అద్భుత ‘ఆదిమ’ చిత్రాల నెలవు తెలంగాణ
పురావస్తు శాఖ ప్రత్యేకాధికారి రంగాచార్యులు
సాక్షి, హైదరాబాద్: ఆదిమ మానవులు గీసిన అద్భుత వర్ణచిత్రాలకు తెలంగాణ నెలవని పురావస్తు శాఖ ప్రత్యేకాధికారి రంగాచార్యులు అన్నారు. అలాంటి చిత్రాలున్న ఎన్నో ప్రాంతాలను గత మూడు దశాబ్దాల్లో సహచర ఉద్యోగులతో కలసి వెలుగులోకి తేవడం తన జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. తెలంగాణ రాతి వర్ణ చిత్రాలపై అంతర్జాతీయ పురావస్తు సదస్సులో ఆయన పత్రాలు సమర్పించారు. యునెస్కో గుర్తింపు పొందిన భీంబెట్కా కంటే వరంగల్ సమీపంలోని పాండవుల గుట్ట గొప్పదన్నారు.
వచ్చే సదస్సు నాటికి వంద ‘ఆదిమ’ ప్రాంతాలు
రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఆదిమ మానవుల వర్ణచి త్రాలున్న 26 ప్రాంతాలనే గుర్తించగా, తదనంతరం తనవంటి వారు వాటిని 66కు చేర్చారు. వచ్చే అంతర్జాతీయ సదస్సు నాటికి ఈ సంఖ్య 100కు చేరవచ్చు.
– ద్యావనపల్లి సత్యనారాయణ, పురావస్తు పరిశోధకుడు
సదస్సు నిర్వహణ భేష్...
సదస్సును గొప్పగా నిర్వహించారంటూ ప్రతినిధులు అభినంది స్తున్నారు. ముఖ్యంగా విదేశీ ప్రతినిధుల నుంచి ప్రత్యేక అభినంద నలు వచ్చాయి.
– రాములు నాయక్, పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు
నాణేలూ చరిత్ర చెబుతాయి: డాక్టర్ రాజారెడ్డి
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో లభించిన పురాతన నాణేలు చరిత్రకు సంబంధించి కొత్త పాఠాలు చెబుతున్నాయని నాణేల సేకరణలో అపూర్వ అనుభవమున్న డాక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు. 3.5 లక్షల నాణేలతో హైదరాబాద్ స్టేట్ మ్యూజియం ప్రపంచంలోనే గొప్ప నాణేల మ్యూజియంగా వర్ధిల్లుతోందన్నారు. హైదరాబాద్‌పై ప్రత్యేకాభిమానం చూపే 92 ఏళ్ల జగదీశ్‌మిట్టల్ నడవలేని స్థితిలో ఉండి కూడా సదస్సులో పాల్గొని పలు సూచనలు చేశారు.
వచ్చే ఏడాది వరంగల్‌లో సదస్సు
పురావస్తు శాఖ నిర్వహించిన తొలి అంతర్జాతీయ సదస్సు విజయవంతం కావడంతో ఇకపై వీటిని ఏటా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి సదస్సు రెండు రోజులు జరగ్గా, ఇకపై మూడు రోజల పాటు నిర్వహించనున్నారు. 2018 జనవరి 18– 20 మధ్య వరంగల్‌లో సదస్సు జరపాలని నిర్ణయించారు. చివరి రోజు ప్రధాన పర్యాటక, పురావస్తు ప్రాంతాల్లో క్షేత్ర పర్యటనలు జరపాలని నిర్ణయించినట్టు పురావస్తు శాఖ సంచాలకురాలు విశాలాచ్చి తెలిపారు.