాపట్లకే తలమానికంగా ఉన్న క్షీరభావన్నారాయణస్వామి దేవాలయం అభివృద్ధి చేయాలనే తలంపు ఈ ప్రాంత ప్రజల కోర్కె అన్నారు.
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణం చేస్తామన్నారు. మూడు నెలల్లోగా మొదటి దశ పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. పురావస్తుశాఖ సూపరింటెండెంట్ నిజాముద్దీన్ తహిర్ మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా గాలిగోపురం పనులు పూర్తి చేస్తామని వివరించారు. బిఎస్ నారాయణభట్టు, తిలక్, బాబునాగేంద్రం, వెదురుపర్తి లక్ష్మణ, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.