MLA Kona Raghupati
-
ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఓ సంతృప్తి ఉంటుంది
‘‘రైటర్‌గా ఓ 20 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఓ సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్. దాంతో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి సినిమా స్టార్ట్ చేశాం. 3.5 కోట్లతో తీసిన ‘గీతాంజలి’ 12 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ ఫీల్డ్‌లో వచ్చినా పోయినా ఒక సంతృప్తి ఉంటుంది’’ అన్నారు కోన వెంకట్. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. అచ్చు, జిబ్రాన్, ప్రసన్న సంగీత దర్శకులు. ఆడియో లాంచ్ ఆదివారం జరిగింది. బిగ్ సీడీని ఆవిష్కరించిన తర్వాత బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి’ సినిమా ఆడియోకి వచ్చావు..ఈ సినిమాకు కూడా రావాలి బాబాయ్ అని మా అబ్బాయ్ ఆహ్వానించాడు. ఆదికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నిన్ను కోరి’ సినిమాతో ఆది నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ‘రంగస్థలం’లో అవకాశం వచ్చినప్పుడు నన్ను అడిగాడు. ‘నీలాంటి పెర్ఫార్మర్‌కి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేయకపోతే, మంచి రోల్స్ చేయడానికి ఎవ్వరూ ఉండరు’ అన్నాను. తను ఏ రోల్‌కి అయినా సూట్ అవుతాడు. ఇంకా హైట్స్‌కి ఎదుగుతాడు’’ అన్నారు నాని. ‘‘నమ్ముకున్న పనిని నిజాయితీగా చేస్తే అదే నీకు తిండి పెడుతుంది’ అనే విషయాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. అదే ఇప్పుడు చేస్తున్నాను. కోనగారు చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఈ కథ తీసుకువచ్చారు. ఆయన ఎగై్జట్‌మెంట్ చూసి సినిమా చేశా’’అన్నారు ఆది. ‘‘ఇది ఎక్స్పెరీమెంటల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా. పని చేసిన అందరికీ సక్సెస్ లభిస్తుంది. ఈ సినిమాను సక్సెస్ చేసి నా బిడ్డను ఆశీర్వదించండి’’ అన్నారు రవిరాజా పినిశెట్టి. ‘‘కొత్త టాలెంట్‌కి ప్లాట్ఫార్మ్ ఇవ్వడానికే కోన ఫిల్మ్ కార్పొరేషన్. ఆది మంచి యాక్టరే కాదు మంచి వ్యక్తి. తాప్సీకి కథ నచ్చిందంటే అందరికీ నచ్చినట్టే. దర్శకుడు హరి వేరే కథతో వచ్చాడు. ఈలోపు ఈ కథ వచ్చింది. ఇది చేశాం. ‘నిన్ను కోరి’ తెచ్చిన సక్సెస్, గౌరవం, మర్యాదని రెట్టింపు చేస్తుంది ‘నీవెవరో’’ అన్నారు కోన వెంకట్. ‘‘కోనగారు కొత్త టాలెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆది తెలుగు వాడు కావడం గర్వకారణం. తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ స్టార్’’ అన్నారు అనిల్ సుంకర. -
ఎమ్మెల్యే కోన చొరవతో గాలిగోపురం
► పనులకు శంకుస్థాపన ► మూడునెలల్లోగా మొదటి దశ పనులు పూర్తి చేస్తాం ► ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల : బాపట్ల ప్రాంతం ప్రజల చిరకాలకోర్కె, ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నికల హామీల్లో ఒకటైన భావన్నారాయణస్వామి దేవాలయ గాలిగోపురం శంకుస్థాపన ఎట్టకేలకు బుధవారం చేపట్టారు. 2011 అక్టోబరు 23వతేదీన గాలిగోపురం కూలిపోవటం దగ్గర నుంచి ఎంతో మంది ఎన్నోరకాలుగా పనులు చేపట్టేందుకు ప్రయత్నించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రత్యేక చొరవ చూపి పురావస్తుశాఖతో చేసిన సంప్రదింపులు ఫలించాయి. గాలిగోపురం నిర్మాణానికి రూ.2.62 కోట్లు ప్రతిపాదించగా మొదటి విడతగా రూ.95లక్షల నిధులు విడుదల చేయించి తొలి పునాదిరాయి వేయించగలిగారు. కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ నిజాముద్దీన్ తహిర్, ఏఈలు ఎన్‌సిహెచ్ పెద్దింట్ల, వెంకటేశ్వరరావు, ఆలయ ప్రధాన పూజారి నల్లూరి రంగాచార్యులు సమక్షంలో ప్రత్యేక పూజల మధ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ గాలిగోపురం పనులు ప్రారంభించాలని ఎన్నోసార్లు పురావస్తుశాఖ ఢిల్లీ కార్యాలయం చుట్టూ తిరిగామని చెప్పారు. డిజైన్ నుంచి మెటీరీయల్ వరకు పలుమార్లు అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. వాటిని తిరిగి ప్రతిపాదించటంతోపాటు టెండర్లలో 35 శాతం తక్కువకు కోడ్ చేయటంతో పనులలో జాప్యం నెలకొందని పేర్కొన్నారు. బాపట్లకే తలమానికంగా ఉన్న క్షీరభావన్నారాయణస్వామి దేవాలయం అభివృద్ధి చేయాలనే తలంపు ఈ ప్రాంత ప్రజల కోర్కె అన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణం చేస్తామన్నారు. మూడు నెలల్లోగా మొదటి దశ పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. పురావస్తుశాఖ సూపరింటెండెంట్ నిజాముద్దీన్ తహిర్ మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా గాలిగోపురం పనులు పూర్తి చేస్తామని వివరించారు. బిఎస్ నారాయణభట్టు, తిలక్, బాబునాగేంద్రం, వెదురుపర్తి లక్ష్మణ, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికుల ఇక్కట్లు
పిట్టలవానిపాలెం/బాపట్ల (గుంటూరు): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 54 మంది యాత్రికులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మోసగించడమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఒకరైన గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం జెడ్పీటీసీ సభ్యుడు చిరసాని నారపరెడ్డి ఫోన్లో తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా నుంచి 20 మంది, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ నుంచి 34 మంది హైదరాబాద్ ఆర్కే ట్రావెల్స్ నుంచి బద్రినాథ్ యాత్రకు వెళ్లేందుకు ఈ నెల 16న టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇందులో భాగంగా 54 మంది యాత్రికులను కేదార్‌నాథ్‌లోని రుద్రప్రయాగ జిల్లా వరకు తీసుకెళ్లారు. ఒప్పం దం ప్రకారం అక్కడి నుంచి బద్రినాథ్‌కు హెలికాఫ్టర్‌లో ట్రావెల్స్వారే తీసుకెళ్లాల్సి ఉంది. అక్కడ దించేసిన తర్వాత వారి గురించి పట్టించుకున్ననాథుడే లేకుండా పోయారు. ట్రావెల్స్ వారికి ఫోన్ చేస్తే సరైన సమాధానం చెప్పకపోవడంతో న్యాయం చేయాలంటూ యాత్రికులు రుద్రప్రయాగ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈలోగా కొంతమంది యాత్రికులు దారి తెలియక తలో దిక్కు అయ్యారు. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి యాత్రికులందరినీ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని కోరామని ఆయన చెప్పారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేయూత గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి కేదార్నాథ్ యాత్రకు వెళ్లి దిక్కుతోచని స్థితిలో ఉన్న పలువురు యాత్రికులను బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆదుకున్నారు. ట్రావెల్స్ సిబ్బంది చేతులెత్తేయడంతో మరి కొందరు కనిపించకుండా పోవడాన్ని నారపరెడ్డి.. ఎమ్మెల్యే కోనరఘుపతి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఢిల్లీలోని ఏపీ భవన్ ఇన్చార్జి శ్రీకాంత్‌తోపాటు రుద్రప్రయాగలోని ఎస్పీ ప్రహ్లాద్ మీనన్‌తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. యాత్రికులందరిని గుప్తకాశీ ప్రాంతంలో సురక్షితంగా ఉంచడంతోపాటు గురువారం కొన్ని ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు.