తనిఖీలతో వ్యాపారుల్లో భయం పుట్టించండి
సాక్షి, హైదరాబాద్: పండ్ల మార్కెట్లలో తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ వ్యాపారుల్లో భయం పుట్టించాలని, అప్పుడే వారు తీరు మార్చుకుని దార్లోకి వస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాల్షియం కార్బైడ్ వినియోగం ద్వారా పండిన పండ్లను తినడం వల్ల కలిగే దుష్ర్పభావాలపై విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించాలని హైకోర్టు మంగళవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కార్బైడ్ వాడిన పండ్లను కొనుగోలు చేయకుండా ప్రజలను చైతన్యపరచాలని స్పష్టం చేసింది. కార్బైడ్ వాడిన పండ్ల విక్రయాలపై ఫిర్యాదు చేసేందుకు సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లను, కార్యాలయాల చిరునామాలను అందుబాటులో ఉంచాలంది.
అర్థం లేని అభ్యర్థనలతో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసే ప్రజాప్రతినిధులు, ఇటువంటి ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటే మంచిదని హితవు పలుకుతూ.. తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు పండ్ల వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వాడుతున్నారని, ఈ విషయంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టులో సుమోటోగా తీసుకుని వి చారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యా జ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తా త్కాలిక ప్రధానన్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. కార్బైడ్ వినియోగాన్ని నియంత్రించి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అండపల్లి సంజీవ్‌కుమార్ ధర్మాసనం ముందుంచారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే విధానాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.