సాక్షి, హైదరాబాద్: భూ సేకరణ పరిహారం పెంపుపై కింది కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ నివేదిక ప్రకారం అమలు చేయాల్సిన ఎగ్జిక్యూషన్ పిటిషన్ల విలువ రూ.500 కోట్లు ఉంటుందని.. ఇంత పరిహారం చెల్లించాల్సి ఉండగా భూ సేకరణ ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది. పరిహారం చెల్లింపులో తీరు ఇలాగే కొనసాగితే మొత్తం ప్రక్రియను ఆపేస్తామని హెచ్చరించింది. కింది కోర్టులు పరిహారం చెల్లింపుపై ఎన్ని ఉత్తర్వులిచ్చాయి.. వాటిలో ఎన్ని అమలు చేశారు.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి.. ఎంత పరిహారం చెల్లించాల్సి ఉంది.. ఎప్పటిలోపు చెల్లిస్తారు.. తదితర వివరాలతో నివేదికలు సమర్పించాలన్న తమ ఆదేశాలపై ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంపై మండిపడింది.
తెలంగాణ ప్రభుత్వం మొక్కుబడిగా నివేదిక ఇచ్చిందని అసహనం వ్యక్తం చేసిన కోర్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు నివేదిక ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని, లేదంటే స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ మంతోజ్ గంగారావుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈపీలను వెంటనే అమలు చేయాలి
భూ సేకరణ పరిహారం విషయంలో తమ ఉత్తర్వులను కలెక్టర్ అమలు చేయడం లేదని, దీంతో ఉత్తర్వుల కోసం బాధితులు దాఖలు చేస్తున్న ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ) ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పేరుకుపోతున్నాయని హైకోర్టుకు మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి వెంకటకృష్ణయ్య లేఖ రాశారు. లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించిన కోర్టు.. మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఓ నివేదికను ధర్మాసనం ముందుంచగా.. పరిశీలించిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది.
తాము కోరిన వివరాలన్నీ లేవని, ఏదో మొక్కుబడిగా నివేదిక దాఖలు చేసినట్లు అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. నివేదిక సమర్పణకు మరింత గడువు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది కోరగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏదో ఓ నివేదిక ఇచ్చిందని.. ఇప్పటి వరకు మౌనంగా ఉండి, ఇప్పుడు యాంత్రికంగా మరింత గడువు కావాలని కోరుతున్నారంటూ తీవ్రంగా స్పందించింది. కోర్టు ఉత్తర్వులను అధికారులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, గడువు పెంపు కోసం పిటిషన్ దాఖలు చేయకుండా, కేసు విచారణకు వచ్చినప్పుడు గడువివ్వాలని కోరడంలో ఔచిత్యం ఏంటని ప్రశ్నించింది. ఎగ్జిక్యూషన్ పిటిషన్లు పెండింగ్ లో ఉండటం వల్ల కింది కోర్టులపై మోయలేని భారం పడుతోందని.. కేసుల ప్రాముఖ్యత దృష్ట్యా ఈపీలను వెంటనే అమలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment