
సాక్షి, బెంగుళూరు: కన్నడ మాతృ భాషగా వర్థిల్లిన కదంబ రాజ్యానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభించనున్నాయి. కర్ణాటకలో ప్రధాన పట్టణమైన శివమొగ్గకు 80 కి.మీ దూరంలోని తాలగుండ ప్రాంతంలో కదంబ విలసిల్లింది. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలను వెలికితీసేందుకు నమూనా తవ్వకాలను చేపడతామని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు. తవ్వకాలు జరిపే ప్రదేశంలోనే ప్రసిద్ధ ప్రణవేశ్వర స్వామి ఆలయం ఉంది. ఏడున్నర ఎకరాల్లో తవ్వకాలు జరపనున్నట్లు బెంగుళూరు ఏఎస్‌ఐ సూపరింటెండెంట్ కె.మూర్తేశ్వరి తెలిపారు. తవ్వకాలకు సంబంధించిన క్లియరెన్స్‌లు మరో పదిరోజుల్లో వస్తాయని అన్నారు.
కీ.శ.350లో మయూర శర్మన్ కదంబ రాజ్యాన్ని స్థాపించాడని చరిత్ర చెబుతోంది. సుమారు 200 ఏళ్లపాటు ఈ రాజ్యం ఉనికిలో ఉంది. రాజ్యంలో కదంబ చెట్లు అధికంగా ఉండడంతో రాజ్యానికి ఆ పేరు వచ్చిందని ఏఎస్‌ఐ అధికారులు తెలిపారు. ‘ప్రణవేశ్వర ఆలయాన్ని పునఃనిర్మించే క్రమంలో బంగారు, వెండి నాణేలు లభించడంతో మా నమ్మకాలు మరింత బలపడ్డాయి’ అని రిటైర్డ్ ఏఎస్‌ఐ సూపరింటెండెంట్ టీఎం కేశవ అన్నారు. కీ.శ.450 కి చెందిన రాగి శాసనం హాసన్ జిల్లా హాల్మిడి ప్రాతంలో బయటపడిందన్నారు. ఇదే కన్నడ భాషలో లిఖించబడ్డ అతి పురాతన శాసనమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment